ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు అభం శుభం తెలియని చిన్నారులు. తాము ఎందుకు హత్యకు గురవుతున్నారో తెలియని పరిస్ధితి. హత్య అయిన తరువాత అమ్మ నాన్నలకు కనీసం ఆచూకి కూడా తెలియని దుస్ధితి ఇది యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్‌లో దారుణ హత్యకు గురైన శ్రావణి ఘటన అనంతరం వెలుగు చూసిన వాస్తవాలు ఇవి.
హాజీపూర్‌లో గత గురువారం దారుణ హత్యకు గురైన శ్రావణి హత్య కేసులో ఒక్కో నిజం వెలుగు చూస్తోంది. గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి ఈ హత్యకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. శ్రావణి మృతదేహం వెలికి తీస్తుండగా బావి మూలలో ఓ కాలేజ్ బ్యాగును పోలీసులు గుర్తించారు .అనుమానం వచ్చి చూడగా అందులో గ్రామానికి చెందిన మనీషా ఐడీ కార్డ్ ఉండటంతో మరింత లోతుగా దర్యాప్తు చేశారు. బావిలోనే మరో ప్రాంతంలో మట్టి తీసి పోసినట్టుగా ఉండటంతో తవ్వకాలు జరిపారు. లభించిన ఆనవాళ్లను బట్టి గ్రామానికి చెందిన మనీషాగా గుర్తించారు. బికాం ఫస్ట్ ఇయర్ చదువుతున్న మనీషా గత నెల 5వ తేదిన మిస్సింగ్‌కు గురైంది. అయితే ప్రేమ వివాహం చేసుకుందని భావించిన తల్లిదండ్రులు బయటకు చెప్పలేదు. దీంతో ఈ విషయం వెలుగు చూడలేదు. నాలుగేళ్ల క్రితం గ్రామానికి వచ్చిన 11 ఏళ్ల చిన్నారి కల్పన కూడా ఇదే తరహాలోనే మిస్సింగ్ అయింది. అమ్మమ్మ గ్రామానికి వేసవి సెలవుల కోసం వచ్చిన కల్పన తరువాత ఆచూకి తెలియకుండా పోయింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేసిన ఫలితం లేకపోవడంతో గతేడాది కేసును మూసివేశారు. తాజాగా వెలుగుచూసిన ఘటనలతో కేసును మరోసారి విచారిస్తున్నారు.
మరోవైపు వరుస హత్యల నేపథ్యంలో హాజీపూర్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సీరియల్ కిల్లర్ శ్రీనివాసరెడ్డి ఇంటిపై గ్రామస్తులు దాడి చేశారు. ఆవేశంతో ఉన్న గ్రామస్థులు శ్రీనివాస్ ఇంటిని తగలబెట్టారు. క్షణాల్లో ఇల్లు మొత్తం మంటలు అంటున్నాయి. అడ్డుకున్న పోలీసులపైనా దాడికి యత్నించారు శ్రీనివాస్‌రెడ్డిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.