దెయ్యం..భయం ఆ ఊరి ప్రజలను వెంటాడుతోంది. రాత్రి వేళ దెయ్యం సంచరిస్తుందన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి..దెయ్యం ఏ రూపంలో ఉంటుందో తెలియదు. అయినా కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న దెయ్యం పని బడుతామంటూ రెయింబవళ్లు కాపాల కాస్తున్నారు అక్కడి ప్రజలు. నిజంగా దెయ్యం సంచరిస్తుందా గ్రామస్థులు చెబుతున్న దాంట్లో వాస్తవం ఎంత ఉంది.
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం టెక్కలి వాసులు భయంతో వణికిపోతున్నారు.. ఎదో తెలియని రూపం ఆ గ్రామస్థులను కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. వారం రోజులుగా గ్రామంలోని పొలంలో రాత్రి ఏడు గంటల తర్వాత తల కాలు లేని ఓ తెల్లని రూపం కనిపిస్తోందంటూ జనం భయపడుతున్నారు. రాత్రి వేళ దెయ్యం ఊరి పొలిమెరల్లో తీష్ట వేసిందంటున్నారు. ఎవరైనా దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేస్తే రాళ్లతో దాడి చేస్తుందంటున్నారు గ్రామస్థులు.గ్రామంలో తిరుగుతున్న దెయ్యం కొంత సేపు మాత్రమే కనిపించి అదృశ్యమవుతుందంటున్నారు. వారం రోజులుగా ఇదే తంతు జరుగుతుండటంతో రాత్రి సమయంలో గ్రామస్తులు షిఫ్టులు వారిగా కాపలా కాస్తున్నారు. నిజంగానే మా కళ్ల ముందే దెయ్యం సంచరిస్తుందంటున్నారు కొందరు గ్రామస్థులు.
ఇది ఇలా ఉండగా దెయ్యం సంచరిస్తుండంటూ గ్రామస్థులు చెబుతున్న మాటలను అధికారులు తోసిపుచ్చారు. దెయ్యాలు, భూతాలు అనేవి ఏమీ లేవని స్పష్టం చేశారు. ఎవరో కొందరు కావాలనే ఇలాంటు ప్రచారం చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గాలి వార్తలకు ప్రజలు భయబ్రాంతులకు లోను కావాల్సిన అవసరం లేదంటున్నారు పోలీసులు. నేటి ఆధునిక సమాజంలోనూ దెయ్యాల సంచారం వంటి వాటిని నమ్ముతూ ప్రజలు భయబ్రాంతులకు గురికావడం కొంత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇలాంటి వాటిపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు పలువురు.