పదోతరగతి విద్యార్ధిని శ్రావణి హత్యకేసులో పోలీస్ ఉన్నతాధికారులు శాఖాపరమైన చర్యలు చేపట్టారు. ఈ వ్యవహారంలో బొమ్మలరామారం ఎస్‌ఐవెంకటేష్‌పై ఉన్నతాధికారులు వేటు వేశారు. హెడ్ క్వార్టర్‌కి అటాచ్ చేస్తూ భువనగిరి డీసీపీ నారాయణరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అప్పటి వరకు బీబీ నగర్ ఎస్‌ఐకి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. శ్రావణి కనిపించడం లేదంటూ బుధవారం సాయంత్రమే తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా ఎస్‌ఐ వెంకటేష్ స్పందించలేదని తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ నేపధ్యంలో బదిలీ వేసినట్టు తెలిసింది. విద్యార్థిని శ్రావణి హత్య కేసులో నిర్లక్ష్యం వహించారని ఎస్‌ఐపై చర్యలు తీసుకున్నారు.
గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో అత్యాచారానికి గురై హత్య అయిన శ్రావణి మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తయ్యింది. భువనగిరి ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించిన అనంతరం బంధువులకు మృతదేహాన్ని అందజేశారు. బంధువులు, గ్రామస్తుల శోకసంద్రాల నడుమ హాజీపూర్ గ్రామానికి శ్రావణి మృతదేహాన్ని తరలించారు. మరో వైపు శ్రావణి హత్య కేసు నిందితులను కఠినంగా శిక్షించాలంటూ హైదరాబాద్- వరంగల్ హైవేపే హాజీపూర్ గ్రామస్తుల ఆందోళనకు దిగారు. మరోవైపు తన కూతురుని అత్యంత దారుణంగా హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు శ్రావణి తండ్రి. పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే శ్రావణి హత్య జరిగిందని తండ్రి నర్సింహ ఆవేదన చెందుతున్నారు. కాగా హాజీపూర్ గ్రామపంచాయతి మధ్యలో నిలబెట్టి శిక్ష విధించాలని అక్కడి గ్రామస్థులు కోరుతున్నారు.