యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) లో గత 24 గంటల్లో 412 కరోనావైరస్ మరణాలు సంభవించాయి, దీంతో మొత్తం మరణాల సంఖ్య 37,460 కు చేరుకుంది, గతంతో పోల్చుకుంటే యూకేలో మరణాల సంఖ్య భారీగా తగ్గిందనే చెప్పాలి. గతంలో అయితే మరణాలు వేలాది సంఖ్యలో వచ్చేవి.. ఇప్పుడు మాత్రం ఆ సంఖ్య వందలకు పడిపోవడం కొంత ఊరట కలిగించే అంశమే అంటున్నారు వైద్యులు. కాగా తాజా సమాచారం ఆరోగ్య మరియు సామాజిక సంరక్షణ శాఖను ఉటంకిస్తూ సిఎన్ఎన్ నివేదించింది.
తాజాగా ప్రభుత్వం చెబుతోన్న గణాంకాల ప్రకారం, మంగళవారం సాయంత్రం నుండి బుధవారం వరకూ 2,013 మంది వైరస్ పాజిటివ్ అని తేలింది. దీంతో యూకేలో మొత్తం ధృవీకరించబడిన కేసుల సంఖ్య ఇప్పుడు 267,240 గా ఉంది అని సిఎన్ఎన్ తెలిపింది. పరీక్షించిన మొత్తం వ్యక్తుల సమాచారం అందుబాటులో లేనప్పటికీ, మొత్తం 3,798,490 పరీక్షలు జరిగాయని ప్రభుత్వం నిర్ధారించింది, మంగళవారం 117,013 పరీక్షలు జరిగాయి.