
ధరలు పెరుగుతాయనే భయంతో అమెరికన్స్ ఎక్కువగా కొంటున్నవి ఇవే
Impact of Donald Trump's tariffs in USA: అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అన్ని దేశాలపై సుంకం పెంచిన విషయం తెలిసిందే. ఈ టారిఫ్స్ పెంపు కారణంగా అమెరికా విదేశాల నుండి ఏ ఉత్పత్తులనైతే ఎక్కువగా దిగుమతి చేసుకుంటుందో, ఆ ఉత్పత్తుల ధరలు అమాంతం పెరగనున్నాయి. దీంతో అమెరికన్స్ ముందే అప్రమత్తం అవుతున్నారు. సుంకం పెంపు ప్రభావంతో ధరలు పెరగక ముందే వీలైనంత వరకు ఆయా ఉత్పత్తులు స్టాక్ పెట్టుకోవాలని చూస్తున్నారు.
జనం సూపర్ మార్కెట్ స్టోర్లకు, ఎలక్ట్రానిక్స్ స్టోర్లకు పరుగులు తీస్తున్నారు. దీంతో స్టోర్లలో కొన్ని రకాల ఐటమ్స్ సెల్ఫ్‌లు త్వరత్వరగా ఖాళీ అవుతున్నాయి. ఆ జాబితాలో నిత్యవసర సరుకుల నుండి మొదలుకుని బ్రాండెడ్ బట్టలు, స్మార్ట్ ఫోన్స్, ఎలక్ట్రానిక్స్ వరకు అనేకం ఉన్నాయి. స్టీల్, అల్యూమినియం ధరలు కూడా పెరగనుండటంతో బిల్డింగ్ మెటీరియల్స్ కూడా కొనిపెట్టుకుంటున్నారని అమెరికన్ మీడియా కథనాలు చెబుతున్నాయి.
అమెరికాలో ఏయే ఉత్పత్తులు, వస్తుసామాగ్రి ధరలు పెరగనున్నాయంటే...
అమెరికన్ సూపర్ మార్కెట్స్‌లో వెంటవెంటనే ఖాళీ అవుతున్న స్టాక్స్‌లో పండ్లు, కూరగాయలు, పాలతో తయారు చేసే ఇతర డైరీ ప్రోడక్ట్స్ ఎక్కువగా ఉంటున్నాయి. సూపర్ మార్కెట్స్ ఇప్పుడు ఈ ఉత్పత్తుల కోసం వెంటవెంటనే ఆర్డర్స్ పెడుతున్నాయి.
అమెరికాకు విదేశాల నుండి దిగుమతి అయ్యే వాటిలో వాహనాల విడి భాగాలు, స్మార్ట్ ఫోన్స్, ల్యాప్‌టాప్స్ వంటి ఎలక్ట్రానిక్స్, బ్రాండెడ్ బట్టలు, చెప్పులు, మెడిసిన్స్, కొన్నిరకాల వ్యవసాయ, ఆహార ఉత్పత్తులు అధికంగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఆ అన్నిరకాల ఉత్పత్తులకు ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉంది. అమెరికాలో ఆర్థిక నిపుణుల విశ్లేషణలు వింటున్న జనం ముందుగానే స్టోర్లకు వెళ్లి ఆయా రకాల ఉత్పత్తులు కొని పెట్టుకుంటున్నారు. దీంతో రాబోయే రోజుల్లో అమెరికన్స్ నెలవారీ ఖర్చులు కూడా పెరిగే ప్రమాదం లేకపోలేదు.
తొందరపడి నష్టపోవద్దు - నిపుణులు
అమెరికాలో ఇలా స్టోర్లలో ఎగబడి సరుకులు కొంటున్న వారిని ఉద్దేశించి నిపుణులు పలు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. సుంకం పెంపు తరువాత ధరలు పెరుగుతాయనే భయంతో ప్యానిక్ అయి నిల్వ ఉండని సరుకులను మోతాదుకు మించి కొనుగోలు చేయొద్దని సూచిస్తున్నారు. లేదంటే అవి నిల్వ చేయలేకపోవడం వల్ల కూడా ఎక్కువ నష్టపోవాల్సి వస్తుందని అంటున్నారు. ముఖ్యంగా ఆహార ఉత్పత్తుల విషయంలో మరీ జాగ్రత్తగా షాపింగ్ చేయాల్సిందిగా చెబుతున్నారు. స్మార్ట్ ఫోన్స్, ల్యాప్ టాప్స్ వంటి డ్యూరబుల్ ఎలక్ట్రానిక్స్ గూడ్స్ కొనుగోలు చేస్తే ఇబ్బంది లేదు కానీ నిల్వ చేసుకోలేని వాటిని కొని వాటితో ఇబ్బంది పడకూడదనేది వారి సలహా.