అమెరికా ఎన్నికల ఫలితాల పై ఇంకా తొలగని ఉత్కంఠ..
అమెరికా ఎన్నికలలో గెలుపు లెక్క ఇంకా తేలలేదు. ప్రధాన అభ్యర్దులు ఇద్దరూ గెలుపు మాదంటే.. మాదని చెప్పుకుంటున్నా.. డెమొక్రేటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ అధ్యక్ష పీఠానికి సమీపంలో ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకునే అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపులో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. డెమొక్రేటిక్ పార్టీ అభ్యర్ధి జో బైడెన్.. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ ల మధ్య హోరా హోరీ గా బ్యాలెట్ పోరు సాగుతోంది. రెండు పార్టీల అభిమానులు విజయం తమదంటే.. తమదనే ధీమాలో ఉన్నారు. అయితే, పూర్తిగా ఫలితాలు తేలడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.
ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల ప్రకారం 264 ఎలక్టోరల్ ఓట్లతో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ విజయానికి ఆరు ఓట్ల దూరంలో ఉన్నారు. సంపూర్ణ విజయానికి 270 ఎలాక్త్రోల్ ఓట్లు కావాలి. విస్కాన్సిన్, మిషిగాన్ రాష్ట్రాల్లో విజయం సాధించడం బైడెన్‌కు అనుకూలించింది. మరోవైపు, ట్రంప్ కేవలం 214 ఎలక్టోరల్ ఓట్లతో విజయానికి చాలా దూరంలో ఉన్నారు. అయితే, ఫలితాలు వెలువడాల్సిన రాష్ట్రాలు తన ఖాతాలోనే పడతాయని, దాంతో విజయం తనకే దక్కుతుందని ట్రంప్ నమ్మకంతో ఉన్నారు.
ఇంకా జార్జియా, పెన్సిల్వేనియా, నార్త్ కరొలినా, నెవడా, అలస్కాల్లో ఫలితాలను ప్రకటించాల్సి ఉంది. 11 అరిజోనా ఎలక్టోరల్ ఓట్లు ఉన్న అరిజోనా ఫలితాన్ని పలు మీడియా సంస్థలు ఇంకా నిర్ధారించలేదు. 'సీఎన్‌ఎన్' సంస్థ అరిజోనాను మినహాయించి బైడెన్ సాధించిన ఎలక్టోరల్ ఓట్లు 255 అని పేర్కొంది. అరిజోనాలో కౌంటింగ్ ముగియలేదని, 86% కౌంటింగ్ అనంతరం, బైడెన్ 68 వేల మెజారిటీతో ఉన్నారని పేర్కొంది. కానీ, మెజారిటీ మీడియా సంస్థలు మాత్రం అరిజోనాను బైడెన్ ఖాతాలో వేసి, ఆయన గెల్చుకున్న ఎలక్టోరల్ ఓట్ల సంఖ్య 264 అని పేర్కొన్నాయి.
ఇక 20 ఎలక్టోరల్ ఓట్లు ఉన్న పెన్సిల్వేనియాలో 91% ఓట్ల కౌంటింగ్ పూర్తయిన తరువాత ట్రంప్ 1,35,671 ఓట్ల మెజారిటీతో ఉన్నారు. ఇక్కడ 71% పోస్టల్ ఓట్ల కౌంటింగ్ పూర్తయింది. ఇంకా, 7.63 లక్షల ఓట్లను లెక్కించాల్సి ఉంది. అలాగే, నార్త్ కరోలినాలో 95% కౌంటింగ్ ముగిసిన తరువాత ట్రంప్‌నకు 77,337 ఓట్ల మెజారిటీ ఉంది. ఇక్కడ ఉన్న ఎలక్టోరల్ ఓట్ల సంఖ్య 15. 16 ఎలక్టోరల్ ఓట్లు ఉన్న జార్జియాలో 96% కౌంటింగ్ అనంతరం ట్రంప్ మెజారిటీ 18,586కి తగ్గింది. ఇక్కడ ఇంకా 90, 735 ఓట్లను లెక్కించాల్సి ఉంది.
6 ఎలక్టోరల్ ఓట్లు ఉన్న నెవడాలో 86% కౌంటింగ్ తరువాత బైడెన్ 8వేల స్వల్ప ఆధిక్యతలో ఉన్నారు. తాను ఆధిక్యతలో ఉన్న రాష్ట్రాలతో పాటు, బైడెన్ ఆధిక్యతలో ఉన్నవాటిలో ఒక్క రాష్ట్రాన్నైనా చేజిక్కించుకుంటే.. ట్రంప్‌నకు విజయం సాధ్యమవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. విజయం దక్కని పక్షంలో.. కోర్టులో తన పోరాటాన్ని కొనసాగించాలని ట్రంప్ నిర్ణయించారు. అందులో భాగంగానే, ఇప్పటికే పలు రాష్ట్రాల్లోని కోర్టుల్లో ఆయన కేసులు వేశారు. కౌంటింగ్‌ను నిలిపేసేలా ఆదేశాలివ్వాలని ఆయన కోర్టులను అభ్యర్థించారు. ఈ దిశగా సుప్రీంకోర్టులోనూ ఆయన కేసు వేశారు. పోరాటం ఇంకా ముగియలేదని, తాము రేసులోనే ఉన్నామని రిపబ్లికన్ పార్టీ నేషనల్ కమిటీ అధ్యక్షురాలు రొన్నా మెక్‌డేనియల్ చెప్పారు.