శాసనసభ సమావేశాలకు ముహూర్తం ఖరారు కావటంతో స్పీకర్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. సమావేశాల రెండో రోజే స్పీకర్ ఎన్నిక జరగనుండటంతో... స్పీకర్‌గా ఎవరు కూర్చుంటారనేది ఆసక్తిగా మారింది. సీనియర్ల నుంచి జూనియర్ల వరకు మాకొద్దు బాబాయ్ అంటూ ఉండటంతో స్పీకర్‌గా ఎవరిని ప్రతిపాదిస్తారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
శాసనసభ తొలిసమావేశాలు ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్నాయి. నాలుగురోజుల పాటు జరగనున్న సమావేశాల్లోనే ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం తో పాటు అసెంబ్లీ స్పీకర్ , డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. స్పీకర్ , డిప్యూటీ స్పీకర్ పదవులకు 18 న ఎన్నిక జరగబోతోంది. మంత్రి వర్గంలో చోటు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు.. స్పీకర్ పదవిపై మాత్రం విముఖత చూపుతున్నారు. ఇప్పటికే కొంది మంది పేర్లు ప్రచారంలో ఉండటంతో.. ఆనేతలంతా పార్టీ పెద్దలను కలిసి తమకు ఆపదవి వద్దని మొరపెట్టుకున్నట్లు తెలుస్తోంది. స్పీకర్ సీట్లో కూర్చున్న నేతలంతా ఆ తర్వాత .. వచ్చే ఎన్నికల్లో ఓడి పోతుండటం సెంటిమెంట్ గా మారటంతో ఆసీటంటేనే ఎమ్మెల్యేలు బెంబేలెత్తుతున్నారు.
స్పీకర్ పదవి తమకు వద్దంటూ నేతలు.. చెప్పుకున్నా.. కేసీఆర్ డిసైడ్ చేశాక తప్పని సరిగా ఆ సీట్లో కూర్చోవలసిందేనని పార్టీలోని సీనియర్ నేతలు చెబుతున్నారు. భవిష్యత్‌కు భరోసారి కల్పించేలా ... సీఎం కేసీఆర్ ... హామీ ఇచ్చి స్పీకర్ అభ్యర్ధిని ప్రతిపాదిస్తారని ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇప్పటికే కేసీఆర్ ఓ స్పష్టతకు వచ్చినట్టు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి స్పీకర్ పదవి జాబితాలో మాజీ మంత్రులు ఈటెల రాజేందర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మా రెడ్డి తో పాటు సీనియర్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. తాజాగా ఆదిలాబాద్ జిల్లా సీనియర్ నేత, మాజీ మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి పేరు కూడా పరిశీలనలోకి వచ్చినట్లు సమాచారం. ఇక గత అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ గా వ్యవహరించిన పద్మా దేవేందర్ రెడ్డి కి స్పీకర్ గా ప్రమోషన్ వస్తుందన్న చర్చ సైతం జరుగుతున్న నేపధ్యంలో .. బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని ప్రతిపాదించే అవకాశాలున్నట్టు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.