ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడంటున్నారు. వాడు పోతే వీడు... వీడు పోతే వాడు... ఇక ఛాన్స్ ఇచ్చేది లేదంటున్నారు. హస్తిన పీఠం మాదంటే మాదంటూ కత్తులు నూరుతున్నారు. జనం మావైపే ప్రభంజనం మాదేనంటూ కమలనాథులు ధీమాగా ఉన్నారు. ఐదు రాష్ట్రాల్లో అసలు సంగతి తేలింది కదా... ఇక హస్తిన పీఠం కూడా మాదేనంటున్నారు హస్తం నేతలు. రెండు ప్రధాన పార్టీల మధ్య... ప్రాంతీయ పార్టీలు చక్రం తిప్పుతామంటున్నాయి. మోదీ తర్వాత దీదీయేనంటూ తృణమూల్ తేల్చిచెబుతోంది. కాబోయే ప్రధాని కేసీఆరేనంటూ గులాబీ గుట్టు విప్పింది. మరి హస్తిన ఏం చెబుతోంది? ప్రధాని పీఠం ఎవరిదంటోంది? ఎన్నికల ఏడాదిలో మారే రాజకీయ సమీకరణలేంటి? చూస్తుండగానే ఐదేళ్ల కాలం కరిగిపోయింది. క్యాలెండర్ కూడా పేజీ మారింది. ఎన్నికల ఏడాదిలోకి ఎంటరైంది. ఐదేళ్ల కాలగమనంలో రాజకీయాల్లో ఎన్నో మార్పులు. జనం ప్రభంజనం మధ్య 2014లో ఉర్రూతలూగించిన మోడీ... ఇప్పుడు కాస్త డిఫెన్స్‌లో పడ్డారంటున్నారు విశ్లేషకులు. పడుతూ లేస్తూ... లేస్తూ పడుతూ చివరకు కాస్త కుదుటపడ్డ కాంగ్రెస్... ఇప్పుడు కదనోత్సాహంతో కత్తులు నూరుతుంది. ఇటు మోడీని.. అటు రాహుల్‌ను కాదని హస్తిన పీఠాన్ని దక్కించుకునే ధీరుడెవరు?
ఈసారి ఎలాగైనా హస్తినలో ప్రాంతీయ పార్టీలు పాగా వేయాలని శతవిధాల ప్రయత్నిస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే పావులు కదుపుతున్నాయి. ప్రధాన పార్టీలను ఎదుర్కొనే వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ భారత ఫెడరల్ ఫ్రంట్ అంటూ రీజనల్ పార్టీలను ఏకం చేస్తున్నారు. నిజామాబాద్ ఎంపీ, కేసీఆర్ కూతురు కవిత... భావి ప్రధాని కేసీఆర్ అంటూ ఓ స్టేట్‌మెంట్ కూడా ఇచ్చేశారు. ఎన్డీయేతర సర్కార్ అంటూ ఏపీ సీఎం మోడీని ఎదుర్కొంటున్నారు. చంద్రబాబే మళ్లీ చక్రం తిప్పే నేత అంటూ ఢిల్లీ వేదికగా తమ్ముళ్లూ తెగ చెప్పేసుకుంటున్నారు.
ఇంతలోనే తృణమూల్ పార్టీ ఓ వీడియోను రిలీజ్ చేసింది. పార్టీ ఆవిర్భావ వేడుకల్లో తృణమూల్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ అల్లుడు అభిషేక్ బెనర్జీ ఓ డిక్లరేషన్ ఇచ్చేశాడు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ తమ ప్రధాని అభ్యర్థిగా మమతాబెనర్జీయేనంటూ ప్రకటించారు. లౌకిక, ప్రగతిశీల భారతావని నిర్మాణం కోసం ఆమె సారథ్యంలో కలసి పనిచేద్దామంటూ వీడియో సందేశం ఇవ్వడం ఇప్పుడు దేశవ్యాప్త చర్చకు దారితీస్తోంది. మొదటి నుంచి కూడా ప్రధాని పీఠంపై కన్నేసిన మమత- ఆ దిశగా ప్రాంతీయ పార్టీలను చేరదీశారు. దానికి అనుగుణంగా వ్యూహాలు రచించారు. రాష్ట్రాల వారీగా బీజేపీని- అక్కడ బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలే ఎదుర్కోవాలని, ఆ ప్రాంతీయ పార్టీలకు జాతీయ పక్షాలు, మిగిలిన పార్టీలు మద్దతివ్వాలని మొట్టమొదటిగా ప్రతిపాదించింది కూడా మమతే కావడం విశేషం.
ఈ మధ్యే మమతను తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా కలిశారు. రాహుల్‌గాంధీని ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్‌తో పాటు డీఎంకే లాంటి కొన్ని పార్టీలు ప్రొజెక్ట్ చేస్తున్నాయి. దీంతో మమత కాంగ్రెస్-సారథ్య మహాకూటమికి కొద్దినెలలుగా దూరంగా మసలుతున్నారు.. ఈ దశలో ప్రధాని అభ్యర్థిగా ఆమెను తృణమూల్ ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. 2019 ఓ పెద్ద మార్పు తీసుకొచ్చే ఏడాది కావాలంటున్న తృణమూల్... కార్మికుల కోసం, పీడిత ప్రజల అభ్యున్నతి కోసం ఓ కీలక పాత్ర పోషించేందుకు మమతాబెనర్జీ సిద్ధంగా ఉన్నారని పార్టీ నేతలు ప్రకటించుకుంటున్నారు. ఆ వెంటనే మాజీ ప్రధాని దేవెగౌడ్ కూడా స్పందించారు. రాబోయే ఎన్నికల్లో మమతాబెనర్జీ ప్రధాని అభ్యర్థిగా కూటమి నుంచి నిలబెడితే తమకు ఓకే అంటూ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారు. ఇప్పుడే అసలు చిక్కొచ్చి పడింది. భారత ఫెడరల్ ఫ్రంట్ కేసీఆర్... ఎన్డీయేతర సర్కార్ అంటూ ఏపీ సీఎం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలకు మిగిలిన పార్టీల నుంచి వచ్చే సంకేతాలేంటన్న దానిపై చర్చ మొదలైంది.