ఫెడరల్ చర్చల తర్వాత ఏపీ రాజకీయం హీటెక్కిందా?
జగన్-కేటీఆర్ ఫెడరల్ ఫ్రంట్ చర్చల తర్వాత, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. జగన్ తన లండన్ పర్యటన రద్దు చేసుకున్నారు. కీలకమైన దావోస్ పర్యటనను చంద్రబాబు వాయిదా వేసుకున్నారు. ఎన్నికల ప్రధానాధికారి బదిలీ అయ్యారు. ఒకదాని వెంట ఒకటి, వరుసగా సంభవిస్తున్న పరిణామాలు, ఏపీ రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి
జగన్-కేటీఆర్ ఫెడరల్ ఫ్రంట్ చర్చల తర్వాత, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. జగన్ తన లండన్ పర్యటన రద్దు చేసుకున్నారు. కీలకమైన దావోస్ పర్యటనను చంద్రబాబు వాయిదా వేసుకున్నారు. ఎన్నికల ప్రధానాధికారి బదిలీ అయ్యారు. ఒకదాని వెంట ఒకటి, వరుసగా సంభవిస్తున్న పరిణామాలు, ఏపీ రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. ఇంతకీ బాబు, జగన్‌లు ఫారెన్ టూర్లను ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నారు? ఎలాంటి చర్చల్లో తలమునకలయ్యారు?
జగన్, కేటీఆర్‌ల మధ్య ఫెడరల్ ఫ్రంట్ చర్చల తర్వాత, ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు వేడెక్కాయి. పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. సీఎం చంద్రబాబు తన దావోస్ పర్యటన రద్దు చేసుకున్నారు. అటు కుటుంబ సభ్యులతో, లండన్ వెళ్లాల్సిన వైసీపీ అధినేత జగన్, తన టూర్‌ను క్యాన్సిల్ చేసుకున్నారు. అటు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సిసోడియాను, సడన్‌గా బదిలీ చేయడం కూడా హాట్ టాపిక్‌గా మారింది. దీంతో అసలు ఏపీలో ఏం జరుగుతోందోనన్న ఉత్కంఠ పెరుగుతోంది.
దావోస్‌లో ప్రతిష్టాత్మకంగా జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సుకు వెళ్ళకూడదని ఏపీ చంద్రబాబు నిర్ణయించుకున్నారు. పార్టీలో చేరికలు, ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పర్యటన రద్దు చేసుకున్నట్లు సమాచారం. చంద్రబాబు తరపున ప్రపంచ ఆర్థిక సదస్సుకు ఏపీ మంత్రి లోకేశ్ వెళ్తున్నారు. లోకేశ్ నేతృత్వంలో 17 మంది ఏపీ బృందం, ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనడానికి దావోస్ వెళ్ళబోతోంది. ఈ నెల 22 నుంచి 25 వరకు దావోస్‌లో ఏపీ ప్రతినిధులు పర్యటిస్తారు.
అటు వైసీపీ అధినేత జగన్ కూడా అలర్టయ్యారు. అనూహ్యంగా తన లండన్ పర్యటన రద్దు చేసుకున్నారు. గురువారం ఉదయమే కుటుంబ సభ్యులతో కలిసి, జగన్ హైదరాబాద్ నుంచి లండన్‌కు వెళ్లాల్సి ఉంది. పాదయాత్ర తర్వాత, సుమారు 15 నెలల తర్వాత తన పెద్ద కుమార్తె వర్షా రెడ్డిని చూడటానికి ఫ్యామిలీతో కలిసి లండన్‌కు వెళ్లాలనుకున్నారు. కానీ సడన్‌గా తన పర్యటన రద్దు చేసుకోవడం, చర్చనీయాంశమైంది.
విదేశీ పర్యటనలు రద్దు చేసుకున్న చంద్రబాబు, జగన్‌లు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది. వీలైనంత త్వరగా అభ్యర్థులను ప్రకటించాలని, ఇరువురు నాయకులు ఆలోచిస్తున్నారు. రెండురోజులుగా పొద్దున్నుంచి, రాత్రి పొద్దుపోయే వరకు చంద్రబాబు పార్టీ కీలక నేతలతో సమాలోచనలు జరుపుతున్నారు. పూర్తిగా అభ్యర్థుల ఎంపికపైనే దృష్టిసారించారు. అటు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ కూడా, అభ్యర్థుల వడపోతపై దృష్టిపెట్టారు. అందరికంటే ముందే ప్రకటించి, రేసులో ఫ్రంట్‌లో ఉండాలని, ఇద్దరు నాయకులూ ఉవ్విళ్లూరుతున్నారు.
తెలంగాణ ఎన్నికల్లో అభ్యర్థులను, అందరికంటే ముందే ప్రకటించి విజయబావుటా ఎగరేశారు కేసీఆర్. ఇప్పుడు ఆంధ‌్రప్రదేశ్ అధికార, విపక్ష నేతలు కూడా ఇదే ఫార్ములా ఫాలో కావాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే ఫారెన్ టూర్లను సైతం వాయిదా వేసుకుని, గెలుపు గుర్రాలను ఫైనల్ చేసి, వారి పేర్లను ప్రజల్లోకి వేగంగా తీసుకెళ్లాలని, వ్యూహప్రతివ్యూహాలకు పదునుపెడుతున్నారని తెలుస్తోంది.