తెలంగాణలో అతిపెద్ద క్షైవక్షేత్రం వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయం జాతర శోభ సంతరించుకుంది. భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా ప్రఖ్యాతిగాంచిన ఆది దేవుడు వరాలు ఇచ్చే ఐశ్వర్య ప్రదాతను మహాశివరాత్రి సందర్భంగా దర్శించుకోవడానికి భక్తజనం తరలివస్తున్నారు. కనీవిని ఎరుగని రీతిలో సంస్కృతి, సంప్రదాయాలు చాటి చెప్పే విధంగా వేడుకలు నిర్వహించడానికి అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేపట్టింది.
మహాశివరాత్రి వేడుకలకు వేములవాడ ముస్తాబైంది. పేదల దేవుడిగా కోరిన కోర్కెలు తీర్చే వేములవాడ రాజన్న సన్నిధిలో జరిగే మహశివరాత్రి జాతర వైభవంగా నిర్వహించనున్నారు. మూడు రోజుల పాటు జరిగే మహాశివరాత్రి జాతరకు దాదాపు నాలుగు లక్షలకు పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. తెలంగాణ నుంచే కాకుండా అంధ్రప్రదేశ్, మహరాష్ర్ట, ఛత్తీస్ ఘడ్ రాష్ర్టాలతో పాటు భక్తులు రానున్నారు. సిరిసిల్ల, వేములవాడ ఎమ్మెల్యేలు కేటిఆర్, రమేష్ బాబులు సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
రాజన్నను దర్శించుకునే భక్తులు రాజన్న ప్రసాదాలపై అంతే మక్కువ చూపుతారు. పెద్దఎత్తున లడ్డూ ప్రసాదాన్ని అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకున్నారు. 5 లక్షల లడ్డూలు, 15 క్వింటాళ్ల పులిహార సిద్దం చేస్తున్నారు. ప్రసాద కౌంటర్లలో కాకుండ అదనంగా భక్తులు దర్శనం చేసుకోని బయటకు వెళ్లే మార్గాలలో పులిహార, లడ్డూలను అందుబాటులో భక్తులకు అందివ్వనున్నారు. జాతర సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వేములవాడకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు రవాణా శాఖ అధికారులు సిద్ధం చేశారు. కరీంనగర్, వరంగల్, సిద్దిపేట, నిజామాబాద్ జిల్లాలతో పాటు సికింద్రాబాద్ బస్టాండ్ నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు.
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వేములవాడ పట్టణాన్ని నాలుగు జోన్లుగా విభజించారు. పారిశుధ్య నిర్వహాణకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. అదేవిధంగా జిల్లా ఎశ్పీ రాహుల్ హెగ్డే ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వేములవాడ పరిసర ప్రాంతాల్లో ప్రతి నిత్యం ప్రత్కేక పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించనున్నారు. జాతర చైన్ స్పాచర్లు, దొంగల బారీ నుండి కాపాడానికి సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించనున్నారు. రాష్ర్ట భాషా సాంసృతిక శాఖ అధ్వర్యంలో జాతీయ, రాష్ర్టీయ, జానపాద కళాకరులచే సాంసృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్దం అయ్యారు. దేవాలయ ప్రాంగణము గుడి చెరువులో దాదాపు 35 ఏకరాలలో సాంసృతిక కార్యక్రమాలు, భక్తులకు జాగరణ. చేయడం కోసం ఏర్పాట్లు చేశారు.