మూడో ప్రపంచయుద్ధం అంటూ జరిగితే అది మతాల మధ్య యుద్ధంగా ఉంటుందనేే భయాందోళనలు కొన్నేళ్ళుగా నెలకొంటున్నాయి. వివిధ దేశాల్లో అంతర్గత పోరాటాలు, ఉగ్రవాదం, మతపరమైన దాడులు లాంటివి ఈ భయాలను కలిగిస్తున్నాయి. పరమత సహనం స్థానంలోనే అసహనం ఎందుకు చోటు చేసుకుంటున్నది? కొన్ని మతాల్లో విస్తరణ కాంక్ష ఎందుకు పెరుగుతోంది? కొన్ని దేశాల్లో కొన్ని మతాలను ఎందుకు అణిచివేస్తున్నారు ? కొత్త రాజ్యాల ఏర్పాటుకు మతం ఆయుధంగా మారుతున్నదా? మతమే జాతిగా మారతున్నదా? ఒక జాతిలో ఇతర మతాలకు స్థానం ఉండదా? విదేశాల్లో హిందూ ఆలయాలపై దాడులు ఎందుకు పెరిగిపోతున్నాయి?
ఒక పది రోజుల వ్యవధిలో అమెరికాలో, పాకిస్థాన్ లో రెండు చోట్ల హిందూ ఆలయాలపై దాడుల జరిగాయి. ప్రజల్లో పెరిగిపోతున్న మతపరమైన అసహనానికి ఇవి నిదర్శనాలుగా నిలుస్తున్నాయి. అమెరికాలో కొన్ని క్రైస్తవ సంఘాలు హిందూ ఆలయాలు, ఆచార వ్యవహారాలపై దాడులను కొనసాగిస్తున్నాయి. పాకిస్థాన్ లో కొన్ని ముస్లిం ఛాందస సంస్థలు అక్కడి ఆలయాల కూల్చివేతల్లో కీలకపాత్ర వహిస్తున్నాయి. అమెరికా, పాకిస్థాన్ ల విషయానికి వస్తే ఇదేమీ కొత్త విషయం కాదు. అలాంటి సంఘటనలు తరచూ ఏదో ఒక రూపంలో జరుగుతూనే ఉన్నాయి. మరి అక్కడి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? భారత ప్రభుత్వ వైఖరి ఎలా ఉంటున్నది? అనే విషయంపై ఇప్పుడు అందరికీ ఆసక్తి నెలకొంది.
అమెరికా లోని కెంటకీ రాష్ట్రంలో లూయిస్ విల్లే ప్రాంతంలో స్వామి నారాయణ్ ఆలయంపై కొందరు దుండగులు దాడి చేశారు. దేవతా విగ్రహానికి నల్ల రంగు పులిమారు. అసభ్య రాతలు రాశారు. క్రైస్తవ మత అనుకూల వ్యాఖ్యలు రాశారు. క్రైస్తవ మత చిహ్నాలు చిత్రించారు. ప్రధానమందిరంలోని ఒక కుర్చీలో ఒక కత్తిని పొడిచి వెళ్ళారు. కిటికీల అద్దాలు పగులగొట్టారు. చిన్నారుల ఆడుకునే గదిని కూడా దుండగులు ధ్వంసం చేశారు. గుడి లోపలి గదుల్లోని సరంజామా ను అపహరించారు. అక్కడి ఇండియన్ - అమెరికన్ వారికి ఈ చర్య దిగ్ర్భాంతి కలిగించింది. అక్కడ దుండగులు రాసిన నినాదాలు మరింత తీవ్రస్థాయిలో కూడా ఉన్నాయి. అమెరికన్లు కాని వారిని కించపరిచేలా ఉన్నాయి. మత, జాతి విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయి. ఏడేళ్ళ క్రితం ఇదే ప్రాంతంలో ఒక గురుద్వారా పై కాల్పలు జరిగాయి. అమెరికాలో ఇలాంటి చర్యలు జరగడం ఇదే తొలిసారి కాదు. 2015 ఏప్రిల్ లో నార్త్ టెక్సాస్ లోని ఆలయంలో కూడా దుండగులు ఇదే విధమైన దుశ్చర్యలకు పాల్పడ్డారు. 2015 ఫిబ్రవరిలో కెంట్, సీటెల్ మెట్రోపాలిటన్ ఏరియా లోని ఆలయాల్లో కూడా ఇదే విధమైన సంఘటనలు జరిగాయి. ఇవన్నీ కూడా స్థానికంగా కొన్ని వర్గాల్లో పెరిగిపోతున్న మత అసహనాన్ని సూచిస్తున్నాయి. అమెరికా అధికారులు ఇలాంటి సంఘటనలను చిన్నవిగా పరిగణించడం, భారత ప్రభుత్వం కూడా పెద్దగా స్పందించకపోవడం అమెరికాలోని హిందువులను కలవరపరుస్తున్నది. అమెరికా జనాభాలో ఒక శాతం హిందువులని ఒక అంచనా.
ఇక పాకిస్థాన్ విషయానికి వస్తే.....దేశ విభజన జరిగిన నాటి నుంచి అక్కడ ఆలయాలకు రక్షణ లేకుండా పోయింది. వందల సంఖ్యలో చిన్నా, పెద్ద ఆలయాలను కూల్చివేశారు. తాజాగా ఒక వారం రోజుల క్రితం సింధ్ ప్రావిన్స్ లో ఓ దేవాలయాన్ని దుండగులు తమ లక్ష్యంగా చేసుకున్నారు. ఖైర్ పూర్ జిల్లా కుంబ్ లోని శ్యామ్ సేవా ఆలయంపై దుండగులు దాడి చేశారు. కృష్ణుడు, ఇతర విగ్రహాలకు నిప్పు పెట్టారు. ఈ సంఘటనను నిరసిస్తూ అక్కడ పలు హిందూ సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఆలయాల రక్షణకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాల్సిందిగా డిమాండ్ చేశాయి. ఆలయం పై జరిగిన దాడిని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఖండించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. గతంలోనూ ఈ తరహా ఆదేశాలు జారీ అయినా.....అవి అమలైన దాఖలాలు లేవు. పాకిస్థాన్ జనాభా 22 కోట్లు కాగా అక్కడ హిందువుల జనాభా రెండు శాతం కంటే తక్కువకు పడిపోయింది.
అమెరికా, పాకిస్థాన్ లకు మాత్రమే ఈ పరమత అసహనం పరిమితం కాలేదు. పరమత అసహనం పెరిగిపోయేందుకు అనేక కారణాలున్నాయి. ఒక మతానికి చెందిన వారు క్రమంగా సంఘటితమవుతూ మతపరమైన కట్టడాలు నిర్మించుకోవడం ఇతర మతాలకు చెందిన కొందరికి నచ్చడం లేదు. అందుకు మతపరమైన కారణాలు కూడా ఉన్నాయి. హిందూ మతంలో విగ్రహారాధనకు పెద్ద పీట వేశారు. మరోవైపున ఇస్లాం, క్రైస్తవం రెండూ కూడా విగ్రహారాధనను వ్యతిరేకిస్తాయి. దీంతో మతదురభిమానులు కొందరు హిందూ ఆలయాలపై దాడులు చేయడం ఆనవాయితీగా మారింది. ప్రపంచంలో పలు పెద్ద మతాలు వివిధ దేశాల్లో అధికారిక మతాలుగా ఉన్నాయి. లేదా అనధికారికంగా నైనా అలాంటి హోదాను పొందాయి. ఒక్క హిందూ మతానికే అలాంటి స్థాయి లేదు. ప్రపంచవ్యాప్తంగా హిందువులు కేంద్రీకృతమైంది ఒక్క భారత్ లోనే. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ఇలాంటి దాడుల విషయంలో తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకోవడం సహజం. అలాంటి కోరికలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. పాకిస్థాన్ లో ఉన్న కర్తార్ పూర్ గురుద్వారాను దర్శించేందుకు భారతీయ సిక్కులకు అవకాశం కల్పించేందుకు పాకిస్థాన్ ప్రభుత్వంతో చర్చలు జరిపింది. ప్రత్యేక కారిడార్ ను నిర్మించింది. వీసాలు ఇప్పించే ఏర్పాట్లు చేసింది. అదే తరహాలో ఆయా దేశాల్లో ఆలయాలపై జరిగిన దాడులను అమెరికా, పాకిస్థాన్ ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళాలన్న డిమాండ్ కూడా వినవస్తోంది.