రాజకీయ పరమపద సోపానపటంలో గెలుపు కోసం వ్యూహాలు ఎత్తుగడలు సహజమే.. కానీ అందుకు వినియోగిస్తున్న మార్గాలే హద్దులు మీరుతున్నాయి. లోక్‌సభ ఎన్నికలు రాష్ట్ర రాజకీయ యవనికపై కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. ఎన్నికల్లో గెలుపు కోసం రాజకీయపార్టీలు వేస్తున్న ఎత్తుగడలు, వ్యూహాలు మరీ వికటిస్తున్నాయి. ఎన్నికల వేళ జంపింగ్ జపాంగ్‌లు కామనే కావచ్చు కానీ... అవి రాజకీయాన్ని ఏ మలుపు తిప్పుతున్నాయో అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి. తెలంగాణలో కాంగ్రెస్‌లో ఇప్పుడదే కనిపిస్తుంది.? ఇంతకీ హస్తానికి ఈ గాయాలేంటి? అసలేమైందీ కాంగ్రెస్‌కు!!
హ్యాండ్‌కు హ్యాండిచ్చి కారెక్కిన వారు కొందరు చేతికి గాయం చేసి కమలం పువ్వు పట్టుకున్నదొకరు. క్లారిటీ లేని కాంగ్రెస్ నుంచి కన్ఫ్యూజన్ లేకుండా బయటపడటమే బెటరన్నంటున్న వాళ్లు ఇంకొందరు. ఒకప్పుడు తెలంగాణలో కంచుకోటగా ఉన్న హస్తం పార్టీ మొండి గోడలు ఇప్పుడు బీటలు వారుతున్నాయి. ఇంకా చెప్పాలంటే కుప్పకూలుతున్నాయి. ఎందుకిలా? కాంగ్రెస్‌లో ఉంటే కనుమరుగవుతామన్న భయమా? రాజకీయ ప్రయోజనమా?
తెలంగాణలో హస్తం పార్టీ ఇప్పుడు దిక్కులు చూస్తోంది. గద్వాల జేజమ్మగా అందరితో పిలిపించుకునే కరుడుగట్టిన కాంగ్రెస్ నాయకుడు డీకే అరుణ కూడా చేతిని వదిలేసి కమలం పార్టీలో చేరడాన్ని కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోతోంది. ఎందుకిలా జరిగి ఉంటుందని పోస్టుమార్టమ్ చేస్తుంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న డీకే అరుణ జిల్లావ్యాప్తంగా కచ్చితమైన ప్రభావం చూపిస్తుందని, క్యాడర్ పూర్తిగా చేజారిపోతుందని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం కలవరపడుతుంది.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కంచుకోటలా ఉన్న కాంగ్రెస్ పార్టీ... ఇటు గులాబీ, అటు కమలం దెబ్బకు కకావికలమైందనే చెప్పాలి. మొన్నటి ఎన్నికల్లో 14 స్థానాల్లో 13 చోట్ల దూసుకుపోయిన కారు దెబ్బ నుంచే ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కాంగ్రెస్.... డీకే అరుణ నిర్ణయంతో దిగ్భ్రమకు గురైంది. మహబూబ్‌నగర్ ఎంపీ స్థానం నుంచి పోటీపై కమలం పార్టీ అధిష్టానం నుంచి క్లారిటీ తీసుకున్న డీకే అరుణ... కాంగ్రెస్‌కు ఒకరకంగా పెద్ద షాకే ఇచ్చారు. డీకే పార్టీ మార్పుతో జిల్లాలో కాంగ్రెస్ మరింత బలహీనపడుతుందన్న భయంతో ఉన్న నాయకులు వరసగా తగులుతున్న ఎదురుదెబ్బలతో కోలుకోలేని స్థాయికి చేరుకుందంటున్నారు కార్యకర్తలు.