మొఘల్ రాజు షాజహాన్, తన మూడో భార్య అయిన ముంతాజ్‌పై ప్రేమకు గుర్తుగా తాజ్‌మహల్‌ను నిర్మించాడు. ఇది మనమందరం చరిత్రలో చదువుకున్నదే. చివరిదశలో ఉన్న ముంతాజ్, ప్రపంచంలో ఎవరూ ఇంతవరకు చూడని అత్యంత సుందరమైన సమాధిని తనకోసం నిర్మించాలన్న ఆఖరి కోరికకు ప్రతిరూపం తాజ్‌మహల్. షాజహాన్ విచారాన్ని చెప్పే ప్రేమ కథే తాజ్ మహల్‌కు ఒక ప్రేరణ అని సంప్రదాయంగా చరిత్ర చెబుతోంది. పర్షియా నిర్మాణశాస్త్రాన్ని అనుసరించి, మొఘల్‌శైలిలో ప్రారంభించిన తాజ్‌మహల్ కట్టడం 1631లో మొదలైతే... 1648లో పూర్తయింది. చుట్టు ప్రక్కల భవనాలు, ఉద్యానవనం ఐదేళ్లకు పూర్తయ్యాయి. దీనికి వాస్తుశిల్పి ఉస్తాద్ అహ్మద్ లాహోరి. కొందరు హిందూత్వదులు మాత్రం, ఈ వాదనతో పూర్తిగా విభేదిస్తున్నారు. 17వ శతాబ్దంలో నిర్మించిన తాజ్ మహల్, ఒకప్పుడు తేజో మహాలయ అని పిలిచే శివాలయమని ఎప్పటి నుంచో వాదిస్తున్నాయి. మరికొందరు, శివాలయాన్ని కూలగొట్టి, దాని పునాదులపై షాజహాన్ తాజ్‌మహల్‌ను నిర్మించాడని చెబుతున్నారు.
అయితే బీజేపీ చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తోందని ముస్లిం సంఘాల నాయకులు వాదిస్తున్నారు. ఈ వాదనల్లో నిజానిజాలు పక్కనపెడితే, ఒక అపురూప కట్టడానికి మతం రంగు పులమడం మాత్రం శోచనీయమంటున్నారు ప్రజలు. ప్రపంచమంతా తాజ్‌ను కీర్తిస్తుంటే, మనం మాత్రం దాని చుట్టూ వివాదం రాజేస్తున్నామని విమర్శిస్తున్నారు. తాజ్‌మహల్ అంటే, ఇప్పుడు అందరికి తెలిసింది ప్రేమకు చిహ్నం. భార్యపై అజరామ ప్రేమకు గుర్తు. అందరి మనస్సుల్లో ఇప్పుడు అదే ఉంది. అదే ఆరాధన ఉంది. అలాంటి కట్డడం చుట్టూ, వివాదాలు రాజేయడం, మంచిదికాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాజ్‌మహల్ నిర్మాణంపై కొన్ని దశాబ్దాలుగా చర్చ జరుగుతోంది. ఆరెస్సెస్, శివసేన, కొందరు బీజేపీ నేతలు, చరిత్రను తిరగరాయాలంటున్నారు. తేజోమహాలయపై షాజహాన్ నిర్మించిన తాజ్‌ను కూలదోయాలని కూడా గగ్గోలుపెట్టారు. అటు తాజ్‌మహల్‌పై ఎందుకింత వివాదం... ఎవరి వాదన వెనక ఎలాంటి అర్థాలున్న దాన్ని పక్కనపెడితే... తాజ్‌మహల్ గురించి మరో చరిత్రను కొందరు హిందూత్వవాదులు, చరిత్రకారులూ చెబుతున్నారు. వీరి ప్రకారం, షాజహాన్ పాలించిన కాలం 1628 నుంచి 1658 వరకు. ఈ కాలంలో అనేక హిందూ మందిరాలు ఆక్రమణకు గురయ్యాయి. వాటిని కూలగొట్టి మసీదులు కట్టాడు. అలా ఆక్రమణకు గురైన దేవాలయాల్లో ఒకటి తాజ్‌మహల్ అని కొందరు చరిత్రకారులంటారు. హైందవ దేవాలయం కాస్తా, తాజ్ మహల్ గా, మసీదుగా మారిపోయిందని చెబుతారు.