తాజ్‌మహల్ అంటే ప్రేమకు చిహ్నం. అపురూప కట్టడం. ప్రపంచ వింతల్లో ఒకటి. ప్రతి పర్యాటకుడు ఒక్కసారైనా చూడాలనిపించే నిర్మాణం. ఈ అపురూప కట్డడం మరోసారి వివాదాల్లోకి చేరింది. ఇండియాను ఐడెంటీఫై చేసే మ్యాపుల్లో ఉన్న తాజ్‌మహల్‌పై రాద్ధాంతం జరుగుతోంది. తాజ్ కట్టడం తమదేనని వాదించిన ఉత్తర్‌ప్రదేశ్ సున్నీ వక్ఫ్ బోర్డుకు షాకివ్వడం.... గతంలో యూపీని సందర్శించే విదేశీ ప్రముఖలకు తాజ్ మహల్ చిహ్నాన్ని బహూకరించేవారని, తానొచ్చాక ఆ స్థానంలో రామాయణం, మహాభారతం పుస్తకాలను బహూకరించే సంప్రదాయానికి శ్రీకారం చుట్టానని యూపీ సీఎం యోగి చెప్పడం... మళ్లీ ఇప్పుడు మరోసారి తాజ్‌మహల్ కాదని, అది శివమందిరం అంటూ కేంద్రమంత్రి అనంత్‌కుమార్ హెగ్డే వ్యాఖ్యానించడం... మొత్తంగా తాజ్‌లో దాగి ఉన్న అసలు రహస్యాలేంటి? ప్రభువెక్కిన పల్లకి కాదోయ్...దానిని మోసిన బోగీలెవరు...తాజ్‌మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవరు...అంటూ నాడు శ్రీశ్రీ మహాప్రస్థానంలో ప్రశ్నించాడు. ప్రపంచ గొప్పకట్టడం తాజ్‌మహలే కానీ, దాని కిందున్న తేజోమహాలయ సంగతేంటని కొందరు హిందూత్వవాదులు, చరిత్రకారులు ప్రశ్నించారు. తాజా కేంద్ర మంత్రి అనంత్‌కుమార్ హెగ్డే కూడా ఇదే మాటన్నారు.
ప్రపంచ వింతల్లో ఒకటిగా పేరెన్నికగన్న తాజ్‌మహల్ హిందూ కట్టడమన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి. తెల్లని పాలరాతి కట్టడం ఇప్పటికే మతాల రంగు పులుముకోవడం వివాదాస్పదం అవుతోంది. తాజ్‌మహల్‌ను ఓ ప్రాచీన శివాలయం శిథిలాల మీద నిర్మించారని, కాబట్టి తాజ్‌మహల్ పేరును తేజోమహల్‌గా మార్చాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ చారిత్రక కట్టడాన్ని నిర్మించింది ముస్లిం పాలకులు కాదని, ఇదొక శివ మందిరమని తాజాగా కేంద్రమంత్రి అనంత్‌కుమార్ హెగ్డే వ్యాఖ్యానించారు. తాజ్‌మహల్‌ను జయసింహ అనే రాజు నుంచి కొనుగోలు చేసినట్లు షాజహాన్ తన జీవితచరిత్రలో రాశారంటూ చరిత్ర వినిపించారు. పరమతీర్థ అనే రాజు నిర్మించిన ఈ కట్టడం తేజో మహాలయ పేరుతో శివాలయంగా వెలుగొందిందని, తరువాత తాజ్‌మహల్‌గా మారిందని వివరించారు. ఇదిలాగే కొనసాగితే రాముడిని జహాపనా అని, సీతాదేవిని బీబీ అని పిలవాల్సి వస్తుందంటూ అనంత్‌కుమార్ హెగ్డే వ్యంగ్య వ్యాఖ్యలు సంధించారు. ఇదొక్క అనంతకుమార్‌తోనే కాదు... తాజ్‌మహల్ అసలు భారతీయ సంస్కతిని ప్రతిబింబించడం లేదంటూ యోగీ ఆదిత్యనాథ్ యూపీకి సీఎం అయ్యాక టూరిజం బుక్‌లెట్ నుంచి ప్రపంచ అపురూప కట్టడాన్ని తొలగించేశారు. గతంలో యూపీని సందర్శించే విదేశీ ప్రముఖలకు తాజ్ మహల్ చిహ్నాన్ని బహూకరించేవారని, తానొచ్చాక ఆ స్థానంలో రామాయణం, మహాభారతం పుస్తకాలను బహూకరించే సంప్రదాయానికి శ్రీకారం చుట్టానని చెప్పారు యోగి. ఏమైనా ప్రపంచ వింతల్లో ఒకటిగా ప్రసిద్ది చెందిన తాజ్‌మహల్ చుట్టూ, ఇలా వివాదాలు చెలరేగుతున్నాయి. దీనికంతటికీ కారణం, నాడు శివాలయాన్ని కూలగొట్టి షాజహాన్ తాజ్‌మహల్‌ను నిర్మించాడన్న వాదన. నిజంగా ఈ వాదనలో నిజముందా...తాజ్‌మహల్‌కు ముందు అక్కడ తేజోమహాలయ ఉండేదా? మరికొందరు ఆరోపిస్తున్నట్టు అదొక శ్మశానమా... అపురూప కట్టడంపై వివాదాల మరక వేయడం సరైందేనా?