సోషల్ మీడియా.. మోస్ట్ పవర్ ఫుల్ మీడియా.. ఇదిగో పులి అనకుండానే అదిగో తోక అని ప్రపంచం అనేస్తుంది.. కాలు జారితే వెనక్కి తీసుకోగలం గానీ నోరు జారితే వెనక్కి తీసుకోలేం అన్నది పాత సామెత.. నోరు, కాలు జారినా వెనక్కు తీసుకోవచ్చు కానీ పొరపాటున మీరు కొట్టే లైకో, షేరో వికటిస్తే మాత్రం మీ పని మటాషే.. చేతిలో మొబైలుంది.. మన ఫేసుకీ ఓ బుక్కుంది అని చెలరేగితే.. ఆ తర్వాత వచ్చే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.. జీవితమే తల్లకిందులైపోతుంది..
మనం చేసిన ప్రతీ కామెంట్ పేలుతుందని అనుకోవద్దు. కంటికి కనిపించిన ప్రతీ అంశంపైనా మన ఫీలింగ్స్ పోస్ట్ చేసేస్తే ఆ తర్వాత జైలు ఊచలు లెక్కపెట్టాల్సి వస్తుంది.. ఇదిగో బీడీలు చుడుతున్న ఈమెను చూడండి.. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పెర్కిట్ కు చెందిన ఈమెపేరు రమాదేవి.. హాయిగా సంతోషంగా ఉండాల్సిన వీరి కుటుంబం ఇప్పుడు పెను విషాదంలో చిక్కుకుపోయింది. బతుకు తెరువు కోసం గల్ఫ్ వెళ్లిన రాకేష్ అక్కడ ఫేస్ బుక్ లో పెట్టిన ఓ పోస్ట్ మొత్తం కుటుంబాన్ని తల్లకిందులు చేసేసింది. సౌదీ అరేబియాకు ఉపాధి కోస వెళ్లిన రాకేష్ మయన్మార్ లో రోహింగ్యాలపై దమనకాండను సమర్ధిస్తూ సోషల్ మీడియాలో కామెంట్ పోస్ట్ చేశాడు. అంతే సౌదీ పోలీసులు రాకేష్ ను అదుపులోకి తీసుకుని అయిదేళ్లు జైలు శిక్ష వేసి కటకటాల వెనక్కు తోసేశారు..
కుటుంబ పెద్ద అకాల మరణంతో కుటుబం మొత్తం ఇబ్బందుల్లో పడిపోయింది. రాకేష్ ను స్వదేశానికి రప్పించడానికి ఈ కుటుంబం కనిపించిన ప్రతీ వారిని వేడుకుంటోంది. ప్రభుత్వాధికారులను, ప్రజాప్రతినిధులను కలిసినా ఫలితం లేకుండా పోయింది. గల్ఫ్ లో చట్టాలు కఠినం కాబట్టి రాకేష్ అంత త్వరగా స్వదేశం వచ్చే వీలు లేదు. ఇక ఇలాంటిదే మరో ఘటన..గతేడాది కేరళను వరదలు ముంచెత్తిన ఘటన గుర్తుండే ఉంటుంది.. వరద విలయానికి చెత్తతో, తుక్కు తుక్కుగా మారిపోయిన కేరళపై సోషల్ మీడియాలో అనేక ఫొటోలు వైరల్ అయ్యాయి. గల్ఫ్ లో ఉద్యోగం చేస్తున్న ఈ యువకుడి పేరు రాహుల్ చెరుపలయట్టు.. ఒమన్లోని లులూ ఇంటర్నేషనల్ గ్రూప్ బ్రాంచ్ లో క్యాషియర్ గా పనిచేస్తున్న రాహుల్ కేరళ ఫ్లడ్స్ ని చాలా తేలికగా తీసుకున్నాడు..
లక్షల మంది ఇబ్బందులు పడుతున్న సందర్భాన్నైనా చూడకుండా ఎద్దు మాంసం తినే కేరళ ప్రజలను దేవుడు బాగా శిక్షించాడంటూ సోషల్ మీడియాలో కామెంట్ పెట్టాడు.అత్యంత సున్నితమైన ఈ విషాద ఘటనపై అంత దురుసుగా స్పందించినందుకు ఆ యువకుడిని ఆ కంపెనీ ఉద్యోగంలోంచి తీసి పారేసింది. తప్పు తెలుసుకున్న రాహుల్ తాగిన మైకంలో అలా పోస్ట్ చేశాననీ మన్నించమని ఓ సెల్ఫీ వీడియో తీసి అప్ లోడ్ చేశాడు.. అయినా కంపెనీ పెద్దల మనసు మారలేదు.. మానవత్వం చూపించాల్సిన చోట కర్కశత్వం పనికి రాదని, అలా చేస్తే శిక్ష ఇలాగే ఉంటుందని తేల్చి చెప్పింది.