సార్వత్రిక ఎన్నికల పర్వం ప్రారంభమవుతున్న సమయంలో పుల్వామా ఘటనను రాజకీయ ప్రయోజనంగా మార్చుకోవాలంటున్నాయి పార్టీలు. ఇది ఎవరు కాదన్నా... ఔనన్నా... సామాన్య ప్రజానీకానికి కూడా అర్థమవుతున్న విషయం. ప్రధాని మోడీ, అమిత్ షాల మేధస్సు ఇప్పటికే ఎన్నో ఎత్తుగడలు వేసి దాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు వ్యూహప్రతివ్యూహాలు అమలు చేస్తున్నాయంటున్నాయి విపక్షాలు. నిజానికి పుల్వామా దాడిలో జవాన్లు ప్రాణాలు కోల్పోవడం మొత్తం రాజకీయ వాతావరణాన్నే మార్చేసింది. పుల్వామా ఘటన తర్వాత ప్రధానమంత్రిగా మోడీ వేయబోయే రాజకీయ అడుగులపై దేశం మొత్తం ఆసక్తిగా గమనించింది. ఆక్రమిత కాశ్మీర్‌పై భారత సైన్యం దాడి చేస్తుందని, ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేస్తుందని, మసూద్ లాంటి ఉగ్రవాదులను హతమారుస్తుందని ఆశలు పెట్టుకుంది. మోడీ లాంటి వ్యక్తి కచ్చితంగా ఈ అవకాశాన్ని చేజేతుల వదులుకోలేరు. దేశం ఆశించినట్టు మోడీ దానికి తగ్గ నిర్ణయాలే తీసుకున్నారు. ప్రపంచ సమాజం ముందు పాకిస్తాన్‌ను దోషిగా నిలబెట్టే ప్రయత్నాలు చేశారు. అన్నివర్గాల మద్దతు కూడగట్టి.. ఐక్యరాజ్యసమితి ఒప్పించి.... పాక్ చేసిన దుస్సాహసాన్ని ఎండగట్టారు. పాక్‌కు ఏదో రీతిలో బుద్ధి చెప్పి ప్రజల్లో జాతీయ వాద భావనల్ని లేవనెత్తి, ప్రజా మద్దతు కూడగట్టాలన్న ప్రయత్నంలో ఉన్నారంటున్నారు విశ్లేషకులు.
మోడీకీ, కాశ్మీర్‌కూ అనుబంధం ఈనాటి కాదు. దాదాపు మూడు దశాబ్దాల సంబంధం. జమ్మూ కాశ్మీర్‌లో కమలాన్ని బలపరిచేందుకు జరిగిన ప్రయత్నాల్లో నాటి బీజేపీ కార్యకర్తగా మోడీ పాలుపంచుకున్నారు. సీమాంతర ఉగ్రవాదాన్ని విమర్శించి కాంగ్రెస్ నేతల అసమర్థతను ఎండగట్టారు. ఇంత పెద్ద ఎత్తున సైన్యాన్ని మోహరించి, నిఘా సంస్థలను పెంచి పోషించి, కమ్యూనికేషన్ సాధనాలపై పట్టు ఉన్నప్పటికీ ఉగ్రవాదాన్ని అంతమొందించ లేకపోతున్నారని, ఉగ్రవాదులకు ఆయుధాలు ఎక్కడినుంచి వస్తున్నాయని ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 2014లో బీజేపీ అధికారంలోకి రావడానికి పాకిస్థాన్, సీమాంతర ఉగ్రవాదంపై ఆయన చేసిన ప్రకటనలు కూడా ఎంతో కొంత కారణమయ్యాయి. కాంగ్రెస్ ఇప్పుడిదే అంశాన్ని హైలెట్ చేస్తూ దేశం ముందు వినిపిస్తుంది.
ఈ దఫాలో మోడీ సర్కార్ సాధించిన అభివృద్ధిపై దేశం చర్చించుకుంటుంది. మంచా... చెడా సంగతి పక్కనపెడితే... రెండోసారి అధికారంలోకి రాబోయే దానిపైన్నే ఆలోచించిస్తుంది. ప్రతిపక్షాలే కాదు, స్వపక్షాలు కూడా ఆయనను వ్యక్తిగతంగా తీవ్ర స్థాయిలో వ్యతిరేకించే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో పుల్వామాలో జరిగిన ఉగ్రవాద ఘటన మోడీని బలమైన, తిరుగులేని నాయకుడుగా మారుస్తుందా, రాజకీయంగా కొత్త ఊపిరినిస్తుందా.? ఇదే జరుగుతుందని చెబుతున్నారు కమలనాథులు. ఎందుకంటే 1999లో కార్గిల్ యుద్ధం తర్వాత జరిగిన సార్వత్రక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ 303 సీట్లు గెలిచి అధికారంలోకి రాగలిగింది. అప్పుడు అధికారం హస్తగతం కావడానికి కార్గిల్ ఘటనే కారణమన్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. కాశ్మీర్... దేశ రాజకీయ ఎజెండాలో అతి ముఖ్యమైంది. అందుకే కాశ్మీర్ కేంద్రంగా ఏం చేసినా... ఏం జరిగినా రాజకీయ పార్టీలు గమనిస్తుంటాయి. అందుకే అధికారంలో ఉన్న ఏ పార్టీ నేత అయినా... ఆ విషయంలో విఫలం కాకుండా చూసుకుంటారు. మోడీ కూడా ఇప్పుడదే చేస్తారన్న అంచనాలున్నాయి. త్వరలో ఎన్నికల పర్వం ప్రారంభమవుతున్న ఈ సమయంలో పుల్వామా ఘటన ద్వారా లభించే రాజకీయ ప్రయోజనం గురించి మోడీ, అమిత్ షాల మేధస్సు ఇప్పటికే ఎన్నో ఎత్తుగడలు వేసి ఉంటుంది. కాంగ్రెస్ సారథ్యంలోని ఉద్దండపిండాలు కూడా అంతే స్థాయిలో మేథోమథనం చేసి ఉంటుంది. కానీ అంతిమ ఫలితం మాత్రం... అది వెలువడే వరకు వేచి చూడాల్సిందే.