గ్రామస్థాయిలో అమల్లో ఉండే అతి ప్రాచీన పాలనా వ్యవస్థే పంచాయతీ. దీన్నే స్థానిక స్వపరిపాలనా సంస్థల వ్యవస్థ, పంచాయతీరాజ్ వ్యవస్థ అంటారు. గ్రామ రాజ్యం ద్వారా రామరాజ్యం ఏర్పాటు చేయాలని గాంధీజీ కలలు కన్నారు. ఆయన దృష్టిలో ప్రతి గ్రామపంచాయతీ ఒక చిన్న గణతంత్ర రాజ్యం. దేశాభివృద్ధికి మూలం గ్రామాభివృద్ధే. మరి పంచాయతీ రాజ్ చట్టం ఏం చెబుతోంది? వ్యవస్థ బలోపేతానికి మన పాలకులు తీసుకున్న చర్యలేంటి?
గ్రామాభ్యుదయానికి గ్రామపంచాయతీల ఏర్పాటు, వాటికి విస్తృత అధికారాలు ఇవ్వడానికి రాజ్యాంగం ప్రాధాన్యం ఇచ్చింది. పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామాల అభివృద్ధికి ఆ గ్రామ ప్రజలే పాటుపడటానికి వీలు కల్పించింది. మన దేశంలో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రారంభించిన తొలి రాష్ట్రం రాజస్థాన్ కాగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండోది. 1959 నవంబరు 1న ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లో ఈ వ్యవస్థను ప్రారంభించారు. 73వ రాజ్యాంగ సవరణకు అనుగుణంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1994లో కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని చేసింది. ప్రతీ ఏడాది ఏప్రిల్ 24న పంచాయతీరాజ్ రోజుగా పాటిస్తున్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ గ్రామాలకు వెన్నెముక. ప్రతి గ్రామానికి ఒక గ్రామ పంచాయితీ ఉంటుంది. స్థానిక స్వపరిపాలన విధానంలో ఇదే మొదటి మెట్టు. తర్వాతిది మండల పరిషత్తు. తర్వాతిది జిల్లా పరిషత్తు, పట్టణ స్వపరిపాలన సంస్థలు, పురపాలక సంఘాలు. గ్రామాల అభివృద్ధి కోసం పంచాయతిలు అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తాయి. ఇక సర్పంచి అయినది ప్రజల సేవకే కానీ , ప్రజల ధనాన్ని కాజేయడానికి కాదన్న సత్యాన్ని గ్రహించాలంటోంది రాజ్యాంగం.