ఇండోనేషియాలో జలవిలయానికి కారణమైన అగ్నిపర్వతం అనక్ క్రకటోవా. సముద్రగర్భంలో ఉన్న క్రకటోవా అగ్ని పర్వతానిది భీకరరూపం. 2018 జూన్ నుంచి సెగలు కక్కుతున్న క్రకటోవా అగ్నిపర్వతశ్రేణిది విధ్వంసక చరిత్ర. ప్రపంచ చరిత్రలో అత్యంత విధ్వంసకర ఘటనల్లో ఒకటిగా చెబుతారు చరిత్రకారులు. హిరోషిమా అణుబాంబు కంటే 13వేల రెట్ల అధికశక్తితో ఈ పర్వతం విస్ఫోటనం చెందిందంటేనే.. దాని తీవ్రతను అర్థంచేసుకోవచ్చు.
ఇండోనేషియాలో సునామీ బీభత్సానికి కారణమైన క్రకటోవా అగ్నిపర్వతం పేలుడు ధాటికి 4,500 కిలోమీటర్ల విస్తీర్ణంలో రెండురోజులపాటు అంధకారం అలుముకుంది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లోనూ సూర్యోదయ, సూర్యాస్తమయ దృశ్యాలే మారిపోయాయి. లావానంతా ఎగిజిమ్మిన క్రకటోవా అగ్నిపర్వతం.. క్రమంగా బయటకు కనిపించకుండా సముద్రంలోకి కుంగిపోయింది. దాని చరిత్ర అంతటితో ముగిసిందని అంతా భావించారు. కానీ అనూహ్యంగా సముద్ర గర్భంలో ఉన్న క్రకటోవా అగ్నిపర్వత బిలం నుంచి మరో చిన్న పర్వతం ఉద్భవించింది. అదే సునామీ రూపంలో విరుచుకుపడింది.
సముద్ర మట్టానికి 300 మీటర్ల ఎత్తువరకు ఉన్న క్రకటోవా పేలినప్పుడు... అది చిన్నపాటిదేనని అనుకున్నారంతా. కానీ క్రకటోవా విషయంలో జరిగింది వేరు. పర్వతం సముద్రంలో మునిగి ఉన్నందున సముద్ర గర్భంలో కొండచరియలు విరిగిపడి అలజడి చోటుచేసుకోవడమే సునామీకి కారణమైంది. అత్యంత ప్రమాదకరంగా సల్ఫర్ డై ఆక్సైడ్ వాయువు విడుదల కావడంతో... సమీపంలోని ప్రజలు తమను తాము అంత సులువుగా రక్షించుకోలేకపోయారు.