కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఆ పార్లమెంట్ సెగ్మెంట్ పై.. హస్తం నేతలు కన్నేశారు. బలమైన అభ్యర్ధిని బరిలో దింపాలని ఆ పార్టీ నేతలు కుస్తీ పడుతున్నారు. మొన్నటి వరకు అక్కడి నుంచి పోటీకి నై.. అన్న నేతలు ఇప్పుడు సై అంటున్నారు. రాష్ట్రంలోనే అత్యంత కీలక నియోజకవర్గంగా ఉన్న ఆ స్దానంలో.. మాజీ క్రికెటర్‌ను పోటీకి సిద్దం చేస్తున్నారు. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏంటి.. ఆ మాజీ క్రికెటర్ ఎవరిపై పోటీ చేయబోతున్నారు? నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్...రాష్ట్రంలో అత్యంత కీలక నియోజకవర్గాల్లో ఒకటి. ఇక్కడి నుంచి ముఖ్యమంత్రి తనయ కల్వకుంట్ల కవిత ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
ట్రబుల్ షూటర్‌గా, మాటల మాంత్రికురాలిగా కవితకు రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు ఉంది. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్‌లో, ఆమెకు పోటీగా దరిదాపుల్లో ప్రత్యర్ధులెవరూ కనిపించడం లేదు. ఆశావహుల నుంచి పార్లమెంట్ అభ్యర్థుల కోసం కోసం కాంగ్రెస్, దరఖాస్తులను ఆహ్వానిస్తే, ఒకే ఒక్క సామాన్యుడు దరఖాస్తు చేసుకున్నాడు. నిజామాబాద్ మాజీ ఎంపీ మధుయాష్కీ భువనగిరి నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్నారు. ఐతే అధిష్ఠానం పెద్దలు, నిజామాబాద్ జిల్లా ముఖ్య నేతలు నిజామాబాద్ ఎంపీగా పోటీ చేయాలని సూచిస్తున్నారు. అయినా ఆయన నో అంటున్నారు. ఇలా ఎవరూ కవితతో పోటీ పడేందుకు ఆసక్తి చూపకపోవడంతో, కాంగ్రెస్ అధిష్టానం మరో ప్రత్యామ్నాయం ఆలోచిస్తోంది. ఎలాగైనా బలమైన అభ్యర్ధిని బరిలో నిలపాలని నిర్ణయించిన హైకమాండ్, నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్ధిగా మాజీ క్రికెటర్ అజారుద్దిన్ పేరును పరిశీలన చేస్తోంది. అదే ఇప్పుడు నిజామాబాద్‌తో పాటు తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది.
నిజామాబాద్ ఎంపీ కవితపై బలమైన అభ్యర్ధిని దింపాలని నిర్ణయించిన కాంగ్రెస్, మాజీ క్రికెటర్ అజారుద్దీన్ పేరును పరిశీలన చేస్తున్నట్లు పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. అయితే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై అజర్‌ను బరిలోకి దింపుతారని ఇప్పటికే చర్చ నడుస్తోంది. అయితే, నిజామాబాద్ అయితేనే అజర్‌కు బాగుంటుందని హైకమాండ్ ఆలోచిస్తోంది. మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌కు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. మైనార్టీ వర్గానికి చెందిన నేత కావడంతో, నిజామాబాద్ నుంచి బరిలో నిలిపితే ఫలితం ఉంటుందని నేతలు భావిస్తున్నారు. ఎందుకంటే నిజామాబాద్ సెగ్మెంట్‌లో ముస్లింల ఓట్లు భారీగానే ఉన్నాయి. ఇలా అనేక లెక్కలు వేసి, ఆయన పేరును పరిశీలిస్తున్నట్టు కాంగ్రెస్ పెద్దలు చెబుతున్నారు.
నిజామాబాద్ మాజీ ఎంపీ మధుయాష్కీ, మరోసారి ఇక్కడి నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపడం లేదు. ఆయన భువనగిరి నుంచి పోటీ చేయాలని ఉవ్విళ్లురుతున్నారు. భువనగిరి నుంచి వీలుకాకపోతే నిజామాబాద్‌లోనే పోటీ చేసే అవకాశం లేకపోలేదని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మధుయాష్కీ పోటీ చేయకుంటే.. ప్రత్యామ్నయంగా అజారుద్దీన్‌ను బరిలో దింపాలని కాంగ్రెస్ అధిష్ఠానం దాదాపుగా నిర్ణయించినట్లు తెలిసింది. ఒకవేళ అజారుద్దీన్ కూడా పోటీకి సిద్దంగా లేకుంటే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి పేరును పరిశీలన చేస్తున్నారు. మధుయాష్కీ, లేదంటే అజారుద్దీన్‌లో ఒకరు నిజామాబాద్ ఎంపీ అభ్యర్ధిగా కవితపై పోటీ చేయడం దాదాపుగా ఖాయమని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఎంపీ కవితను టార్గెట్ చేసిన కాంగ్రెస్, నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్ధిగా బలమైన నేతను రంగంలోకి దింపాలని యోచిస్తోంది. అజారుద్దీన్ పోటీకి పెట్టాలనే కాంగ్రెస్ ప్రయోగం, ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి.