భారత్-పాక్ మధ్య యుద్ధం ఆరంభమైనట్టేనా?

Update: 2019-02-28 12:11 GMT

భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆరంభమైనట్టేనా? బడ్గామ్‌లో కుప్పకూలిన భారత వైమానిక దళానికి చెందిన చాపర్, ఆ వెంటనే పాకిస్తాన్‌కు చెందిన ఎఫ్16 విమానం నేలకూలిన ఘటనలు యుద్ధం మొదలైందనడానికి సంకేతాలా? జమ్మూ, కాశ్మీర్, లేహ్ నగరాలకు రాకపోకలు సాగించే పౌర విమానాలపై విధించిన నిషేధం కూడా యుద్దం తప్పదనే చెబుతుందా? ఈ వార్తలు, ప్రచారాలే సరిహద్దు గ్రామాలను వణికించేస్తున్నాయి.

మూట, ముల్లె సర్దుకుని అందుబాటులో ఉన్న వాహనాలను అందిపుచ్చుకుని, సురక్షిత ప్రదేశాలకు బయలుదేరి వెళ్తున్నారు సరిహద్దు గ్రామాల ప్రజలు. నియంత్రణ రేఖ సమీపంలో గ్రామాలు బడ్గామ్, నౌషెరా, యూరీ, రాజౌరీ, కథువా, బారాముల్లా, పూంఛ్, కుప్వారా, సాంబా సెక్టార్ల పరిధిలోని గ్రామాలు పాకిస్తాన్ సరిహద్దులకు ఆనుకుని ఉంటాయి. సరిహద్దులకు అవతలి వైపు నుంచి పాకిస్తాన్ సైన్యం కాల్పులు జరిపితే.. ఆయా సెక్టార్ల పరిధిలోని గ్రామాలు విధ్వంసానికి గురవుతాయి. గతంలో ఇలాంటి సంఘటనలు చాలా చోటు చేసుకున్నాయి. పాకిస్తాన్ సైన్యానికి మోర్టార్లే ప్రధాన ఆయుధం. సాధారణ పౌరులు నివసించే గ్రామాలను లక్ష్యంగా చేసుకుని పాక్ సైనికులు సరిహద్దులకు అవతలి వైపు నుంచి మోర్టార్ల ద్వారా దాడులు చేస్తుంటారు. అవి తగిలి సాధారణ పౌరులు మరణించిన సందర్భాలు అనేకం. దీన్ని దృష్టిలో ఉంచుకుని మనదేశం సైన్యం అప్రమత్తమైంది. సరిహద్దులకు సమీపంలో ఉన్న గ్రామాలను ఖాళీ చేయాలని ప్రజలకు సూచనలు జారీ చేసింది. దీనితో ఆయా సెక్టార్ల పరిధిలోని గ్రామాల్లో నివసిస్తున్న వారు మూటా, ముల్లె సర్దుకుంటున్నారు. సురక్షిత ప్రాంతాలకు తరలుతున్నారు. వారి కోసం ప్రభుత్వం ఇదివరకే షెల్టర్లను నిర్మించింది. ప్రస్తుతం వారిని ఆయా షెల్టర్లకు తరలిస్తున్నారు. దీనికోసం సైన్యం గ్రామీణుల కోసం ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసింది. మరికొందరు తమ వ్యక్తిగత వాహనాలతో బయలుదేరి వెళ్తున్నారు. 

Similar News