ఎన్నికల ప్రభావం విద్యార్థులపై చూపనున్నాయా..?

Update: 2019-03-11 10:42 GMT

సార్వత్రిక ఎన్నికలకు సైరన్ మోగడంతో రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల పోరుకు సిద్దమవుతున్నాయి. దాదాపు నెలరోజులపాటు ఎన్నికల హడావిడి కొనసాగనుంది. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు పాఠశాల విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. ఓవైపు ఉపాధ్యాయులు ఎన్నికల విధుల్లో నిమగ్నం కావడం మరోవైపు నాయకుల ఎన్నికల ప్రచారాలతో ట్రాఫిక్ సమస్యలు, ప్రజా రవాణా ఇబ్బందులు ఎదురుకానున్నాయి.

కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూలు ప్రకారం తెలంగాణలో ఏప్రిల్‌ 11న ఎన్నికలు నిర్వహించాలి. ఇందుకుగాను మార్చి 18న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. తదనంతరం నామినేషన్ల ఉపసంహరణ తర్వాత పోలింగ్‌ తేదీకి రెండు రోజుల ముందు వరకు ఎన్నికల ప్రచారం తీవ్రంగా ఉంటుంది. అదే సమయంలో పదోతరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి 16 నుంచి ఏప్రిల్‌ 3 వరకు పదోతరగతి పరీక్షలు, మార్చి 30 నుంచి ఏప్రిల్‌ 8 వరకు ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు వార్షిక పరీక్షలు జరుగుతాయి. పాఠశాల విద్యార్థులకు కీలకమైన ఈ పరీక్షల సమయంలోనే ఉపాధ్యాయులకు ఎన్నికల విధులు ఉంటాయి. ఇప్పటికే మార్చి 22న ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా.. ఆరోజు జరగాల్సిన పదోతరగతి పరీక్ష ఏప్రిల్ 3కి వాయిదా పడింది.

ఎన్నికల నిర్వహణకు పాఠశాలలను పోలింగ్‌ కేంద్రాలుగా గుర్తించడం ఇందుకోసం అధికారులు తరచూ తనిఖీలకు రావడం లాంటివి పరీక్షల సమయంలో విద్యార్థులకు ఇబ్బందికరంగా మారనున్నాయి. ఇప్పటికే తెలంగాణలో వరుస ఎన్నికలతో పాఠశాల విద్యార్థులు నష్టపోతున్నారు. దీనికితోడు ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలు కూడా పరీక్షల సమయంలోనే వచ్చిపడ్డాయి. ఎన్నికల ప్రచారంలో బ్యాండు చప్పుళ్లు, బహిరంగ సభలు, మైకుల్లో రాజకీయ నాయకుల ప్రసంగాలు పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఇబ్బందికరంగా మారనున్నాయి. ఈ ప్రభావం విద్యార్థుల మార్కులపై పడొచ్చు. ప్రధానంగా ఈ ఎన్నికలు పాఠశాల విద్యార్థులపైనే ఎక్కువ ప్రభావం చూపనున్నాయి.

మరోవైపు ఏప్రిల్‌ 7 నుంచి 20 వరకు జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహణలో ఉన్నందున పరీక్ష రాసే విద్యార్థులకు, వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశపరీక్షలు, నీట్‌ పరీక్ష మే నెలలో ఉండటంతో ఈ పరీక్షలు రాసేవారికి పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చు. 

Similar News