ఈబీసీలను వ్యతిరేకించేవారెవరు... మద్దతిచ్చేవారెవరు!!

Update: 2019-01-08 04:49 GMT

అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడినవారికి పది శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య తప్పుబట్టారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, రిజర్వేషన్ల మూల సిద్ధాంతానికి విరుద్ధంగా ఉందన్నారు. అగ్రవర్ణాల్లోని పేదలు రిజర్వేషన్లు అడగటం లేదని, వారిని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లేలా ప్రభుత్వం ప్రయత్నించాలని సూచించారు. ఆర్థికపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగం అనుమతించదన్నారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తప్పుబట్టారు. పేదరికాన్ని నిర్మూలించేందుకు అనేక పథకాలు తేవొచ్చాని సూచించారు. దళితులకు సామాజిక న్యాయం కోసమే రిజర్వేషన్లు కల్పించారన్నారు.

అగ్రవర్ణాలకు పది శాతం కోటాను కాంగ్రెస్ వ్యతిరేకించకపోయినా, నిర్ణయం తీసుకున్న టైంనే తప్పుబట్టింది. ఎన్నికలకు రెండు, మూడు నెలల ముందు తీసుకోవడమేంటని ప్రశ్నించింది. నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల పాలనలో నిర్ణయం తీసుకోకుండా, చివరి పార్లమెంట్‌ చివరి సమావేశాల్లోనే డెసిషన్ తీసుకోవడం ఏంటని అడుగుతోంది. అగ్రవర్గాల పేదలను అభివృద్ది చేయడంలో మోడీ ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్దిలేదని విమర్శించింది కాంగ్రెస్. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు కోసం ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని, అందుకే తన అమ్ములపొదిలోని చివర అస్త్రాన్ని ఈ రకంగా వదిలారన్నారు పాటిదార్‌ ఉద్యమ నేత హార్ధిక్‌ పటేల్‌. ఈ రిజర్వేషన్‌ లాలీపాప్‌ ప్రజలకు అందిస్తే అది పెద్ద పొరబాటు అవుతుందని, సరిగ్గా అమలు చేయకపోయినా ప్రజలు తిరగబడతారని వ్యాఖ్యానించారు.

ఆర్జేడీ నాయకుడు తేజ్‌ ప్రతాప్ యాదవ్ కూడా, మోడీ తీసుకున్న నిర్ణయాన్ని తప్పబట్టారు. ఎస్సీ, ఎస్టీలు,ఓబీలకు ఇచ్చిన రిజర్వేషన్లు ఆర్థికపరమైనవి కావని, సామాజికపరమైనవి గుర్తు చేశారు. ఎన్నికల్లో లబ్ది కోసమే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు తేజ్ ప్రతాప్ యాదవ్. మరోవైపు అగ్రకులాలకు పది శాతం కోటా నిర్ణయాన్ని బీజేపీ సహా పలు పార్టీలు స్వాగతించాయి. వివిధ పార్టీల ఎంపీలు హర్షించారు. అమలు చేసినప్పుడే దానికంటూ సార్థకత ఉంటుందని అన్నారు. లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్‌ నారాయణ, మోడీ ప్రభుత్వ నిర్ణయంపై స్పందించారు. అగ్రకులాలకు రిజర్వేషన్ కల్పించడం సరైందే అయినా, ఇప్పటికే అందుకుంటున్న వర్గాలకు ఫలాలు అందడం లేదని గుర్తు చేశారు. పేదలకు ఇప్పటికే నాణ్యమైన విద్య అందడం లేదన్నారు.

మొత్తానికి అగ్రవర్ణాలకు పది శాతం రిజర్వేషన్‌ కల్పించడాన్ని అన్ని రాజకీయ పార్టీలు స్వాగతిస్తున్నా, నిర్ణయం తీసుకున్న టైంనే తప్పుబడుతున్నాయి. మూడు రాష్ట్రాల్లో ఓడిపోవడం, లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇదే ఫలితం వస్తుందన్న భయంతోనే రిజర్వేషన్ పాచిక విసిరారని విమర్శిస్తున్నాయి. అయితే అసలైన గేమ్‌ ఇప్పుడే మొదలవుతుంది. రిజర్వేషన్‌ బిల్లు బంతి పార్లమెంట్‌కు చేరుతుంది. లోక్‌సభ, రాజ్యసభలో, ఏ పార్టీ ఎలాంటి వైఖరి తీసుకుంటుందో, తేలిపోతుంది. బిల్లు చట్టమవుతుందో, లేదంటే మహిళా రిజర్వేషన్‌ బిల్లులాగే మూలనపడుతుందో తెలిసిపోతుంది.

Similar News