ఎన్నికల వేళ, వలసల రాజకీయం ఊపందుకుంది. అటు నుంచి ఇటు...ఇటు నుంచి అటు నేతలు జంపింగ్ చేస్తున్నారు. ఎలక్షన్స్ ముంగిట్లో కండువాలు మార్చుకుని, కొత్త పార్టీ గుర్తుతో రంగంలోకి దిగుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముంచుకొస్తున్నకొద్దీ, పార్టీలు, నేతల వ్యూహాలు పదునెక్కుతున్నాయి. ప్రత్యర్థి పార్టీలను దెబ్బకొట్టేందుకు, అవకాశమున్న ఏ అస్త్రాన్నీ వదలడం లేదు. వలసలను ప్రోత్సహిస్తూ, గాలిమొత్తం తమవైపే ఉందని ప్రజల్లో ఒక భావన క్రియేట్ చేసేందుకు, పార్టీలు స్ట్రాటజీలు వేస్తుంటే, మరోవైపు గెలుపు మలుపు ఎక్కడుందో వెతుక్కుంటూ కండువాలు మార్చుకుంటున్నారు నేతలు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో నడుస్తున్న రాజకీయం ఇదే. వలసల రాజకీయం.
మొదట తెలుగుదేశం నుంచి వైసీపీలోకి వెళ్లినవారి సంగతి చూద్దాం. ఇటీవల టీడీపీని వీడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. తెలుగుదేశానికి గుడ్‌బై చెప్పి లోటస్‌పాండ్‌కి క్యూకడుతున్నారు నేతలు. మొన్న రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున్ రెడ్డి, నిన్న చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్..నేడు అనకాపల్లి ఎంపి అవంతి శ్రీనివాస్. మరికొందరు నేతలు సైతం వైసీపీకి వెళ్లేందుకు మొగ్గుచూపుతున్నారని ప్రచారం జరుగుతోంది.విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జిల్లాలో బలమైన నేతగా గుర్తింపు పొందిన, అవంతి విద్యాసంస్థల అధినేత, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు, తెలుగుదేశానికి గుడ్ బై చెప్పి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో చేరారు. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నివాసానికి వెళ్లి.. ఆయనతో భేటీ అయ్యారు. తర్వాత వైఎస్ జగన్ సమక్షంలో లాంఛనంగా వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. ఎంపీ పదవికి రాజీనామాతో పాటు, తెలుగుదేశం ప్రాథమిక సభ్యత్వానికి రిజైన్ చేసినట్టు తెలిపారు. పోతూపోతూ టీడీపీ అధినేతపై అనేక ఆరోపణలు సంధించారు అవంతి శ్రీనివాస్.
అంతకుముందు రోజే, ప్రకాశం జిల్లాలోనూ టీడీపీకి గట్టి షాక్ తగిలింది. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, సైకిల్ దిగి ఫ్యాన్ చెంతకు చేరారు. అవంతి శ్రీనివాస్‌తో కలిసి మీడియాతో మాట్లాడిన ఆమంచి, మరోసారి తెలుగుదేశంపై విమర్శలు చేశారు. కొన్నిరోజుల క్రితం, రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున్ రెడ్డి, వైసీపీ గూటికి చేరారు. అంతేకాదు, మిగతా జిల్లాల్లోనూ, మరికొందరు నేతలు కూడా వైసీపీకి క్యూకట్టబోతున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఆమంచి, అవంతి శ్రీనివాస్‌లు పార్టీని వీడటంపై ఘాటుగా స్పందించారు టీడీపీ అధినేత చంద్రబాబు. పార్టీని విడిచే నాయకులను చూసి భయపడనని అన్నారు. తనతో వారికి కావాల్సిన పనులు చేయించుకుని, సిగ్గు లేకుండా ఎన్నికలొస్తున్న సమయంలో పార్టీ విడిచి వెళ్తున్నారని, పార్టీ నేతలతో వ్యాఖ్యానించినట్టు తెలిసింది. మోడీ, జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ కలిసి కుట్ర చేస్తున్నారని బాబు ఆరోపించారు. టీడీపీ ఎమ్మెల్యేలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కార్యకర్తలే పార్టీని కాపాడుకుంటారని వ్యాఖ్యానించారు చంద్రబాబు.