మోడీ కోటాస్త్రం వెనక రాజకీయ వ్యూహమేంటి?
కోటా కోటా కోటా. దేశంలో ఇప్పుడు ఇదే మాట. ఎన్నికల పూట, ఇది మోడీ వదిలిన తూటా.
కోటా కోటా కోటా. దేశంలో ఇప్పుడు ఇదే మాట. ఎన్నికల పూట, ఇది మోడీ వదిలిన తూటా. అవును. అగ్రకులాల పేదలకు పది శాతం రిజర్వేషన్ వెనక, మోడీ మదిలో చాలా వ్యూహముంది రాజకీయ శస్త్రముంది. ఇంతకీ మోడీ వదిలిన కోటాస్త్రం వెనక పొలిటికల్ స్ట్రాటజీలేంటి? ఏ పార్టీపై గురిపెట్టారు?
నరేంద్ర మోడీ ఏ నిర్ణయం తీసుకున్నా సంచలనమే. గుంభనంగా, ఎవరికీ తెలీకుండా, కనీసం తన మంత్రివర్గం సహచరులకు సైతం తెలీకుండా దేశాన్ని కుదిపేసే నిర్ణయాలు తీసుకోవడం మోడీ స్టైల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. అందుకు నిదర్శనం నోట్ల రద్దు నిర్ణయం. ఇప్పుడు ఎవరి ఊహకూ అందని డెసిషన్, ఉన్నత కులాలకు పది శాతం రిజర్వేషన్. కానీ దీని వెనక మోడీ రాజకీయ ఎత్తుగడ, ఎవరి అంచనాకు అందనిది. ఇంతకీ అగ్రవర్ణాలకు పదిశాతం కోటా వెనక నమో పొలిటికల్ స్ట్రాటజీలేంటి?
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు, దేశంలో ఎంతటి ఉద్యమానికి కారణమైందో అందరికీ చూశారు. బీజేపీకి వ్యతిరేకంగా దళితులు రోడ్డెక్కారు. పోలీసుల లాఠీఛార్జి, కాల్పుల్లో పలువురు చనిపోయారు కూడా. ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని దళితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సుప్రీం మార్పులకు విరుగుడుగా ఆర్డినెన్స్ జారీ చేసి, పార్లమెంట్‌లో ఆమోదించి, దళితుల ఆగ్రహాన్ని చల్లార్చింది మోడీ సర్కారు. కానీ ఇదే పరిణామం అటు, అగ్రవర్ణాలకు కోపం తెప్పించింది. అది మూడు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రతిఫలించింది.
ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టంలో మార్పులు చేయలేదని మోడీ సర్కారు మీద రగిలిపోయిన అగ్రవర్ణాలు, మూడు రాష్ట్రాల ఎన్నికల్లో తమ ఆగ్రహాన్ని ప్రదర్శించారు. అందుకు వారు ఎంచుకున్న అస్త్రం నోటా. అవును. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ ఎన్నికల్లో, బీజేపీ ఓటు బ్యాంకయిన అగ్ర కులాలు, కమలం గుర్తుకు కాకుండా, 'నోటా' మీట నొక్కేశారు. మధ్యప్రదేశ్‌లో 'నోటా'కు 1.4 శాతం ఓట్లు వచ్చాయి. ఇక్కడ కాంగ్రెస్-బీజేపీల మధ్య ఉన్న ఓట్ల తేడా కేవలం 0.1 శాతమే. 22 స్థానాల్లో వచ్చిన మెజార్టీలు 'నోటా'కు వచ్చిన ఓట్లు కన్నా తక్కువగా ఉన్నాయంటే గెలుపోటములను నోటా ఎంతగా ప్రభావితం చేసిందో అర్థం చేసుకోవచ్చు. అలాగే ఛత్తీస్‌గఢ్‌లో నోటాకు వచ్చిన ఓట్లు 2.1 శాతం. అందుకే నోటా మీట నొక్కిన అగ్రకులాలకు తిరిగి దగ్గరయ్యేందుకు మోడీ పట్టిన బాట కోటా.