ఏపీలో వైఎస్సార్ యాంత్రీకరణ సేవా పథకంగా మారిన యాంత్రీకరణ పథకం
YSR Yantrikaran Scheme: వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులతో కరవు సీమను సస్యశ్యామలం చేయాలన్న ప్రభుత్వ ఆశయాలను అందిపుచ్చుకున్న అనంత రైతులు అద్భుతాలు సృష్టిస్తున్నారు.
YSR Yantrikaran Scheme: వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులతో కరవు సీమను సస్యశ్యామలం చేయాలన్న ప్రభుత్వ ఆశయాలను అందిపుచ్చుకున్న అనంత రైతులు అద్భుతాలు సృష్టిస్తున్నారు. గ్రామాల్లో కూలీలకు గిరాకీ పెరిగిన ప్రస్తుత తరుణంలో దుక్కి దున్నడం మొదలు పంట కోత వరకు యంత్ర సాయం తీసుకుంటున్నారు. ప్రభుత్వం రాయితీ తో అందిస్తున్న పరికరాలను వినియోగించుకంటున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ ద్వారా కొన్నేళ్లుగా అమలు చేస్తున్న యాంత్రీకరణ పథకంలో కీలక మార్పులు చేసింది ప్రభుత్వం. వైఎస్‌ఆర్ యాంత్రీకణ సేవా పథకం పేరుతో కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. గతంలో లాగా వ్యక్తిగతంగా కాకుండా రైతులు ముందుకొచ్చి బృందాలుగా ఏర్పడిన వారికే రాయితీ పరికరాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరి ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త నిబంధనలు ఏ విధంగా ఉన్నాయి. ఈ పథకంలో భాగంగా యంత్రాలను పొందేందుకు రైతులు అనుసరించాల్సిన పద్ధతులేమిటి ? ఎవరిని సంప్రదించాలి ఇప్పుడు తెలుసుకుందాం.
రైతులకు ప్రభుత్వం రాయితీతో సరఫరా చేసే యంత్రాలను ఇకపై వ్యక్తిగతంగా కాకుండా గ్రూపులకు కేటాయిస్తున్నారు. వైఎస్ ఆర్ యాంత్రీకరణ సేవా పథకం పేరుతో ప్రభుత్వం నిబంధనలను మార్చి ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామస్థాయిలో ఉన్న ప్రతి రైతు బరోసా కేంద్రంలో కస్టమర్ హైరింగ్ సెంటర్ ను ఏర్పాటు చేసింది. రెవెన్యూ డివిజన్ కు ఒకటి చొప్పున హైటెక్ హబ్బును ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రంలో ఐదుగురు సభ్యులు ఉన్న ఒక గ్రూపుకు యంత్రాలు, పరికరాలను రాయితీ కింద సరఫరా చేస్తారు. ఆర్‌బీకేల పరిధిలో నడిచే కస్టమర్ హైరింగ్ కేంద్రాలకు మూడు విడతల్లో పరికరాలను అందజేయనున్నారు. తొలి విడతగా జూలై నెలలో, రెండో విడత సెప్టెంబర్ లో, మూడో విడత డిసెంబర్ లో అందుకు సంబంధించిన నిధులను ప్రభుత్వం విడుదల చేయనుంది.
గతంలో ఉన్న యాంత్రీకరణ పథకాన్ని ప్రభుత్వం తాజగా పేరు మార్చి వైఎస్‌ఆర్ సేవ పథకంగా ప్రకటించింది. పథకం కింద కస్టం హైరింగ్ కేంద్రాల్లో అన్ని పరికరాలను రైతులకు అందుబాటులో ఉంచుతారు. అనంతపురం జిల్లాలో మొత్తం 867 ఆర్‌బీకే లు ఉన్నాయి. ఒక్కో ఆర్‌బీకే పరిధిలో ఒక్క రైతు గ్రూపుకు వీటిని మంజూరు చేస్తారు. జిల్లాలో తొలి విడతగా 260 గ్రూపులకు పథకం వర్తింపజేశారు. గ్రూపుల్లో ని రైతులు తమ పనులు చేసుకోవడంతో పాటు గ్రామంలోని ఇతరులకు యంత్రాలను అద్దెకు ఇచ్చే విధంగా పథకాన్ని రూపొందించారు.
జిల్లాలోని రైతులు ఏడాది కాలంగా యాంత్రాల కోసం ఎదురు చూస్తున్నారు. కస్టమ్ హైరింగ్ కేంద్రాల ద్వారా వీటిని అందజేయాలని గత ఏడాదే నిర్ణయించి, గ్రూపులను ఎంపిక చేశారు అధికారులు. ఒక్కో గ్రూపుకు 12 నుంచి 15 లక్షల వరకూ నిధుల కేటాయించారు. రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన హైటెక్ హబ్ కు ఒక కోటి పైనే నిధులు కేటాయించారు. జిల్లా వ్యాప్తంగా 851 గ్రూపుల్లో ఉన్న సభ్యులు బ్యాంకుల్లో ఖాతాలు తెరిచారు. ఇప్పటికే దాదాపు అన్ని గ్రూపుల ఖాతాలతో పాటు డీబీటీ పోర్టల్ రిజిస్టర్ చేసుకున్నారు. తాజాగా ప్రభుత్వం నిబంధనలను సడలిస్తూ ఉత్వర్వులు జారీ చేయడంతో సంఘాల్లో కొత్త ఆశలు చిగురించాయి. తాగా ఉత్తర్వుల మేరకు బ్యాంకు రుణం యాబై శాతం, 40 శాతం రాయితీ, 10 శాతం రైతు చెల్లించాలి. బ్యాంకు రుణం మినహా మిగిలిన 50 శాతం ముందుగా రైతు చెల్లించాలి. అనంతరం రాయితీ సొమ్ము వారి ఖాతాల్లోకి ప్రభుత్వం జమ చేస్తూంది.
ప్రభుత్వ ఆదేశాలతో యాంత్రీకరణ పథకాన్ని పక్కాగా అమలు చేస్తామని అధికారులు చెబుతున్నారు. నిబంధనల మేరకు గ్రూపుల్లో సభ్యులు వ్యవహరించాలని రైతులకు అందుబాటులో యంత్రాలు ఉంచాలని చెబుతున్నారు. అయితే ఈ కొత్త నిబంధనలపై రైతుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గ్రూపులకు యంత్రాలు, పరికరాలు కేటాయించి కేంద్రాల్లో ఉంచడం వల్ల రైతులకు పెద్దగా ఉపయోగం ఉండదని అంటున్నారు.
పల్లెల్లో కూలీల కొరతతో పాటు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో గ్రూపులుగా కాకుండా వ్యక్తిగతంగా యంత్ర పరికరాలను అందించాలని రైతులు, రైతుసంఘాల నేతలు కోరుతున్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఒక్క యూనిట్ మాత్రమే గ్రామంలో అందుబాటులో ఉంచితే రైతుల అవసరాలు తీరవంటున్నారు. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని సూచిస్తున్నారు.