ఒక్కసారిగా రెండు రోజుల నుంచి వాతావరణం చల్లగా మారిపోయింది. ఆదివారం కురిసిన వర్షాలకు రైతులు అవస్థలు పడ్డారు. చేతికందిన పంట పై వాన విరుచుకుపడడంతో పంటలు దెబ్బతినే పరిస్థితి వచ్చింది. ఇక సోమవారం ఉదయం నుంచి ఆకాశం మబ్బులతో నిండిపోయింది. వర్షం కురవలేదు కానీ.. గాలిలో తేమ శాతం బాగా పెరిగిపోయింది.
ఇదిలా ఉంటె ఇదే వాతావరణం మరో రెండు రోజులు ఉండే అవకాశం కనిపిస్తోందని వాతావరణ శాఖ చెబుతోంది. రాబోయే రెండు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 14 డిగ్రీలకు పడిపోయే అవకాశం ఉందనీ, గరిష్ట ఉష్ణోగ్రతలు 29 డిగ్రీల వరకూ నమోదయ్యే అవకాశం ఉందనీ చెబుతున్నారు. ఇక వారాంతంలో గరిష్ట ఉష్ణోగ్రతలు పెరిగే చాన్స్ ఉందని అంటున్నారు.
ఈరోజు హైదరాబాద్ లో కనిష్ట ఉష్ణోగ్రత 15 డిగ్రీలు నమోదు కాగా, గరిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీలుగా నమోదయింది. ఇక రేపు (మంగళవారం) కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉండగా, గరిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీల వరకూ ఉండొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. రేపు కూడా ఆకాశం మేఘావృతమై ఉంటుందనీ, సుమారు 14 కిలోమీటర్ల వేగంతో చల్లగాలులు వీచే అవకాశం ఉందనీ వారు చెబుతున్నారు.