Terrace Gardening: మిద్దెసాగులో రాణిస్తున్న భాగ్యనగరానికి చెందిన అక్కచెల్లెళ్లు
Terrace Gardening: అక్కడ పూలు విరగబూస్తాయి. పండ్ల గుత్తులు ముచ్చట గొలుపుతాయి.
Terrace Gardening: అక్కడ పూలు విరగబూస్తాయి. పండ్ల గుత్తులు ముచ్చట గొలుపుతాయి. రకరకాల కాయగూరలు, ఆకుకూరలు ప్రతి రోజూ పలకరిస్తాయి. అయితే అవేవీ భారీ వ్యవసాయ క్షేత్రాలు కావు. వాటిని పండించేది తలపండిన రైతులు కాదు. మెట్రో నగరానికి చెందిన మహిళలు మిద్దెసాగు బాట పట్టి ఆదర్శంగా నిలుస్తున్నారు. హైదరాబాద్ లోని గాయత్రి నగర్ కు చెందిన ముగ్గురు అక్క చెల్లెళ్లు తమ మూడంతస్థుల మేడపై ముచ్చటగొలిపే మొక్కలను పెంచుతున్నారు. వృత్తిపరంగా వారి వారి విధులను నిర్వర్తిస్తూనే పని ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం పొందేందుకు ఉద్యానవనాన్ని ఇంట్లోనే నిర్మించుకున్నారు. సకుటుంబ సమేతంగా మిద్దే సేద్యం చేస్తూ ఆరోగ్యమైన, ఆహ్లాదమైన జీవితాన్ని గడుపుతున్నారు. తమ మిద్దె తోట సేద్యానికి మిద్దెతోట సాగు నిపుణులు రఘోత్తమరెడ్డి గారే స్పూర్తి అని చెబుతున్నారు.
పూతకొచ్చిన చిక్కుడు కాత కొచ్చిన నేతి బీర నిగనిగలాడుతున్న నిమ్మ గుత్తులుగా వేలాడుతున్నా వంగ, దొండ. పరిమలాన్ని వెదజల్లే పూల సొగసులు ఈ మిద్దెతోటలో అడుగుపెట్టగానే స్వాగతం పలుకుతాయి. ఇంతటి అద్భుతమైన మిద్దెతోటను నిర్మించడానికి ఈ ముగ్గురు అక్క చెల్లెళ్లు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటుంటారు. మొక్కలను చంటి పాపల్లా కాపాడుకుంటారు. సమాజిక మాధ్యమాలను అనుసరించి, నిపుణుల సలహాలు సేకరించి ఇంట్లోనే ప్రత్యేకంగా మడులను నిర్మించుకున్ని అన్ని రకాల మొక్కలను పెంచుతున్నారు. పెరుగు బక్కెట్లు, చిన్ని చిన్న టబ్బుల్లోనూ మొక్కలను పెంచుతూ మిద్దెను ఎంతో సుందరంగా అలంకరించుకున్నారు. ఈ మిద్దె తోట ద్వారా ఇంటికి కావాల్సిన కూరలను సమకూర్చుకుంటున్నామంటున్నారు. సేంద్రియ విధానంలో పండిన ఉత్పత్తులు కావడంతో ఎంతో రుచిగా ఉన్నాయంటున్నారు.
మిద్దె సాగు మొదట్లో పంటల ఉత్పత్తి చాలా తక్కువగా వచ్చేది. చీడపీడల సమస్య వెంటాడేది అయినా సేంద్రియ విధానంలోనే వాటిని నివారించి ప్రస్తుతం ఆరోగ్యకరమైన నాణ్యమైన ఉత్పత్తులను పొందుతున్నారు. విత్తనాలను స్వయంగా ఉత్పత్తి చేసుకుంటారు. ఏడాది పొడవునా మేడమీద పంట ఉత్పత్తుల వచ్చే విధంగా ప్రణాళికబద్ధంగా సాగులో ముందుకు సాగుతున్నారు. అదే విధంగా ఇంతటి నీటి కొరత ఏర్పడకుండా డ్రిప్ పైప్‌లను ఏర్పాటు చేసుకున్నారు. నీటి కొరత రాకుండా చూసుకుంటున్నారు. ఎరువులను సైతం ఇంట్లోనే తయారు చేసుకుంటున్నారు.
తెల్ల నేరేడు నల్ల జామ స్లార్ ఫ్రూట్, మల్బరీ పండ్లు, మామిడి, వాటర్ ఆపిల్ , ద్రాక్ష, అంజీర్, సపోట, దానిమ్మ, స్వీట్ నిమ్మ ఇలా ఒకటేమిటి అన్ని రకాల పండ్ల చెట్లు నిలయం ఈ నందనవనం. మార్కెట్ లో లభించే పండ్లకు, మిద్దెతోటలో సాగైన పండ్లకు ఎంతో వ్యత్యాసం ఉందంటున్నారు సాగుదారులు. సహజ పద్ధతుల్లో పండిన ఈ పండ్ల రుచే వేరప్పా అని అంటున్నారు.
మూడేళ్ల క్రితం మొదలు పెట్టిన ఈ మిద్దెతోటలో ప్రస్తుతం 200 లకు పైగా మొక్కలు ఉన్నాయి. ఈ అక్క చెల్లెళ్లే కాదు కుటుంబసభ్యులందరూ ఒక్కొక్కరు ఒక్కో పని చేస్తూ మిద్దెతోటను విజయవంతంగా అభివృద్ధి చేస్తున్నారు. తోట పని, ఎరువులను అందించడం, నీటి యాజమాన్యం, మెక్కల పోషణ ఇలా ఎవరికి వారు పనులను విభజించుకుని మొక్కలను పెంచుతూ వాటి ఫలాలను అనుభవిస్తున్నారు. మిద్దె తోటల ద్వారా పట్నంలో పల్లెటూరి వాతావరణం కనిపిస్తోందని ఎంతో ఆనందమైన సమయాన్ని గడుతున్నామని సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కుటుంబసభ్యులు.