Terrace Gardening: పిల్లలకు పౌష్ఠికాహారం కోసం ఇంటి పంట సాగు
Terrace Gardening: బండ్లగూడకి చెందిన సరిత ఉపాధ్యాయురాలిగా ఓ ప్రైవేటు స్కూల్‌లో ఉద్యోగం చేస్తుండేవారు.
Terrace Gardening: బండ్లగూడకి చెందిన సరిత ఉపాధ్యాయురాలిగా ఓ ప్రైవేటు స్కూల్‌లో ఉద్యోగం చేస్తుండేవారు. కరోనా కారణంగా విద్యాసంస్థ మూసివేయడంతో ప్రస్తుతం ఆమె ఇంటికే పరిమితమయ్యారు. ఈ ఖాళీ సమయాన్ని అర్థవంతంగా వినియోగించుకోవాలనుకున్నారు ఆమె. ఈ క్రమంలో ఆమె మనస్సు మిద్దె తోటల సాగు వైపు మళ్లింది. మేడ మీద ఖాళీ స్థలంలో ఆరోగ్యకరమైన పద్ధతిలో ఇంటికి సరిపడా కూరగాయలు,ఆకుకూరలు, పండ్లు పండించాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా దాన్ని ఆచరణలో పెట్టి చక్కటి మిద్దె తోటను నిర్మించుకున్నారు. పూర్తి సేంద్రియ పద్ధతుల్లోనే పంటలు పండించుకుంటున్నారు. ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు.
కేవలం కూరగాయలు, ఆకుకూరలలకే వీరి మిద్దె తోటను పరిమితం చేయలేదు ఈ మెద్దసాగుదారు. పలు రకాల పండ్లు, ఔషధ మొక్కలను విరివిగా పెంచుతున్నారు. తమ పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించేందుకే ఈ మిద్దె తోట అని అంటున్నారు సరిత. రసాయనిక ఆహారానికి స్వస్తి చెప్పడానికే మిద్దె తోటలకు శ్రీకారం చుట్టామంటున్నారు సరిత. పంటల ఎదుగుదలకు, చీడపీడల నివారణకు సేంద్రియ ఎరువులనే వినియోగిస్తున్నారు. సాగు ప్రారంభంలో విత్తనాలను బయట నుంచి సేకరించిన ఈ సాగుదారు ప్రస్తుతం సొంతంగా తోటలోనే విత్తనాలను తయారు చేసుకుని వాటినే మరో పంటకు వినియోగిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఆహార ఉత్పత్తుల్లో నూటికి నూరు శాతం పోషకాలు ఉంటాయంటున్నారు.
టెర్రస్‌పైన సురక్షిత పద్ధతుల్లో సొంతంగా కూరగాయలు, ఆకుకూరలు పండించుకోవాలనే ఆలోచన చాలా మందిలో ఉంటుంది. కానీ ఆ ఆలోచనకు అంకురార్పణ చేసేది మాత్రం కొందరే. మిద్దె సాగుపైన ఉన్న అపోహలే అందుకు కారణం అని చెప్పక తప్పదు. మేడ పాడవుతుందా? నీరు సరిపోతాయా? ఖర్చు ఎక్కువవుతుందేమోనని ఆలోచిస్తుంటారు. అందుకే కొత్తగా మిద్దె తోటలు ప్రారంభించాలనుకునే వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ? ఎలాంటి ఉపకరణాలు కావాల్సి ఉంటుంది ? ఏ విధమైన యాజమాన్య పద్ధతులు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.