Terrace Gardening: మిద్దె సాగులో రాణిస్తున్న కుద్బుల్లాపూర్ వాసి రాధిక
Terrace Gardening: పట్టణానికి వచ్చినా పల్లె వాసనలు పోలేదు. కోళ్లు, ఆవులు మధ్య పెరిగిన బాల్యం పచ్చటి మొక్కలు మధ్య గడిపిన కాలం ఆమె కళ్ల ముందు ఇంకా ఆ దృష్యాలు కదలాడుతూనే ఉన్నాయి.
Terrace Gardening: పట్టణానికి వచ్చినా పల్లె వాసనలు పోలేదు. కోళ్లు, ఆవులు మధ్య పెరిగిన బాల్యం పచ్చటి మొక్కలు మధ్య గడిపిన కాలం ఆమె కళ్ల ముందు ఇంకా ఆ దృష్యాలు కదలాడుతూనే ఉన్నాయి. కాంక్రిట్ జంగిల్‌లో కాలం వెల్లదీయడం కాస్త ఇబ్బందిగా మారింది. కాలుష్యపు వాతావరణం, రసాయనాలతో పండిన ఆహారం ఆమెకు రుచించలేదు. గత అనుభవాల దృష్ట్యా తానే సొంతంగా పంటల సాగు చేయాలనుకుంది. నేల లేదు దీంతో మేడే ముద్దనుకుంది. మిద్దె సాగుకు శ్రీకారం చుట్టింది హైదరాబాద్‌కు చెందిన గృహిణి రాధిక. పూర్తి సేంద్రియ విధానంలో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు , పూల పెంపకం చేస్తూ ఎంతో మంది గృహిణిలకు స్ఫూర్తిగా నిలుస్తోంది.
చిత్తూరుకు చెందిన రాధిక వివాహానంతరం హైదరాబాద్‌లోని కుద్బుల్లాపూర్ లో స్థిరపడ్డారు. భర్త చంద్రబాబు నాయుడు ఓ వ్యాపారవేత్త రాధికది వ్యవసాయ కుటుంబం చిన్నప్పటి నుంచి మొక్కల మీద ఆమెకు మమకారం ఎక్కువ. పల్లె వాతావరణంలో పెరిగిన రాధిక పట్టణంలో పచ్చటి వనాన్ని నిర్మించాలనుకుంది. అందుకు తన ఇంటినే ఓ వ్యవసాయ క్షేత్రంలా మార్చుకుంది. మొక్కలకు ఏ హాని కలుగకుండా జీవవైవిధ్యాన్ని కాపాడుతు మిద్దె తోటల సాగుకు ఉపక్రమించింది ఈ సాగుదారు. రసాయనరహిత ఆహారాన్ని మిద్దె తోటల ద్వారా పెంచాలన్నదే ఆమె ప్రధాన ఉద్దేశం.
గత ఏడాదిన్నర కాలంగా సామాజిక మాధ్యమాల సహకారంతో మిద్దె తోటలను విజయవంతంగా నిర్వహిస్తోంది రాధిక. మొదట చిన్న కుండీల్లో ఆకు కూరలతో మొదలైన ఈ మిద్దె తోట అంచెలంచెలుగా కూరగాయలు, పండ్ల మొక్కలతో నిండి ఓ నందనవనంగా మారింది. ఈ మిద్దె తోటలో వచ్చే ప్రతి ఉత్పత్తి ఎంతో ఆరోగ్యంగా భలే రచిగా వుంటాయని సంతోషం వ్యక్తం చేస్తోంది.
వరుస క్రమంలో నిండుగా గార్డెన్ ను ఏర్పాటు చేసుకుంది. గార్డెన్‌లో సుమారు 200 నుంచి 250కిపైగా కుండీలు ఉన్నాయి. వీటిలో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, ఔషధ మొక్కలతో పాటు మార్కెట్‌లో కొత్తగా ఏ మొక్క కనిపించినా ఇట్టే మేడ మీద నాటాల్సిందేనని ఈ సాగుదారు చెప్పుకొస్తున్నారు. లాక్‌డౌన్ సమయంలో మిద్దె తోటలు ఎంతో మేలు చేసాయంటోంది రాధిక. మార్కెట్ పై ఆధరపడకుండా తోటలో పండిన ఆహారాన్ని తీసుకున్నామని చెబుతోంది.
టెర్రస్ మీద బరువు పెరుగుతుందని , మట్టి లేకుండా పంటలు పండించాలేమని చాన్నాళ్లు పంటల సాగు చేయాలనే కోరికను చంపేసుకున్నానని రాధిక చెబుతోంది. కానీ మట్టి అవసరం పెద్దగా లేకుండానే పచ్చటి పంటలు పండించవచ్చని తెలుసుకోవడంతో ఇక తనను ఆపడం ఎవరితరం కాదంటూ నచ్చిన మొక్కను మేడ మీద పెంచేస్తోంది. డాబాపైన బరువు పడకుండా కిచెన్ వేస్ట్, ఎండిపోయిన ఆకులు, కాస్త మట్టిని ఉపయోగించి మిశ‌్రమాన్ని తయారుచేసుకుని ఆ మిశ్రమాన్ని కుండీల్లో వేసుకుని పంటలు పండిస్తోంది. మేడ మీద మొక్కలను పెంచడం ఎంతో సులవని రుజువుచేస్తోంది.
మేడ మీద ఇన్ని మొక్కలను పెంచాలంటే ఎక్కువ మొత్తంలోనే నీరు అవసరం ఉంటుంది. అంతేకాదు ఇంచు మించు నీటిని అందించేందుకు గంట వరకు సమయం పడుతుంది. నీటిని అందించేందుకే ఇంత సమయం పడితే మొక్కల సంరక్షణకు ఇబ్బంది అవుతుందని తెలుసుకుని డ్రిప్ విధానాన్ని ఏర్పాటు చేసుకుంది. డ్రిప్పు పెట్టినా గార్డెన్‌లో నీరు అందిస్తున్నంత సేపు ప్రతీ ఒక్క మొక్క యోగక్షేమాలు తెలుసుకుంటూ వాటిని గమనిస్తూ ఉంటానని రాధిక చెబుతోంది.
చీడపీడల ఉధృతి నివారించేందుకు ట్రాపర్స్ ను ఏర్పాటు చేసుకుంది. పిచ్చుకలను ఆహ్వానించేందుకు గార్డెన్‌లో వాటికి నీరు , ఆహారం అందే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఉదయం సమయంలో ఆ పిచ్చుకల కిలకిలరావాలు వింటూ మొక్కల మధ్య సమయం గడపడం ఎంతో సంతృప్తని అందిస్తుందని చెబుతోంది. అంతే కాదు మొక్కలకు ఎలాంటి పురుగు ఆశించినా ఈ పిచ్చుకలు వాటిని తింటామని తద్వారా మొక్కలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవంటోంది. ఇక పాలినేషన్ కోసం సీతాకోకచిలుకలు, తేనెటీగలను ఆకర్షించేందుకు వివిధ రకాల పూల మొక్కలను పెంచుతున్నానని రాధిక చెబుతోంది.
టబ్బులు , గ్రోబ్యగులు, గ్రో బెడ్స్ , పెయింట్ బక్కెట్లు, చిన్న చిన్న కుండీలను మిద్దె సాగుకు వినియోగిస్తోంది రాధిక. ఇంకా కుండీల కిందకు స్టాండ్స్ ను ప్రత్యేకంగా చేయించుకుంది. తద్వారా కుండీల నుంచి వచ్చిన వృథాగా నీరు త్వరగా ఆరిపోడంతో పాటు మేడను సులభంగా శుభ్రం చేసుకోవచ్చంటోంది. ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తున్న ఈ మిద్దె తోటను నెలకొల్పేందుకు 80 వేల రూపాయల వరకు ఖర్చైందట. కానీ ఆ ఖర్చు ఏమాత్రం వృథా కాలేదంటోంది రాధిక. మార్కెట్‌పై ఆధారపడకుండా ఇంటిపట్టునే నిత్యం ఆరోగ్యకరమైన తాజా ఆహారాన్ని ప్రతి రోజు తినగలుగుతున్నామని చెబుతోంది. ఒక్కసారి పెట్టిన ఈ పెట్టుబడి సుదీర్ఘకాలం మనకు మేలు చేస్తోందని అంటోంది.
ప్రతి మొక్కకు సంవృద్ధిగా పోషకాలు అందితేనే పంట బాగా పండుతుంది. నేల మీద పంటలు సాగు చేసే వారు నేల అందించే పోషకలతో పంట సాగు చేసుకోవచ్చు కానీ మిద్దె తోటల సాగుదారులకు ఆ అవకాశం ఉండదు తొట్టెల్లో, బ్యాగుల్లో, ప్లాస్టిక్ టబ్బుల్లో మొక్కల పెంపకం చేపట్టాలి కాబట్టి అందుకోసం ప్రత్యేకంగా సేంద్రియ ఎరువులను తయారు చేసుకోవాలంటోంది రాధిక. వేస్ట్ డీకంపోజర్‌తో పాటు జీవామృతం, పంచగవ్య, ఎండిపోయిన పశువుల ఎరువు, ఫిష్ ఎమినో యాసిడ్, ల్యాబ్, కడిగిన బియ్యం నీటిని, పులిచిన మజ్జిగను ప్రణాళికా ప్రకారం మొక్కలకు అందిస్తోంది.