Terrace Garden: కపుల్స్ ఇంట.. కనువిందైన పంట
Terrace Garden: హైదరాబాద్‌లోని దమ్మాయిగూడెంకు చెందిన హరీష్ రెడ్డి, విజయ దంపతులు ఇద్దరూ వ్యాపారం చేస్తున్నారు.
Terrace Garden: హైదరాబాద్‌లోని దమ్మాయిగూడెంకు చెందిన హరీష్ రెడ్డి, విజయ దంపతులు ఇద్దరూ వ్యాపారం చేస్తున్నారు. ఒక్కప్పుడు ప్రతి రోజు వీరి దినచర్య గజిబిజిగానే గడుస్తుండేది. ఎన్నో వ్యాపర టెన్షన్స్ ప్రశాంతమైన సమయం ఉండేది కాదు. అయితే గత ఏడాది కరోనా లాక్ డౌన్ సమయంలో దొరికిన కాస్త సమయం వీరిలో కొత్త మార్పును తీసుకువచ్చింది. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు ఈ కపుల్స్. ఇంటికి కావాల్సిన ఆహారాన్ని ఇంటిపైన పెంచుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు. చిన్నగా ఆకుకూర సాగుతో మిద్దె సేద్యాన్ని ప్రారంభించారు. అందులో సత్ఫలితాలు అందడంతో ప్రస్తుతం మేడమీదకూరగాయలు పండిస్తున్నారు. వారంలో 4 రోజులుకు సరిపోను పంట ఉత్పత్తులను పొందుతున్నారు. మిద్దె సాగుతో ఆరోగ్యవంతమైన ప్రశాంతమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు.
ప్రారంభంలో చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యాయి. కానీ వాటిని అధిగమించి చక్కటి ప్రణాళికలతో పంటల సాగు చేస్తున్నారు ఈ దంపతులు. సామాజిక మాధ్యమాలు, నిపుణుల సలహాల మేరకు ఎరువును , మట్టి మిశ్రమాన్ని తయారు చేసుకోవడం, కుండీలను ఏర్పాటు చేసుకోవడం తెలుసుకున్నారు. ముందుగా మిద్దపైన పగుళ్లు ఏర్పడకుండా వాటర్ ప్రూఫ్ పెయింట్ నుం వేయించారు. ఆ తరువాత స్టాండ్స్ ఏర్పాటు చేసుకుని వాడేసిన పెయింట్ బక్కెట్లను కుండీలుగా ఏర్పాటు చేసుకున్నారు. కోకోపిట్, మట్టి, ఆవు ఎరువును ఉపయోగించి మట్టి మిశ్రమాన్ని తయారు చేసుకున్నారు. ప్రస్తుతం ఇంటికి అవసరమైన అన్ని రకాల కూరగాయలను పండిస్తున్నారు.
ఎంత పండించామన్నది కాదు ఎలా పండించామన్నదే ముఖ్యమంటున్నారు ఈ దంపతులు. మార్కెట్‌లో రసాయనాలతో పండిన ఆహారానికి మిద్దె మీద సాగయ్యే పంటకు ఎంతో తేడా ఉందంటున్నారు. సేంద్రియ విధానాలు అవలంభించి పండించే ఈ పంటల్లో ఎన్నో ఆరోగ్య విలువలు ఉంటాయంటున్నారు. అంతే కాదు అలా తెంపి ఇలా వండుకునే వెసులుబాటు ఉండటంతో పాటు వంట కూడా ఎంతో రుచికరంగా ఉంటుందంటున్నారు. మిద్దె తోటలోని ఎండిన ఆకులు, కిచెన్ వేస్ట్‌తో పాటు వేస్ట్ డీకంపోజర్‌ను ఎరువుగా వినియోగిస్తున్నారు.
తీగజాతి కూరగాయల సాగు కోసం ప్రత్యేకంగా మేడ మీద శాశ్వత పందిరిని ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో సొర, దొండ, కాకర వంటి కూరగాయలను పండిస్తున్నారు. ప్రతి రోజు ఉదయం సాయంత్రం వేళల్లో కాస్త సమయాన్ని మిద్దె తోటలో గడపడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని చెబుతున్నారు ఈ దంపతులు. పురుగుమందులు, రసాయనాలు లేని ఆహారం తినడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తడం లేదని చెబుతున్నారు. వారాంతంలో పిల్లలతో కలిసి సరదాగా మేడ మీద గడుపుతామని తద్వారా పిలలకు ప్రకృతితో అనుబంధం ఏర్పడుతుందని చెబుతున్నారు.