ఒక్కోసారి మన ఆలోచనలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. మనకు సంతృప్తినిచ్చే పనిని మొదలుపెట్టే వరకు అది మనల్ని వీడిచి పోదు! ఆ విధంగానే సాఫ్ట్ వేర్ రంగంలో వృత్తి చేస్తున్నా కూడా, స్వంతంగా ఏదో సాధించాలనే తపన. విదేశాలు తిరుగుతున్నా స్వదేశంలో ఇంకేదో సాధించాలనే ఆశయం. వెరసి అధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, తక్కువ విస్తీర్ణంలోనే నీటి వినియోగం ఎక్కువ అవసరం లేని RAS పద్ధతిలో, చేపల పెంపకం వైపు అడుగులేసాడు మేడ్చల్ జిల్లా, ఘట్కేశ్వర్ గ్రామానికి చెందిన పరశురామ్. కోళ్లు, పాడి పెంపకం లాగానే, కాస్త శ్రమిస్తే చేపల పెంపకం కూడా మంచి లాభాలను చేకూరుస్తుంది రైతులకు. ఆ విధంగా తనకున్న కొద్దిపాటి స్థలంలోనే, తగు జాగ్రత్తలు తీసుకుంటూ చేపల పెంపకంలో లాభాలను ఆర్జిస్తున్న, పరశురామ్ సక్సెస్ స్టోరీ పై ప్రత్యేక కథనం.
మేడ్చల్ జిల్లా, ఘట్కేసర్ గ్రామానికి చెందిన పరశురామ్, సాఫ్ట్ వేర్ రంగంలో వృత్తి చేస్తూ విదేశాల్లో పర్యటించే వాడు, కానీ స్వంతంగా వ్యాపారం చెయ్యాలనే ఆలోచన, అతన్ని చేపల పెంపకం వైపు మళ్లించింది. సాధారణంగా పెద్ద పెద్ద చెరువుల్లో చేపల పెంపకం చేయడం చూస్తుంటాం. కానీ ఇప్పుడున్న ఆధునిక పద్ధతుల్లో తక్కువ స్థలంలోనే, ఎక్కువ చేపలను సాగు చేసుకునే విధానాలు చాలానే ఉన్నాయ్, ఆ కోవకే చెందుతుంది RAS పద్ధతి. మరి ఈ పద్ధతిలో చేపల సాగు ఎలా ఉంటుంది? తక్కువ నీటి విధానంతో పాటు ఎలాంటి చేపలకు ఈ పద్ధతి అనుకూలంగా ఉంటుంది? ఆ వివరాలు అయన మాటల్లోనే తెలుసుకుందాం.
RAS పద్ధతిలో షెడ్డు నిర్మాణం చాలా ముఖ్యమైనది, అందుబాటులో ఉన్న స్థలాన్ని బట్టి పెట్టుబడులు కూడా మారుతూ ఉంటాయి. అదే క్రమంలో...చేపల పెంపకంలో తగిన జాగ్రత్తలు కూడా అవసరమే. మరి ఈ పద్ధతిలో ఉండే నిర్మాణ రకాలు, అదే విధంగా చేపలు ఎదిగే క్రమంలో రోగాలను ఎలా గుర్తుంచాలి అనే విషయాలను ఆయన మాటల్లోనే తెల్సుకుందాం.