Rabbit Farming: కుందేళ్ల పెంపకంలో రాణిస్తున్న యువరైతు
Rabbit Farming: ఎన్నో వ్యాపారాలు చేశాడు కానీ ఎందులోనూ సంపద, సంతృప్తి దక్కలేదు.
Rabbit Farming: ఎన్నో వ్యాపారాలు చేశాడు కానీ ఎందులోనూ సంపద, సంతృప్తి దక్కలేదు. అయినా వెనకడుగువేయలేదు మూగజీవాల పెంపకంపై ఉన్న ఆసక్తే కుందేళ్ల పెంపకంవైపు అడుగులు పడేలా చేసింది. లాభాలు ఉన్నా లేకున్నా తన పేరులోని సంతోషాన్ని పొందాలనుకున్నాడు యువరైతు సంతోష్. తనకు తెలియని మార్గేమే అయినా మొక్కవోని ధైర్యంతో ఎంతో మక్కువతో కుందేళ్ల పెంపకం చేపట్టాడు లాభాల దిశగా పయనిస్తున్నాడు. నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.
ప్రస్తుత తరుణంలో అధిక శాతం మంది కోళ్లు, గేదెలు, ఆవులతోపాటు కుందేళ్లను పెంపకాన్ని చక్కని ఉపాధి మార్గంగా ఎంచుకుంటున్నారు. తక్కువ శ్రమతో అధిక లాభాలు వచ్చే కుందేళ్ల పెంపకం ఇప్పుడు చక్కని ఆదాయవనరుగా మారింది. సులభంగా పెంపకం చేపట్టే సౌలభ్యం ఉండటంతో పాటు మార్కె్ట్ లో గిరాకీ ఉండటంతో యువకులు ఈ రంగంవైపు అడుగులు వేస్తున్నారు. అలాంటి కోవలోకే వస్తాడు. హైదరాబాద్ శివారులోని హయత్‌నగర్ మండలం పశు మాముల గ్రామంకు చెందిన సంతోష్ రెడ్డి. గతంలో ఎన్నో వ్యాపారాలు చేశాడు సంతోష్. ఒక సినిమాకు నిర్మాతగానూ వ్యవహరించాడు కానీ అందులో అతనికి సంతృప్తి కానీ లాభాలు కానీ దక్కలేదు. ఏ వ్యాపారమూ కలిసిరాకపోవడంతో స్వతహాగా పెట్ లవర్ అయిన సంతోష్ కుందేళ్ల పెంపకం చేపట్టాలనుకున్నాడు. నిపుణుల సలహాలను తీసుకున్నాడు. పెంపకంలో అవగాహన ఏర్పరుచుకున్నాడు. తనకున్న స్థలంలో షెడ్డును ఏర్పాటు చేసుకుని కుందేళ్ల పెంపకం మొదలు పెట్టాడు.
తక్కువ శ్రమతో, ఎక్కువ లాభాలు కుందేళ్ల పెంపకం ద్వారా పొందవచ్చని గుర్తించిన సంతోష్ ఈ రంగం వైపు అడుగులు వేశాడు. ఇంతకు ముందు చేసిన వ్యాపారాలకంటే ఎక్కు సంతృప్తి సంతోషం కుందేళ్ల పెంపకం ద్వారా పొందుతున్నానని అంటున్నాడు ఈ యువరైతు. ప్రస్తుతం సంతోష్ ఫామ్ లో 20 యూనిట్లలో 200 కుందేళ్లు ఉన్నాయి. ఒక్కో కుందేలు బరువు రెండు కేజీలు రాగానే బ్యాచ్ ల వారీగా వీటిని విక్రయిస్తున్నాడు.
కుందేళ్ల పెంపకంలో లాభనష్టాల మాట అటుంచితే వాటి సాగు ద్వారా ఎంతో సంతోషం లభిస్తుందని అంటున్నాడు సంతోష్. సున్నితమైన కుందేళ్లను ఎంతో ప్రాణంగా పెంచుతున్నాడు ఈ యువరైతు. కుందేళ్ళకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. వాటికి ఆహారంగా ఉదయం మొక్కజొన్న పిండి, గోధుమ పొట్టు, సజ్జల పిండి, పల్లిచెక్క పొట్టు, మినలర్ మిక్చర్ ను కలిపి తయారు చేసిన ప్రత్యేక దాణాను అందిస్తున్నాడు. సాయంత్రం పచ్చి గ్రాసాలు ఇస్తున్నాడు. వీటికోసం షెడ్డు ఆవరణలోనే సేంద్రియ విధానంలో గ్రాసాలను సాగు చేస్తున్నాడు. గ్రాసాల కొరత ఏర్పడినప్పుడు ఇబ్బందులు తలెత్తకుండా పలు రకాల అకుకూరలు పండిస్తున్నాడు. కుందేళ్లు ఆరోగ్యంగా పెరగాలంటే ఆహారం విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి అని అంటున్నాడు సంతోష్ రెడ్డి.
కుందేళ్లు అన్ని రకాల తృణధాన్యాలను ఇష్టపడతాయి. పచ్చిగడ్డి, క్యాబేజీ ఆకులు, పాలకూర ఆకులను కూడా అవి ఇష్టపడతాయి. అందుకే వాటికి ఆహారంగా ప్రత్యే దాణాను తయారు చేసి అందిస్తున్నాడు సంతోష్. అందుకోసం అవసరమయ్యే గ్రాసాలను, ఆకుకూరలను సేంద్రియ విధానంలోనే పండిస్తున్నాడు. కుందేళ్లకు మేత కచ్చితంగా సమయం ప్రకారం ఇవ్వాలి. ఆలస్యమైతే అవి బెంబేలెత్తి, నీరసించి బరువు తగ్గిపోతాయి. ఎక్కువ ఉష్ణోగ్రత వల్ల కుందేళ్లు ఉదయం ఆహారం సరిగా తీసుకోవు. రాత్రి వేళల్లో మాత్రం చురుగ్గా ఉంటాయి. అందువల్ల రాత్రి పూట కుందేళ్లకు పచ్చి గ్రాసాలు ఆహారంగా అందిస్తే చక్కగా తింటాయి.
సంతోష్ ఫామ్ లో మొత్తం 200 కుందేళ్లు ఉన్నాయి. వీటి కోసం ప్రత్యేక కేజులు ఏర్పాటు చేశాడు ఈ యువరైతు. షెడ్డు నిర్మాణంలోనూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నాడు. నీరు అందించేందుకు డ్రిప్ పైపులను అమర్చాడు. తద్వారా కుందేళ్లు అవసరమైనప్పుడు నీటిని తాగడంతో పాటు కేజులు శుభ్రంగా ఉంటాయంటున్నాడు. ఇక ప్రస్తుతం వేసవి సీజన్ కావడంతో వేడిమి నుంచి కుందేళ్లను కాపాడేందుకు మోర్టాలిటీ రేట్ ను తగ్గించేందుకు ప్రత్యేక విధానాలు అనుసరిస్తున్నాడు. 20 యూనిట్‌లకు గాను ఎనిమిది రకాలకు చెందిన 200 కుందేళ్లు ఉన్నాయి. వీటికి అనువుగా ఉండే విధంగా కేజులను ఏర్పాటు చేసుకున్నాడు సంతోష్.
గాలి, వెళుతురు సమపాళ్లల్లో వచ్చే విధంగా షెడ్డు నిర్మించాడు. కుందేళ్లకు నీరు అందించేందుకు డ్రిప్‌లను ఏర్పాటు చేశాడు. ప్రతి కేజ్‌కు ఒక డ్రిప్ పరికరాన్ని అమర్చాడు తద్వారా కుందేళ్లు వాటికి నీరు అవసరం అయినప్పుడు తాగే వెసులుబాటు కల్పించాడు. గిన్నె్ల్లో నీరు అందించడం వల్ల తరుచూ శుభ్రం చేస్తూ ఉండాలి. ఈ విధానంలో ఆ శర్ర తగ్గుతుందంటున్నాడు. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో షెడ్డులో చల్లని వాతావరణాన్ని ఏర్పాటు చేయాలంటున్నాడు. అందుకోసం షెడ్డుపైన స్ప్రింక్లర్లను ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నాడు. షెడ్డుపైన గడ్డి వేయడం వల్ల చల్లదనం ఏర్పడుతుందని చెబుతున్నాడు. ఇక నాలుగు గోడల చుట్టూ గన్నీ బ్యాగులను ఏర్పాటు చేసి వాటిలో డ్రిప్ నుంచి నీరు పడే విధంగా జాగ్రత్తలు తీసుకుంటే కుందేళ్లు వేసవిలో వేడిమి నుంచి ఉపశమనం పొందుతాయంటున్నాడు.
కుందేళ్లకు వ్యాధులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పదిహేను రోజులకు ఓసారి వ్యాక్సినేషన్ చేయించాలంటున్నాడు సంతోష్. ఎప్పటికప్పుడు షెడ్డును శుభ్రం చేస్తూ ఉండాలని ,షెడ్డులో అమ్మోనియా, ఫంగస్ ఏర్పడకుండా జాగ్రత్తలు వహించాలని సూచిస్తున్నాడు. అవసరమైతే డాక్టర్‌ను సంప్రదించి వాటి ఆరోగ్యాన్ని పరీక్షించాలని తెలిపాడు.
తక్కువ శ్రమతో అధిక లాభాలను కుందేళ్ల పెంపకం ద్వారా పొందవచ్చంటున్నాడు సంతోష్. కూలీల అవసరం కూడా తక్కువగా ఉంటుందని చెబుతున్నాడు. ఈ రంగంలోకి రావాలనుకునే వారు పూర్తిస్థాయిలో రావాలని సూచిస్తున్నాడు. లేదంటే నష్టాలు తప్పవంటున్నాడు. ప్రస్తుతం కుందేళ్ల పెంపకం చేపట్టిన సంవత్సరంలోనే 4 నుంచి 5 క్రాపులు తీశాడు ఈ యువరైతు. తద్వారా లాభదాయకమైన ఆదాయాన్ని పొందానంటున్నాడు.
కుందేళ్ల పెంపంకం చేపట్టిన మొదటి 5 నెలలు ఎలాంటి ఆదాయం రాదని చెబుతున్నాడు సంతోష్. ఆ ఐదు నెలల ఖర్చులు వెళ్లదీసేందుకు ఏం చేయాలో కూడా తమను సంప్రదిస్తే సలహాలు సూచనలు ఇస్తామంటున్నాడు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో కాస్త దృష్టి సారిస్తే లాభాలు అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదంటున్నాడు యువరైతు సంతోష్. ఆ విధంగానే కుందేళ్ల పెంపకంలో పూర్తి అవగాహన సాధించి కొన్ని మెళకువలు పాటిస్తే కచ్చితంగా లాభాలు అందుతాయని సూచిస్తున్నాడు. నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.