కుందేళ్ల పెంపకంలో ప్రతి నెల ఉద్యోగి మాదిరి ఆదాయం పొందుతున్న యువరైతు

Rabbit Farming: నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండలం, వెలిమినేడు గ్రామానికి చెందిన ఏపుల లింగస్వామి బిఎస్సీ పూర్తి చేసి కొద్దికాలం ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించాడు.

Update: 2022-01-10 10:32 GMT

కుందేళ్ల పెంపకంలో ప్రతి నెల ఉద్యోగి మాదిరి ఆదాయం పొందుతున్న యువరైతు

Rabbit Farming: నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండలం, వెలిమినేడు గ్రామానికి చెందిన ఏపుల లింగస్వామి బిఎస్సీ పూర్తి చేసి కొద్దికాలం ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించాడు. అనంతరం సంవత్సర కాలం పాటు ప్రైవేటు స్కూల్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. అయినా చేసే ఉద్యోగం సంతృప్తిని ఇవ్వకపోవడంతో వ్యవసాయ అనుబంధ రంగాలపైన ఆసక్తి చూపాడు. తనకున్న రెండున్నర ఎకరాల పొలంలో కుందేళ్ల పెంపకం చేపట్టాలన్న నిర్ణయానికి వచ్చాడు. కుందేళ్లను ఎలా పెంచాలి? వాటికి ఏ వ్యాధులు వస్తాయి? వాటిని ఎలా నివారించాలి? బ్రీడింగ్ చేసే పద్ధతేమిటి వంటి వివరాలపైన నిపుణుల సలహాలను తీసుకుని పూర్తిస్థాయిలో పెంపకంపై అవగాహన పెంచుకున్నాడు. లాభనష్టాలను బేరీజు వేసుకుని పెంపకం మొదలు పెట్టాడు ప్రారంభంలో కాస్త ఇబ్బందులు ఎదురైనా ఇప్పుడు చక్కటి ఆదాయాన్ని పొందుతూ తోటి యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు లింగస్వామి.

60 అడుగలు పొడవు, 30 అడుగుల వెడల్పుతో చిన్నపాటి షెడ్డును కుందేళ్ల పెంపకంకోసం నిర్మించాడు ఈ యువరైతు. కుందేళ్లు తిరిగేందుకు అనువుగా కేజ్‌లను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రస్తుతం ఏడు రకాల కుందేళ్లను పెంచుతున్నాడు. మిక్స్‌డ్ జెయింట్‌, గ్రే జెయింట్, న్యూజిల్యండ్ వైట్, బ్లాక్ జెయింట్, అంగోరా వైట్, సోవియట్ చించిల్లా వంటి రకాలను పెంచి మీట్‌గానూ, బ్రీడర్లుగానూ విక్రయిస్తున్నాడు.

అప్పుడే పుట్టిన పిల్లలను ఎంతో జాగ్రత్తగా కాపాడుతూ పెంచుతున్నాడు లింగస్వామి. ఒక రోజు పిల్లలను కేజ్‌లలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బాక్సుల్లో ఉంచుతున్నాడు. ఆ బాక్సుల్లో తల్లి పొట్ట కింది భాగంలోని వెంట్రుకలను, వరి పొట్టును ఏర్పాటు చేసి పిల్లలకు రక్షణ కల్పిస్తున్నాడు. ప్రతి రోజు పిల్లలు తల్లి పాలు తాగాయో లేదో గమనిస్తూ ఉంటాడు. తల్లిపాలు తప్పక పిల్లలకు అందేలా చూస్తాడు. ఇలా చెక్క బాక్సుల్లో 15 రోజుల వరకు భద్రంగా పెంచిన కుందేళ్లను కేజ్‌లలో వదులుతాడు. వీటిని మీట్‌ పర్పస్‌కు అయితే 3 నెలలు, లేదా బ్రీడర్లుగా అయితే 8 నెలల వరకు పెంచుతాడు, పెట్ పర్పస్ కోసం అయితే నెల రోజుల పిల్లలనే విక్రయిస్తున్నాడు లింగస్వామి.

కుందేళ్ల పెంపకానికి ముందే వాటి దాణాకు అవసరమయ్యే దశరథ గడ్డిని తన పొలంలోనే సాగు చేస్తున్నాడు ఈ యువరైతు. ఇతర గడ్డి జాతి రకాలతో పోల్చుకుంటే ఈ గడ్డిలో పోషకాలు అధికంగా ఉంటాయని, కంపెనీ ఫీడ్ వాడనవసరం లేదంటున్నాడు. కుందేళ్ల పెంపకంలోనే కాదు పశువులకు జీవాలకు ఈ గ్రాసాన్ని అందించవచ్చంటున్నాడు. పశువులకు ఈ గ్రాసాన్ని మేతగా ఇవ్వడం వల్ల పాల దిగుబడితో పాటు వెన్న శాతం పెరుగుతుందని, ఇక జీవాల్లో మాంసం ఉత్పత్తి బాగుంటుందని తెలిపాడు.

హెడ్జ్‌ లూసర్న్ వంటి గ్రాసాలతో పాటు ప్రత్యేక దాణాను తయారు చేసి కుందేళ్లకు అందిస్తున్నాడు లింగస్వామి. మొక్కజొన్న, తవుడు, పల్లి చెక్క, గోదుమ పొట్టు, మినరల్ మిక్చర్, ఉప్పుతో తయారు చేసిన ఈ దాణాను కుందేళ్ల వయస్సును బట్టి తగిన మోతాదులో అందిస్తున్నాడు. అదే విధంగా పరిశుభ్రమైన నీటిని అందిస్తూ , వాతావరణ మార్పులతో వచ్చే వ్యాధులను నివారిస్తూ నాణ్యమైన ఉత్పత్తిని సొంతం చేసుకుంటున్నాడు.

కుందేళ్ల పెంపకంపైనే ఆధారపడకుండా చేపలను, కోళ్లను తన పొలంలోనే పెంచుతున్నాడు ఈ పెంపకందారు. ఒకవేళ కుందేళ్ల ద్వారా నష్టపోయినా కోళ్లు, చేపలు ఆ నష్టాన్ని బర్తీ చేస్తాయని లింగస్వామి చెబుతున్నాడు. చిన్నపాటి షెడ్డును ఏర్పాటు చేకున్న ఈ యువరైతు నాటుకోళ్లతో పాటు జాతి కోళ్ల ఫ్రీరేంజ్‌లో పెంచుతున్నాడు. షెడ్డు పక్కనే చిన్నపాటి కుంటను నిర్మించుకుని అందులో 2 వేల కొరమీను చేపలను పెంచుతున్నాడు. సహజ సిద్ధ పద్ధతుల్లో పెంచుతున్న కోళ్ల ద్వారా ప్రతి నెల 15 నుంచి 20 వేల వరకు, చేపల ద్వారా ఏడాదికి లక్షా 50 వేల వరకు అదనపు ఆదాయం దక్కుతుందని లింగస్వామి హర్షం వ్యక్తం చేస్తున్నాడు.

మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కుందేళ్లను పెంచుతూ ఈ పెంపకందారు లాభదాయకమైన ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు. రెండు లక్షల రూపాయల పెట్టిబడితో 50 కుందేళ్లతో ప్రారంభించి ప్రస్తుతం 200 కుందేళ్లను పెంచున్నాడు. ప్రతి రెండు నెలలకు 200 కుందేళ్లను విక్రయిస్తూ అన్ని ఖర్చులు పోను నెలకు 40 వేల రూపాయల వరకు ఆదాయం అందుకుంటున్నాడు. తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయం వస్తోందని సంతృప్తిని వ్యక్తంచేస్తున్నాడు లింగస్వామి. అయితే కుందేళ్ల పెంపకం మొదలుపెట్టే రైతులు ప్రారంభంలోనే లాభాలను ఆశించకూడదని సూచిస్తున్నాడు. 

Full View


Tags:    

Similar News