రైతులకు కొత్త ఏడాది కానుక

ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అన్నదాతలకు నూతన సంవత్సర కానుకగా 13 కొత్త వంగడాలను రూపొందించారు. వచ్చే ఖరీఫ్ నుంచి వీటిని రైతులకు అందుబాటులకి తీసుకురానున్నారు.

Update: 2019-01-04 05:29 GMT
Agriculture

ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అన్నదాతలకు నూతన సంవత్సర కానుకగా 13 కొత్త వంగడాలను రూపొందించారు. వచ్చే ఖరీఫ్ నుంచి వీటిని రైతులకు అందుబాటులకి తీసుకురానున్నారు. ఈ నూతన వంగడాలు చీడపీడలను తట్టుకుని అధిక దిగుబడులను ఇస్తాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇందులో ప్రధానంగా వరి , చెరకు, మినుము, వేరుశనగ, రాగి, జొన్న రకాలు ఉన్నాయి.

ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల అన్నదాతలకు నూతన సంవత్సర కానుకగా 13 కొత్త వంగడాలను రూపొందించారు. ఇందులో ఏపీ రాష్ట్ర రైతులకు అనుకూలమైనవి 9 రకాలు, దేశవ్యాప్తంగా అన్నదాతలకు ఉపయోగపడేవి 4 రకాలు ఉన్నాయి. వచ్చే ఖరీఫ్‌ నుంచి సాగు చేసుకునేందుకు వీటిని అందుబాటులోకి తీసుకువస్తున్నారు. చీడపీడలను తట్టుకోవడంతో పాటు రైతులకు అధిక దిగుబడి ఇస్తాయని శాస్త్రవేత్తలు ప్రకటించారు. రాష్ట్రానికి సిఫారసు చేసిన వాటిల్లో వరి , చెరకు, మినుము, వేరుశనగ, రాగి, జొన్న రకాలు ఉన్నాయి. సుదీర్ఘంగా ఈ వంగడాలను అభివృద్ధి చేసి అధిక దిగుబడి వచ్చేందుకు రాష్ట్రంలోని వివిధ పరిశోధనా కేంద్రాల శాస్త్రవేత్తలు కృషి చేశారు.

Full View

జాతీయస్థాయిలో సాగు చేసేందుకు సిఫారసు చేసిన వాటిల్లో వరి, వేరుశనగ, చెరకులో రెండేసి రకాలు ఉన్నాయి. రాష్ట్ర రైతాంగంతో పాటు తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, ఛత్తీస్‌ఘడ్ , ఒరిస్సా రాష్ట్రాల రైతులకు కూడా ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

రాష్ట్రానికి సిఫారసు చేసి వరి వంగడాల్లో బాపట్ల మసూరి రకం బీపీటీ 2295 అత్యధిక దిగుబడిని ఇచ్చే వంగడం. 150 నుంచి 155 రోజుల్లో పంట చేతికి వస్తుంది. అగ్గితెగులు, దోమపోటును తట్టుకుంటుంది. పాండురంగ రకం ఎంసీఎం 100, 140 నుంచి 145 రోజుల వ్యవధిలో పండుతుంది. అగ్గితెగులు, ఆకుమచ్చ, పొట్టకుళ్లు, కాండం తొలుచు పురుగును తట్టుకునే రకం ఇది. ఈ రెండూ కూడా పొట్టి గింజరకాలే. భోజనానికి అనువైన రకం.

జొన్నలో నంద్యాల పచ్చజొన్న ఎన్‌జే‌-2446 ను రూపొందించారు. ఇది 125 రోజుల పంట. ఖరీఫ్‌, రబీలలో సాగు చేసుకోవచ్చు. వర్షాభావాన్ని తట్టుకోగలదు. కాండం తొలిచే పురుగును తట్టుకోగలదు. ఇక నంద్యాల తెల్లజొన్నరకం ఎన్‌జే 2647 వంద రోజు పంట. ఏ కాలంలోనైనా పండించవచ్చు. పశువులకు మంచి మేత కూడా.

రాగిలో ఏయూ 3077, రత్నగిరి రకాల సంకరంతో 125 పండే తిరుమల రకం పీపీఆర్ 1012 ని అభివృద్ధి చేశారు. ఖరీఫ్, రబీ , వేసవి లో పండించవచ్చు. పైరు ఏపుగా పెరుగుతుంది. కంకి పెద్దదిగా ఉండి అధిక దిగుబడినిస్తుంది. కాల్షియం ఎక్కువ.

మినుములో ఎల్బీజీ-685, పీయూ -31 రకాల సంగమంతో ఘంటసాల మినుము రకాన్ని రూపొందించారు. 75 రోజుల్ చేతికి వచ్చే ఈ రకాన్ని మూడు కాలాల్లోనూ సాగు చేయవచ్చు. పల్లాకు తెగులును తట్టుకుంటుంది. మాగాణిలోనూ సాగు చేయవచ్చు.

చెరకులో కోయంబత్తూరు ఏ 92081. జీసీ వంగడాల కలయికతో రూపొందించన రంగా 2009 వి127 రకం పది నెలల్లో కొట్టుడుకు వస్తుంది. డిసెంబర్, జనవరి నెలల్లో నాటితే మంచిది. కనీసం మద్దతు ధరకు నిబంధనగా పెట్టిన పంచధార దిగుబడి శాతం 13.9-14.9 వరకు వస్తుంది. చవుడు భూముల్లోనూ సాగు చేయవచ్చు. స్వర్ణముఖి రకం అయితే 19-20 శాతం మధ్య పంచాదార దిగుబడి వస్తుంది. నాణ్యమైన బెల్లం తయారీతో పాటు యంత్రాలతో కోతకు అనువైంది. పరిమిత నీటి వనరులతో కూడా పండించవచ్చు.

వరిలో వరం, క్షీర అనే రెండు రకాల వంగడాలను మచిలీపట్నంలోని వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఎండు తెగులు సహా వివిధ కాల చీడపీడలను తట్టుకునే రకాలివి. గరిష్టంగా 150 రోజుల్లో పంట చేతికి వస్తుంది. వేరుశనగలో అభివృద్ధి చేసిన నిత్య హరిత ,కదిరి చిత్రావతి రకాలు గరిష్టంగా 120 రోజుల్లో దిగుబడిని ఇస్తాయి. వైరస్ తెగుళ్లను కూడా తట్టుకుంటాయి.

నూతనంగా అభివృద్ధి పరిచిన వంగడాలు ఆయా ప్రాంతాల్లోని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా కేంద్రాలలో లభిస్తాయ. కేంద్రం ప్రభుత్వం నిర్ణయించిన ధర మేరకు మార్క్‌ఫెడ్ సంస్థ రైతులకు అమ్ముతుంది.

Similar News