కృష్ణా జిల్లా మామిడి... ఈ పేరు వింటేనే నోరూరుతుంది. ఇక్కడ పండే మామిడి రకాల రుచులు అలాంటివి మరి కానీ వాతావరణ మార్పులు అకలా వర్షాలు గత రెండు మూడేళ్లుగా మామిడి రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. దిగుబడులకు తోడు కాయ నాణ్యత తగ్గడంతో మార్కెట్ లోనూ రైతుకు చేదుఅనుభవమే ఎదురవుతోంది. సరైన ధర రాక రైతుకు సాగు గిట్టుబాటు కావడం లేదు. ఈ పరిస్థితులను గమనించిన సాగుదారులు సాంకేతికతను అందిపుచ్చుకుని కృష్ణా జిల్లా మామిడికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. గత రెండేళ్లుగా ఉద్యానాధికారుల సూచనలు సలహాలతో క్షేత్రస్థాయిలో వారు చేస్తున్న కృషికి ప్రస్తుతం సత్ఫలితాలు అందుతున్నాయి. సీజన్ కంటే ముందు కాయలు మార్కెట్ లోకి రావడమే అందుకు నిదర్శంగా కనిపిస్తోంది. మరి మామిడి సాగులో అవలంభించిన ఆ నూతన సాంకేతిక పరిజ్ఞానమేమిటో తెలుసుకోవాలంటే ఓసారి కృష్ణా జిల్లాలో మైలవరం మండలానికి వెళ్లాల్సిందే.
ఎంత ఎక్కువ విస్తీర్ణంలో పంటలను సాగు చేసామన్నది కాదు ఎంత నాణ్యమైన దిగుబడిని తీసామన్నదే ముఖ్యం. వ్యవసాయ ఉద్యాన ఉత్పత్తుల ధరల నిర్ణయంలో నాణ్యత , డిమాండ్ ప్రధాన కొలమాను. ఏ పంట నాణ్యత బాగుంటుందో ఆ పంటకు మార్కెట్ లో డిమాండ్ ఉంటుంది. మంచి ధర లభిస్తుంది. కానీ ఆ విషయాన్ని రైతు గుర్తించడంలో విఫలమవుతున్నాడు. ముఖ్యంగా మామిడి నాణ్యతను పెంచేందుకు అనేక సాంకేతిక పద్ధతులు అందుబాటులోకి వచ్చినా అవి రైతులకు ఇంకా విస్తృతంగా చేరడం లేదు. గత రెండు మూడేళ్లుగా మామిడి రైతులు సాగులో తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారు. సీజన్ లో కురుస్తున్న అకాల వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్ల దాడితో సతమతమవుతున్నారు. పూత, పిందె రాలి కాయ దిగుబడి తగ్గి మార్కెట్ లోనూ మద్దతు ధర రాక సాగు గిట్టుబాటు కావడం లేదు. ఈ క్రమంలో ఉద్యానాధికారులు మామిడి సాగులో ముందుండే కృష్ణా జిల్లాలోని మైలవరం మండలంలో సాంకేతిక పరిజ్ఞనం సహకారంతో మామిడి పండ్ల నాణ్యతను పెంచేందుకు గత రెండేళ్లుగా కృషి చేస్తున్నారు.
పక్వానికి వచ్చిన దశలో చెట్టుమీదే కొమ్మలకు వాలుతూ నిగనిగలాడుతున్న ఈ మామిడి పండ్లను చూస్తుంటూ మీ నోరూరుతోంది కదా. ఇక చెట్టుపైనే ఆ కాయ పండితే దాని రుచే వేరంటున్నారు రైతులు. ఇదంతా కవర్ టెక్నాలజీ పుణ్యమేనని రైతులు చెబుతున్నారు. పర్యావరణ పద్ధతుల్లో కాయ నాణ్యతను, దిగుబడిని పెంచేందుకు కాగితపు సంచులను కాయలకు కట్టే విధానాన్ని రైతులకు పరిచయం చేశారు ఉద్యానాధికారులు. ఈ పద్ధతిపై విస్తృతంగా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. అందులో భాగంగానే గత ఏడాది కోటి వరకు సంచులను రైతులకు సరఫరా చేశారు. కవర్లు కట్టిన తోటల్లో ఈ కాయ నాణ్యత చూసిన రైతులు ఈ ఏడు వారే స్వయంగా కవర్లను కొనుక్కుని కాయలకు కట్టి మామిడి సాగు చేశారు. ఎలాంటి మంగు, మచ్చలు లేకుండా నిగనిగలాడుతున్న పండ్ల దిగుబడిని పొందుతున్నారని ఉద్యానాధికారులు తెలిపారు. చెట్టుమీద మామిడి కాయ నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడే సంచిని కట్టాలంటున్నారు అధికారులు. ఆ తరువాత 45 రోజుల వరకు సంచిని అలాగే ఉంచితే మంచి నాణ్యమైన కాయ తయారవుతుందని చెబుతున్నారు.
ఈ పద్ధతిలో ఎలాంటి పురుగుమందులు అవసరం లేదు. కవరు కట్టి పండ్లను అలా వదిలేస్తే చాలంటున్నారు ఉద్యానాధికారులు. ఈ విధానంలో కాయ రాలదు, పురుగు సోకదు, కోతుల దాడుల నుంచి పంటను రక్షించుకోవచ్చు. కార్బైడ్ వంటి కెమికల్స్ వాడకుండా పండ్లను ఎంచక్కా పండించుకోవచ్చు. వాటిని వినియోగదారులు నిస్సందేహంగా తినవచ్చు. మామూలు పద్ధతుల్లో పండిన కాయలతో పోల్చుకుంటే ఈ కవర్ టెక్నాలజీ వినియోగించి పండిన పండ్లు 20 రోజుల వరకు పాడవ్వకుండా ఉంటాయి. ఈ నూతన విధానం ద్వారా ఇటు రైతులతో పాటు వినియోగదారులు లాభాలు పొందే అవకాశం ఉంది.
అధికారులు అవగాహన కల్పిస్తున్నారు సరే దానిని రైతులు ఆచరణలో పెట్టి చూపించడం కూడా ముఖ్యం. ఇన్నాళ్లు మామిడి సాగులో కష్ట, నష్టాలను చూసిన రైతులు ఈ కవర్ టెక్నాలజీకి ఆకర్షితులవుతున్నారు. రెడ్డికుంట గ్రామానికి చెందిన రైతు ప్రసాద్ కవర్ల టెక్నాలజీని అందిపుచ్చుకుని మామిడి తోటను సంరక్షించుకుంటున్నాడు. గతంతో పోల్చుకుంటే ఈ విధానం ద్వారా కాయ నాణ్యత పెరగడంతో పాటు దిగుబడి ఆశాజనకంగా వస్తోందని హర్షం వ్యక్తం చేస్తున్నాడు. ప్రస్తుతం సీజన్ కంటే నెల ముందే పంట దిగుబడిని పొందుతున్న ఈ రైతు పక్క రాష్ట్రాలకు పండ్లను ఎగుమతి చేస్తున్నాడు. రానున్న రోజుల్లో విదేశాలకు పండ్లను ఎగుమతి చేస్తానంటున్నాడు.
సాధారణంగా మామిడి తోటల్లో డిసెంబర్, జనవరి మాసాల్లో పూత వస్తుంది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో పూత పిందెలుగా మారుతుంది. మార్చి నెలాఖరు వరకు దిగుబడి చేతికి అందుతుంది. కానీ రెడ్డికుంట గ్రామానికి చెందిన ప్రసాద్ తోటలో మాత్రం ఒక నెల ముందే మామిడి పండ్ల సందడి మొదలైంది.
రైతు ప్రసాద్ గత ఏడాది ప్రయోగాత్మకంగా తోటలో 20 వేల కాయలకు సంచులను కట్టాడు. ఈ విధానంలో నాణ్యమైన పండ్ల దిగుబడిని పొందాడు. సాధారణ విధానంలో పండిని కాయలకు ఈ కాయలకు నాణ్యతలో, రంగులో , రుచిలో ఎంతో తేడా ఉందని గుర్తించాడు. దీంతో ఈ ఏడు ఏకంగా తన 12 ఎకరాల్లో లక్షా 30 వేల కాయలకు సంచులు ఏర్పాటు చేసుకున్నాడు. దిగుబడి కూడా ముందే అందడంతో ఒక దఫా కాయలను వారం క్రితమే మధ్యప్రదేశ్ కు ఎగుమతి చేశాడు. అక్కడి మార్కెట్ లోనూ ఇక్కడ పండిన కాయలకు మంచి గిరాకీ ఉందని ...ఏకంగా క్వింటా మామిడి ధర లక్ష 25 వేలు పలికిందని హర్షం వ్యక్తం చేస్తున్నాడు. ఉద్యానాధికారులు ఇచ్చిన సలహాలు సూచనల తనకు ఎంతగానో ఉపయోగపడ్డాయని రైతు చెబుతున్నాడు.
గత ఏడాది మామిడి కోతలు పూర్తైన తరువాత జూన్ నెలలో చెట్లకు పశువుల ఎరువును అందించాడు ప్రసాద్. ఆ తరువాత కొమ్మల కత్తిరింపులు చేశాడు. ఇలా సమయానుకూలంగా యాజమాన్య పద్ధతులు పాటిస్తూ మామిడి సాగు చేపట్టాడు. నవంబర్ నెలలో కాయ నిమ్మకాయ సైజు రాగానే సంచులను కట్టాడు. కేవలం కవర్లను కట్టి వదిలేయకుండా వాటకి నెంబరింగ్ చేసుకున్నాడు. కాయలన్నింటినీ ఒకేసారి కోయకుండా ముందు కోతకు వచ్చిన వాటిని నెంబరు ప్రకారం కోస్తూ నాణ‌్యమైన మామిడి దిగుబడిని పొందుతున్నాడు. ఈ విధానం ద్వారా చెట్టుపై బరువు పడదని ఆఖరి వరకు నాణ్యమైన మామిడి లభిస్తుందని అంటున్నాడు.
ఎరువులు , పురుగుమందుల వినియోగం తగ్గింది. పూత, కాత రాలే సమస్య లేదు. నాణ్యమైన దిగుబడి వస్తుండటంతో ఎగుమతి అవకాశాలు పెరిగాయంటున్నాడు ఈ రైతు. ఈ ఏడు ఎకరాకు 7 నుంచి 8 టన్నుల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉందంటున్నాడు. ప్రస్తుతం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ , ఢిల్లీకి మామిడిని ఎగుమతి చేస్తున్న ప్రసాద్ రానున్న రోజుల్లోనూ ఈ విధానంలో పండ్లను సాగు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తానంటున్నాడు.
ఈ తరహా మామిడి సాగు చైనా లాంటి ఇతర దేశాలలో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఇదే టెక్నాలజీ కృష్ణాజిల్లా రైతులకు కాసులు కురిపిస్తోంది. మొదట ఈ విధానంలో మామిడి సాగు చేయడం కాస్త ఖర్చుతో కూడుకున్నదని రైతులు భావించినా అనంతరం ప్రసాద్ లాంటి రైతుల మామిడి తోటలను చూసాక మనసును మార్చుకున్నారు. కాయకు కవర్లు కట్టే విధానం ద్వారా తమకెంతో మేలు జరుగుతోందని మైలవరం రైతులు అభిప్రాయపడుతున్నారు. రానున్న రోజుల్లోనూ ఇదే విధానాన్ని కొనసాగిస్తామంటున్నారు.
మైలవరం మండలంలో 50 ఎకరాలతో ప్రారంభమైన ఈ ప్రయోగాత్మక సాగు ప్రస్తుతం 10 వేల ఎకరాలకు విస్తరించింది. ప్రస్తుతం బంగినపల్లి, చెరుకురసం వంటి మామిడి రకాలను ఈ విధానంలో పండిస్తున్నారు. మళ్లీ మామిడికి మంచి రోజులు ఈ సాంకేతిక పరిజ్ఞానంతో వచ్చే అవకాశాలు ఉన్నాయిని రైతులు అభిప్రాయపడుతున్నారు. కాయ నాణ్యత విషయంలోనే కాదు మార్కెట్ లోనూ మంచి ధర మామిడికి దక్కుతోందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇతర రాష్ట్రల వ్యాపారులు మైలవరం మామిడి పండ్లను కొనేందుకు ముందుకు వస్తున్నారని మురిసిపోతున్నారు. రానున్న సీజన్ లోనూ ఇదే విధానం అనుసరిస్తామంటున్నారు రైతులు.
కవర్ టెక్నాలజీతో మామిడి సాగు చేయాలనుకునే ఔత్సాహికుల కోసం అన్నివేళలా సలహాలు సూచనలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామంటున్నారు ఉద్యానాధికారులు. సంచులు కావాలనుకున్న రైతులు నేరుగా ఉద్యానశాఖను సంప్రదిస్తే సరిపోతుందని చెబుతున్నారు. ఒక్కో కవరుకు రెండు రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. రైతు ఎన్ని సంచులు కావాలన్నా తీసుకోవచ్చు. ప్రస్తుతం చైనా, థాయ్‌ల్యాండ్ నుంచి సంచులను తెప్పిస్తున్నప్పటికీ మరికొన్ని రోజుల్లో ఆగిరిపల్లి పండలం గోపాలపురంలో కవర్లను రైతులకు అందుబాటులో ఉంచుతామంటున్నారు.
కవర్ టెక్నాలజీతో పండిన ఈ మామిడి రుచి చూస్తే అందరూ ఫిదా అవ్వాల్సిందే. కాయ పరిమాణం, రంగు చూస్తే అవక్కవ్వాల్సిందే. కాయ మీద ఒక్క మచ్చ కనపడదు. బంగినపల్లి మామిడి పండు నిగనిగలు చూస్తూ రైతులు బంగారం పండిందంటూ సంబురపడుతున్నారు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఈ కవర్ టెక్నాలజీ సాయంతో మామిడి సాగు చేస్తే నాణ్యమైన దిగుబడితో పాటు లాభాలు పొందవచ్చు. ఇతర దేశాలకు ఎగుమతి చేసి అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. వచ్చే ఏడాది ఈ పద్ధతిని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని రైతులను ఆ దాశగా ప్రోత్సహిస్తే మమిడి రైతుల దశ తిరగడం ఖాయంగా కనిపిస్తోంది.