నేటితరం యువకులు సాగు రంగంలో రాణిస్తున్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల వైపు ఆసక్తిని కనబరుస్తున్నారు. పట్టణాల్లో ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాల కోసం వెంపర్లాడకుండా స్వతహాగా ఉపాధిని పొందేందుకు ఇష్టపడుతున్నారు. ఆ కోవకు చెందిన వ్యక్తే కరీంనగర్ జిల్లాకు చెందిన కమలాకర్ రెడ్డి. వ్యవసాయం మీద ఇష్టంతో ఈ రంగంలోకి అడుగుపెట్టిన ఈ రైతు మొదట అవగాహన లేమితో నాటుకోళ్ళ పెంపకంలో నష్టాలను చవిచూశాడు ఆ తరువాత లాభాలనిచ్చే నల్లకోడి పెంపకం గురించి తెలుసుకుని ప్రస్తుతం లాభాల బాటలో పయనిస్తున్నాడు. కడక్‌నాథ్ కోళ్ల పెంపకంలో రాణిస్తున్న ఈ యువరైతు సక్సెస్ స్టోరీని చూసేద్దాం.
ఈ యువకుడి పేరు కమలాకర్ రెడ్డి. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మంగపేట గ్రామం స్వగ్రామం. ఈ యువరైతుది వ్యవసాయం కుటుంబం. ఇంటర్ మీడియట్ పూర్తి చేసిన కమలాకర్ రెడ్డికి వ్యవసాయ అనుబంధ రంగాలపైన ఆసక్తి ఎక్కువ అందుకే ఈ రంగంలో ఆర్ధికాభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో మొదట ప్రత్యేకంగా ఓ షెడ్డును నిర్మించుకుని నాటు కోళ్ల పెంపకం చేపట్టాడు. అయితే ఈ నాటు కోళ్ల పెంపకంలో పెద్దగా అవగాహన లేకపోవడంతో నష్టాలను చవిచూశాడు.
సాగులో నష్టాలు ఎదురైనా వెనకడుగు వేయలేదు. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే సంపాదించాలన్నది ఇతని ఉద్దేశం. అందుకే సామాజిక మాధ్యమాల ద్వారా ప్రత్యామ్నాయంగా ఏం చేస్తే లాభాలను సాధించాలో తెలుసుకున్నాడు. ఈ మధ‌్యకాలంలో నల్లకోడికి అదే కడక్‌నాథ్ కోళ్లకు పెరిగిన మార్కెట్‌ను తెలుసుకుని పూర్తి అవగాహనతో నల్లకోడి పెంపకాన్ని చేపట్టాడు.
మహారాష్ట్ర నుంచి లక్ష రూపాయలను వెచ్చించి 500 కడకనాథ్ చిక్స్‌ను తీసుకొచ్చాడు. పెంపకం మొదలు పెట్టాడు. అవి ఇప్పుడు పెద్దగా కావడంతో కిలో 600 నుంచి 700 రూపాయల వరకు అమ్ముతూ అధిక లాభాలు గడిస్తున్నాడు. కడక్‌నాథ్ కోళ్ళు ఏ వాతావరణంలో నైనా పెంచవచ్చు. అలాగే వీటికి ఇచ్చే ఆహారం లో ప్రత్యేకత అంటూ ఏమీ లేదంటున్నాడు ఈ రైతు. మామూలుగా ఆరుబయట దొరికే ఆహారం లేదా తౌడ్ , వడ్లు , నూకలు కూడా అందియ్యవచ్చని వివరిస్తున్నాడు.
నల్లకోడి గుడ్లను ఇంక్యుబేటర్ల ద్వారా పొదిగిస్తున్నాడు. ఇంక్యుబేటర్ కోనుగోలుకు 2 లక్షల రూపాయలు వెచ్చించాడు. కోడి గుడ్డు ను 40 రూపాయలకు, పిల్లను 80 రూయాలకు తన ఫామ్ దగ్గరే విక్రయిస్తున్నాడు. ఒక్క కోడికి గాను 250 రూపాయల కర్చు పెడితే 5 నెలల్లో 700 రూపాయలు వరకు వస్తున్నాయి అని రైతు వివరిస్తున్నాడు. మొత్తానికి నాటుకోళ్ల పెంపకం కన్నా నల్లకోడి పెంపకంలో అధిక లాభాలు పొందవచ్చు అని అంటున్నాడు రైతు కమలాకర్ రెడ్డి.
వివరాలకు కమలాకర్ ఫోన్ నెం : 8341586198