అన్నదాతలకు శుభవార్త. ఈ ఏడాది రుతుపవనాలు సాధారణంగానే ఉండనున్నాయి. ప్రస్తుత సంవత్సరంలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ అంచనా వేసింది. వర్షాకాల సీజన్‌లో నైరుతి రుతుపవనాల వల్ల దేశంలో సుమారు 70 శాతం వర్షపాతం కురుస్తుందని తెలిపింది.
శతాబ్దాలుగా భారత్‌లో అత్యధిక సాగు విస్తీర్ణం వర్షాలపై ఆధారపడి కొనసాగుతున్నది. ఈ ఏడాది 50 శాతం కంటే ఎక్కువగా సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సాధారణ వర్షపాతం నమోదైతే ఈ ఏడాది పంటల సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. అధిక వ్యవసాయ దిగుబడి రావొచ్చని అంచనా వేస్తోంది వ్యవసాయ శాఖ. అధిక వర్షాలు కురిసే అవకాశం చాలా తక్కువగా ఉందని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అత్యధిక వర్షపాతం నమోదుకావొచ్చు అని స్కైమెట్ అంచనా వేసింది.