లాక్ డౌన్, బంద్‌లు ఏవైనా వారికి మాత్రం వర్తించవు. ఎండ, వాన, చలి దేన్ని లెక్క చేయకుండా తమ పని తాము చేసుకుంటూ వెళ్తుంటారు. కల్లోల కరోనా సమయంలోనూ ఆ రైతులు పనిని మాత్రం ఆపలేదు. నిరాంతరం వారు పనిలోనే నిమగ్నమైపోతుంటారు. కానీ, తాము ఆ పనిచేయకపోతే చాలా ఇబ్బందులే వచ్చి పడతాయంటున్నారు. మరి ఇప్పుడు ఆ రైతుల పరిస్థితి ఏంటీ.. వారి ఆర్థిక స్థితిగతులేంటి..?
కరోనా వైరస్ తో ప్రపంచం అంతా లాక్‌డౌన్ లోకి వెళ్లింది. ప్రజలందరూ ఇళ్లకే పరిమితం అయితే రైతులు నిరంతరం పనిలో నిమగ్నయ్యారు. అందులోనూ పాడి రైతులు లాక్‌డౌన్ ను కాదని తమ పని తాము చేసుకుంటున్నారు. పిల్లలకి, పెద్దలకి ఇలా తేడాలేకుండా ప్రతి కుటుంబానికి పాలు పెరుగు లాంటివి అందిస్తున్నారు.
పాడి వ్యవసాయమంటే చాలా కష్టంతో కూడుకున్న పని. ఉదయం 4గంటలకే ప్రారంభం అయ్యే ఈ పని రాత్రి వరకు కొనసాగుతాయి. ఆ కష్టం చేస్తే ఆత్మసంతృప్తినిస్తుందంటున్నారు రైతులు. పాడిని నమ్మకున్న రైతు ఎప్పటికి నష్టపోలేదు. లాక్‌డౌన్ తో అంతా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో వ్యవసాయం, పాడి పశువుల పోషణతో రైతులు ఆదర్శంగా నిలుస్తున్నారు. అన్ని రంగాల్లో వెనకబడే అవకాశం ఉన్నప్పటికీ వ్యవసాయం, పశు పోషణ చేసే రైతులు మాత్రం భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థకి మూల స్తంభం లా మారనున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా లాక్‌డౌన్ తో ఆర్థిక స్థంభన కొనసాగుతుంటే పాడి రైతులు మాత్రం తమ పని మాత్రం ఆపడం లేదు. ఈ క్లిష్ట సమయంలో మూగజీవులు ఆకలితో ఉండకుండా చూస్తున్నారు.