సిటీ వాసులు ఎప్పుడో పండగలకు పబ్బాలకు మాత్రమే తమ స్వంత గ్రామానికి వెళతారు కానీ ఇప్పుడు అది కూడా తగ్గిపోయింది. దీంతో నేటితరం పిల్లలకు మనం తినే ఆహారం ఎవరు పండిస్తారో ఎలా పండుతాయో కూడా తెలియని పరిస్థితి. అందుకే అందరికి వ్యవసాయం అందులోనూ ప్రకృతి సాగుపై అవగాహాన కల్పించేందుకు ఓ కొత్త ప్రయత్నం చేస్తున్నారు సేంద్రియ వ్యవసాయ రైతు పూర్ణ చందర్ రెడ్డి.
నేటి తరం పిల్లలదంతా యాంత్రీకరణ జీవితం. ఉదయం లేవడం స్కూళ‌్లకు వెళ్లడం తిరిగి సాయంకాలం ఇళ్లకు చేరడం. ఫోన్‌లకు, టీవీలకు అతుక్కుపోవడం షరామామూలైపోయింది. నాలుగు గోడల నుంచి బయటికి కాలు పెట్టె పరిస్థితి లేదు. పక్కింట్లో ఉన్న వారి వివరాలు పూర్తిగా తెలియని రోజులివి.
తల్లిదండ్రులు పిల్లల కాలికి మట్టి అంటకుండా పెంచుతున్నారు. కానీ ఆ మట్టి విలువ రైతుకే తెలుస్తుంది. ఆ బంగారు నేలల నుంచి వచ్చే ఉత్పత్తులనే నేటితరం హాయిగా తింటూ బంగ్లాల్లో హాయిగా బ్రతుకుతున్నారు మరి రైతు విలువ మనం తింటున్న ఆహారం విలువ నేటి తరం వారికి తెలిపేందుకు సేంద్రియ వ్యవసాయ రైతు పూర్ణచందర్‌రెడ్డి పూనుకున్నారు. తన వ్యవసాయ క్షేత్రంలో ఫామ్ బజార్ పేరిట ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఫామ్ బజార్ అంటే ఏదో మార్కెట్ , ఎగ్జిబిషన్ లా కాదు హైదరాబాద్ నగర శివారులోని మోయినాబాద్ ప్రాంతంలో వున్న వ్యవసాయ క్షేత్రం ఇది. ఇక్కడ సేంద్రియ పద్ధతిలో పంటలు పండిస్తుంటారు రైతు పూర్ణచందర్‌రెడ్డి పంటలను మాత్రమే కాదు బాతులు, నాటు కోళ్ళు, చీమకోళ్ళతో పాటు కుందేళ్లు, మేకలు , గొర్రెలను కూడా పెంచుతుంటారు. ఇవన్నీ ఎలాంటి రసాయనిక ఎరువులు లేకుండా సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తారు పూర్ణ. ఇక చుట్టూ మామిడి తోటలో ఎండ్లబండ్లతో మంచి పల్లె వాతావరణం ఆహ్లాదకరాన్ని పంచుతాయి వీటితో ఆర్గానిక్ కూరగాయలు, పళ్ళతో సంతను ఏర్పాటు చేశారు. వీటన్నింటిని ప్రత్యక్షంగా చూపించేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు పూర్ణ.
ప్రతీ ఒక్కరు వివిధ రంగాల్లో పని చేస్తున్నప్పటికి ప్రతి వ్యక్తి రైతు కుటుంబ పునాదుల నుండి వచ్చిన వాళ్ళే కానీ ఈ రోజు వ్యవసాయాన్ని అందరు మరచి పోతున్నారు పండిచిన వాళ్ళు కూడ ఎక్కువ దిగుబడి కోసం రసాయన ఎరువులతో సాగు చేస్తున్నారు. అలా కాకుండా అందరికి ఓ మోడల్ ఫామ్ లా తన వ్యవసాయ క్షేత్రంలో అన్ని రకాల జీవాలను పెంచుతున్నానని అంటున్నారు పూర్ణ నేటి తరం వారికి సేంద్రియ పంటలపై అవగాహాన కల్పించేందుకే ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఫామ్ బజార్ పేరుతో అవగాహాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసామని అంటున్నారు.
సేంద్రియ వ్యవసాయం గురించి నలుగురికి తెలిపేందుకు ఇలాంటి అవగాహాన కార్యక్రమాలు ఎంతగా ఉపకరిస్తాయి. గతంతో పోలిస్తే ఆర్గానిక్ కూరగాయలను తినే వారి సంఖ్య ఇప్పుడిప్పుడే పెరుగుతుంది రైతులు కూడా రసాయనాలను వీడి సేంద్రియ సాగు విధానాలను చేపట్టి మార్కెటింగ్ లో రాణించగలిగితే ఇటు రైతులు లాభాలను సాధించడంతో పాటు వినియోగదారులు మంచి ఆరోగ్యాన్ని అందించిన వారవుతారని అంటున్నారు తెలంగాణ రాష్ట్ర విత్తన ధృవీకరణ సంస్థ డైరెక్టర్ కేశవులు.
వీకెండ్ లలో రిసార్ట్ లు ఫన్ జోన్ లకు బదులుగా ఇలాంటి వ్యవసాయ క్షేత్రాలకు రావటం వల్ల కొత్త ఉత్సాహాన్ని పొందుతున్నామని పిల్లలు అంటున్నారు ఇలా సరదాగా వ్యవసాయక్షేత్రంలో ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తుంటే మా నాన్నమ్మ, అమ్మమ్మ వాళ్ళ ఇళ్లు గుర్తొస్తుందని ఎంతో మమకారంగా చెబుతున్నారు సిటీ చిన్నారులు.
మన ఆహారం ఎలా పండుతుంది వాటిని ఎవరు పండిస్తారు. ఈ విషయాలు నేటితరం పిల్లకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందని అందుకనే సమయం చూసుకుని మరి ఇక్కడికి తమ పిల్లలతో సహా వచ్చి పొలాల్లో తిరుగుతూ ఎంజయ్ చేస్తున్నామంటున్నారు పేరెంట్స్.
ఈ ఫామ్ బజార్‌లో భోంచేయడం కూడా తమకు కొత్త అనుభూతిని కలిగించిందంటున్నారు నగరవాసులు. మట్టి పాత్రల్లో వండుకోవటం అరటి ఆకుల్లో భోజనం చేయడంతో పాటు మట్టి పాత్రల్లోనే నీరు త్రాగటం చాలా ఆనందంగా వుందని మహిళలు అంటున్నారు. చిన్న పిల్లల్లో కూడా ఈ మధ్య కాలంలో ఆర్గానిక్ ఫుడ్ పై ఎంతో అవగాహాన పెరుగుతోంది. మన పాత పంటల సాగు మళ్ళీ రావాలని అందరూ ఆరోగ్యకరమైన ఆర్గానిక్ పుఢ్నే తినాలని అంటున్నారు చిన్నారులు.