పత్తి పంట కోత పూర్తైన తరువాత రైతులు పత్తి కట్టెను కాలబెట్టడం, ఇంటివద్దే వంటచెరుకుగా ఉపయోగించడం, కట్టెను కంచెగా వేయడం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల పత్తి కట్టెలో ఉన్న విలువైన సేంద్రియ కర్బనంతో పాటు పోషకాలు వృథా అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పత్తి పంట కోయగా మిగిలిన కట్టెను వృథాగా పోనీయకుండా నేలలో కలియదున్నడం వల్ల ఎన్నో లాభాలున్నాయంటున్నారు నిపుణులు.
పత్తి సాగులో రైతులు వాడే రసాయన ఎరువుల మోతాదు పెరుగుతోంది. తద్వారా భూమిలో సేంద్రియ పదార్ధాలు తగ్గుతున్నాయి. దీనివల్ల వేసిన రసాయన ఎరువుల సామర్థ్యం తగ్గుతోంది. పత్తి పంట భూమి నుంచి అధిక మోతాదులో పోషకాలను తీసుకుంటుంది. భూమిలో తగ్గుతున్న సేంద్రియ పదార్ధాలు, సేంద్రియ కర్బనం, విచ్చలవిడిగా రసాయన ఎరువుల వాడకం ఏటా అదే భూమిలో పత్తి సాగు చేయడం వల్ల దిగుబడులు పెరుగకపోవడంతో పాటు భూమి నిస్సారంగా మారి నేల ఆరోగ్యం పాడవుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో క్షీణించిన నేలలు, అనిశ్చిత వర్షాలతో కూడిన వ్యవసాయంలో పత్తి పంట నుంచి అధిక ఆదాయంతో పాటు నేల సారాన్ని కాపాడుకోవడం, భూమి ఆరోగ్యం బాగుపడే చర్యలు రైతులు చేపట్టాలి. పూర్వకాలంలో రైతులు పశువుల ఎరువుతో పాటు అవసరమైన సేంద్రియ పదార్ధాలను భూమిలో వేసి దిగుబడి పొందేవారు. ప్రస్తుతం పశువులను పెంచడం క్రమంగా తగ్గిపోతోంది. రైతులు పత్తి ఏరిన తరువాత మిగిలిన పత్తికట్టెను కాలబెట్టడం, ఇంటిలో వంట చెరకుగా వినియోగించడం, కట్టెను కంచెగా వేయడం చేస్తుంటారు. పత్తి కట్టెను కాల్చడం వల్ల గాలి కాలుష్యమవుతుంది. పత్తి కట్టెలో ఉన్న విలువైన సేంద్రియ కర్బనంతో పాటు పోషకాలు వృథా అవుతున్నాయి. అత్యావసరమైన సేంద్రియ పదార్ధాలను బయట నుంచి కాకుండా పత్తి పండించిన చేను నుంచే పత్తికట్టెను కాల్చకుండా భూమికి అందించడం అనేది ఒక మంచి ఆలోచనని అంటున్నారు నిపుణులు. పత్తి ఏరడం పూర్తైన తరువాత ఎకరంలో దాదాపు 10 నుంచి 30 క్వింటాళ్ళ పత్తికట్టె మిగులుతుంది. ఈ కట్టెను భూమిలో కలియ దున్నితే చాలా లాభాలు ఉంటాయి.
భూమిలో సేంద్రియ కర్బనం నిష్పత్తి పెరగడం వల్ల వేసిన రసాయన ఎరువుల సామర్థ్యం పెరుగుతుంది. నేల భౌతిక , రసాయన లక్షణాలను మెరుగుపరుస్తుంది. ఒక ఎకరాకు 5 నుంచి 30 కిలోల వలరకు నత్రజని, పొటాషియం పోషకాలతో పాటు సూక్ష్మపోషకాలు కూడా నేలకు అందచేయవచ్చు. దీనివల్ల రాబోయే పంటల్లో రసాయన ఎరువుల మోతాదు తగ్గి, ఖర్చు కూడా ఆదా అవుతుంది. నేలలో తగ్గిపోతున్న వాన పాములు, సూక్ష్మజీవులను రక్షించి పెంచుకోవచ్చు. నేలకు నీటిని పట్టి ఉంచే సామర్థ్యం పెరుగుతుంది.
పత్తిలో గులాబీరంగు పురుగు ఉధృతిని అరికట్టడానికి పత్తితీతలు పూర్తయ్యాక కట్టెను తీసివేసే సమయంలో ట్రాక్టర్‌తో నడిచే శ్రెడ్డర్ యంత్రంతో ఒక ఎకరంలో పత్తి కట్టెను ఒక గంట సమయంలో నుజ్జునుజ్జు చేసుకోవచ్చు. తరువాత పెద్ద నాగలితో లోతుగా దున్నితే నుజ్జుగా అయిన కట్టెతో పాటు మిగిలిన మొదళ్ళు కూడా భూమిలో లోతుగా కలిసిపోతాయి. ఏప్రిల్, మే నెలలో రోటవేటర్‌తో చదును చేసుకోవాలి. రైతులు 2 కిలోల ట్రైకోడెర్మా విరిడే జీవశిలీంద్ర నాశనిని 100 కిలోల మాగిన పశువుల ఎరువులో కలిపి 8 రోజుల వరకు గోనెసంచితో కప్పి శిలీంద్రాన్ని అభివృద్ధి చేయాలి. దీనిని ఎకరం నేలపై చల్లి రోటవేటర్‌తో నేలను చదును చేసుకుంటే ఇంకా మంచిది. వేసవిలో అప్పుడప్పుడు కురిసే వర్షాలకు భూమిలో కలిసిపోయిన పత్తికట్టె కుళ్ళిపోయి సేంద్రియ ఎరువుగా మారుతుంది. దీంతో రాబోయే పంటలో అంతరకృషికి ఎటువంటి ఇబ్బంది ఉండదు.