కరవు సీమలో లాభసాటి వ్యవసాయం
అత్యల్ప వర్షపాతం నమోదయ్యే ప్రాంతా అది. ప్రతీ ఏటా సరైన వానలు లేక సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోతోంది. ఇలాంటి కరవు సీమలో కూడా ఉన్న కొద్ది పాటి సాగు నీటి వనరులతో లాభసాటి వ్యవసాయం చేస్తున్నాడు ఆ రైతు.
అత్యల్ప వర్షపాతం నమోదయ్యే ప్రాంతా అది. ప్రతీ ఏటా సరైన వానలు లేక సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోతోంది. ఇలాంటి కరవు సీమలో కూడా ఉన్న కొద్ది పాటి సాగు నీటి వనరులతో లాభసాటి వ్యవసాయం చేస్తున్నాడు ఆ రైతు. ఆధునిక సాగు విధానాలను అందిపుచ్చుకుని పప్పు శనగను సాగు చేస్తూ అధిక దిగుబడులను సాధిస్తున్నాడు. అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.
దేశంలోనే అత్యల్ప వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో రెండవ ప్రాంతం గా పేరుపొందిన అనంతపురం జిల్లాలో ప్రతి ఏటా వర్షాలు లేక సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోతోంది. ఈ ఏడాది జిల్లాలో ఖరీఫ్ సీజన్లో 37 శాతం , రబీ సీజన్లో 54 శాతం తక్కువ వర్షపాతం నమోదయింది. ఖరీఫ్ లో సరైన వర్షాలు లేకపోవడంతో వేరుశనగ సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు దీంతో రబీలో అయినా కాస్త లాభాలు వస్తాయన్న ఆశతో రైతులు జిల్లాలో 62 వేల హెక్టార్లలో ఉన్న పప్పు శనగ సాగును ఈ ఏడాది 73 వేల హెక్టార్లకు పెంచారు. అయితే ప్రారంభంలో కురిసిన వర్షం తప్ప ఇంతవరకు వర్షం రాలేదు. దీంతో రైతులకు మళ్లీ నరాశే ఎదురైంది.
ఇటువంటి పరిస్థితుల్లోనూ తన బోరు బావిలో ఉన్న కొద్దిపాటి నీటితో అధిక దిగుబడులు తీస్తూ ఎందరో రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు రైతు లక్ష్మీ నారాయణ రెడ్డి.
అనంతపురం రూరల్ మండలం కురుగుంట గ్రామానికి చెందిన రైతు లక్ష్మీ నారాయణ రెడ్డి. మొదట్లో తనకున్న 10 ఎకరాల భూమిని సాగు చేయడానికి సరైన సమయంలో వర్షాలు రాక ఇబ్బంది పడేవాడు. తన పొలంలో బోరు బావి నుంచి వచ్చే అరకొర నీటితోనే అధిక దిగుబడులు తీయాలని కంకణం కట్టుకున్నాడు. స్వతహాగా కష్టజీవి అయిన లక్ష్మి నారాయణ రెడ్డి వ్యవసాయ అధికారులను సంప్రదించి వారి సలహా మేరకు బిందు సేద్యంతో గత సంవత్సరం వేరుశనగ పంటలో ఎకరాకు 25 బస్తాల దిగుబడి తీశాడు. ఆ తర్వాత వ్యవసాయ అధికారులు ఇచ్చిన అదే బిందు సేద్యం పరికరాలతో పప్పు శనగ పంట ను వేయడానికి ఉపక్రమించాడు.
మొదట్లో వచ్చిన చిన్నపాటి వర్షానికే పప్పు శనగ విత్తనం వేసి ఆ తర్వాత తన వద్దనున్న బిందు సేద్యం పరికరాల తో తడులు ఇస్తూ వచ్చారు రైతు. అనంతపురం జిల్లాలో వేరుశెనగ పంట తర్వాత గణనీయంగా సాగు చేసే పంట పప్పు శనగ. పురుగు ఎక్కువగా ఆశించే ఈ పంట క్రిమిసంహారక మందులు ఎక్కువగానే వాడాల్సి ఉంటుంది కానీ బిందు సేద్యంతో సాగుచేసిన లక్ష్మీ నారాయణ రెడ్డి ఒక్కసారి మాత్రమే క్రిమిసంహారక మందు SPRAY చేశానని మరొకసారి చేసే అవసరం రాలేదని రైతు చెప్తున్నాడు,
ఇక పొలములోని పంటను ఒకసారి పరిశీలిస్తే పూత కాయలు అధికంగానే ఉన్నాయి. కాబట్టి దిగుబడి కూడా ఆశాజనకంగానే ఉంటుందని రైతు చెబుతున్నాడు, పప్పు శనగ పంట కు మూడుసార్లు తడి ఇవ్వడంతోనే సరిపోతుందని ఇక 15 రోజుల్లో పంట కోతకు వస్తుందని ఒక ఎకరాకు దాదాపు ఆరు నుండి పది బస్తాల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉందంటున్నాడు.
నీటి సదుపాయం తక్కువ ఉన్నప్పటికీ రైతు లక్ష్మి నారాయణ రెడ్డి తామ చెప్పిన సలహాలు పాటించి తన వంతుగా కష్టపడడం చూస్తే జిల్లాలోని ఎందరో రైతులకు ఆదర్శంగా నిలుస్తాడని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. కష్టపడే మనస్తత్వం, అధికారుల సూచనలు పాటించే అలవాటు, ఆదునిక సేద్యపు విధానాలను పాటించడం , ప్రకృతి వనరులను సరైన పద్ధతుల్లో వినియోగించడం వల్లే రైతు నారాయణ రెడ్డి తాన పండించే పంటలో అధిక దిగుబడులను సాధించగలుగుతున్నాడు. కరువు సీమలో లాభసాటి వ్యవసాయం చేయవచ్చని నిరూపిస్తున్నాడు.