ఈ వేసవి చాలా హాట్ గా ఉండబోతోంది. ఈ విషయాన్ని భారత వాతావరణ శాఖ గురువారం ఒక నివేదికలో పేర్కొంది. ఈ ఎండాకాలం రికార్డు స్థాయిలో భానుడు భగ్గుమంటాడని ఆ నివేదిక చెబుతోంది. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 0.5 డిగ్రీల సెల్సియస్ నుంచి 1 డిగ్రీ సెల్సియస్ వరకు అదనంగా నమోదు అయ్యే చాన్స్ ఉందని తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా భూతాపం పెరిగిపోవడమే దీనికి కారణంగా ఆ నివేదికలో వెల్లడించారు.
ఈ నివేదికలోని అంచనాల ప్రకారం మార్చి రెండో వారం నుంచే వేసవి తాపం మొదలవబోతోంది. ఇక మేనెలలో వడగాడ్పుల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అయితే, గత సంవత్సరంతో పోలిస్తే ఈ గాడ్పుల తీవ్రత కాస్త తక్కువే ఉండొచ్చని నివేదిక చెబుతోంది.
తెలుగు రాష్ట్రాలో ఈ వేసవి ఇలా..
తూర్పు, ఉత్తర తెలంగాణా జిల్లాలతో పాటు, కోస్తాంధ్రా జిల్లాలపై ఈ వేసవి వేడి ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. దేశంలో అధికంగా ప్రభావితమయ్యే ప్రాంతాల జాబితాలో ఈ మూడు ప్రాంతాలూ ఉన్నాయి.
తెలంగాణా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 45 డిగ్రీలు, రాయలసీమ జిల్లాల్లో 43 నుంచి 44 డిగ్రీల సెల్సియస్‌ను దాటొచ్చని అంచనా వేస్తున్నారు. తెలంగాణలోని ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట ప్రాంతాల్లో ఈ వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.