ఎన్నికల రణక్షేత్రంలో రాహుల్ - బాబు అటాకింగ్‌‌ అస్త్రాలు సంధిస్తారా?

Update: 2018-11-26 07:41 GMT

ఇప్పుడు అందరి చూపూ చంద్రబాబు వైపు అందరి చెవులూ ఆయన మాటల వైపు. తెలంగాణ రణక్షేత్రంలో ఆయనేం మాట్లాడబోతున్నారో విందామనన్న ఆసక్తి..తనపై నలువైపులా నుంచి దూసుకొస్తున్న గులాబీ బాణాలను ఎలా తిప్పికొడతారన్న ఉత్కంఠ బద్ద శత్రువు కాంగ్రెస్‌తో, కొత్త బంధాన్ని ఎలా సమర్థించుకుంటారోనన్న పొలికల్‌ క్యూరియాసిటీ తెలంగాణ ఎన్నికల ప్రచారంలో, చంద్రబాబు డేట్స్‌ ఫిక్స్ ‌కావడంతో, ఇప్పుడు ఇలాంటి ఆసక్తి రేపే అనేక అంశాలు, టీడీపీ అధినేత వైపు చక్కర్లు కొడుతున్నాయి. మరి చంద్రబాబు మాటేంటి..?

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలా వద్దా అంటూ మొన్నటి వరకూ ఊగిసలాడిన, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు, ఎలాగైనా క్యాంపెయిన్‌ చేసి తీరాల్సిందేనని, డిసైడయ్యారు. అదీ కూడా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో కలిసి.ఈనెల 28,29న రాహుల్, చంద్రబాబు ఉమ్మడి ప్రచార కార్యక్రమాలుంటాయని ఇప్పటికే టీపీసీసీ ప్రకటించింది. ఈనెల 28న మధ్యాహ్నం ఖమ్మం, తాండూరులో రాహుల్ గాంధీ, చంద్రబాబుల బహిరంగ సభలుంటాయని తెలిపింది. అలాగే అదేరోజు సాయంత్రం, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో సభలుంటాయని ప్రకటించింది. 29వ తేదీన కూడా రాహుల్, చంద్రబాబు సంయుక్త రోడ్ షోలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. 

తెలంగాణ ఎన్నికల రణక్షేత్రంలో, తొలిసారి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌తో సభావేదిక పంచుకోబోతున్నారు బాబు. బెంగళూరులో కుమారస్వామి ప్రమాణస్వీకారంలో ఇద్దరూ ఫస్ట్‌ టైమ్ చేతులు కలిపారు. ఆ తర్వాత చంద్రబాబే స్వయంగా ఢిల్లీ వెళ్లి, చర్చలు జరిపారు. అప్పుడు జాతీయస్థాయిలో పొత్తుల గురించి మాట్లాడినా, తొలిసారి రాష్ట్రస్థాయిలో పోటీ, జాతీయ ఐక్యతకు నాంది బాటలేసుకుంటున్నారు.  భారీస్థాయిలో రాహుల్-బాబు సభలు నిర్వహించాలని, ప్రజాకూటమి ప్లాన్ చేస్తోంది. 

రాహుల్-చంద్రబాబుల సభ నేపథ్యంలో, సభా వేదిక పైనుంచి టీడీపీ అధినేత, ఏం మాట్లాడబోతున్నారన్నది అందరిలోనూ ఆసక్తి కలిగిస్తోంది. ఇప్పటికే టీడీపీ అధినేత లక్ష్యంగా, కేసీఆర్‌ సెంటిమెంట్‌ మంటలు రగిలిస్తున్నారు. మహాకూటమి అధికారంలోకి వస్తే, అమరావతిదే పెత్తనమంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, కేసీఆర్‌ ఆరోపణలకు, చంద్రబాబు ఎలాంటి సమాధానమిస్తారన్నది ఆసక్తి కలిగిస్తోంది. తెలంగాణ ప్రజలకు ఎలాంటి భరోసానిస్తారు, గులాబీ పార్టీ విమర్శలను ఎలా తిప్పికొడతారన్నది ఉత్కంఠ పెంచుతోంది.

ఇక కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తును అపవిత్ర పొత్తుగా టీఆర్ఎస్, బీజేపీ అభివర్ణిస్తున్నాయి. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఆవిర్భవించిన టీడీపీ, తిరిగి అదే పార్టీతో జట్టుకట్టడం ద్వారా, ఎన్టీఆర్‌ ఆత్మ క్షోభిస్తోందని విమర్శిస్తున్నారు. దీంతో కాంగ్రెస్‌తో కలిసి, ఎన్నికల్లో ఎందుకు పోరాడాల్సి వచ్చిందో, చంద్రబాబు వివరించే అవకాశముంది. జాతీయ, ప్రాంతీయ స్థాయిలో కూటముల ఆవశ్యకతను వివరించే ఛాన్సుంది. కాంగ్రెస్‌ అభ్యర్థులకు సహకరించాలని, క్షేత్రస్థాయిలోని తమ్ముళ్లకు పిలుపునిస్తారని తెలుస్తోంది. ఇలా డిఫెన్సవ్‌గా అస్త్రాలు సంధిస్తూనే, అటు అటాకింగ్‌ మోడ్‌లోనూ చంద్రబాబు విరుచుకుపడే అవకాశముందని, ఆ పార్టీ నేతలంటున్నారు. తెలంగాణ అభివృద్ది, అందులోనూ సైబరాబాద్‌, హైదరాబాద్‌ డెవలప్‌మెంట్‌ను మరోసారి చంద్రబాబు చెప్పుకోవడం ఖాయం.

అయితే, ఇప్పటికే చంద్రబాబు లక్ష్యంగా గులాబీదళం అనేక అస్త్రాలు సంధిస్తోంది. రాహుల్‌, బాబుల కలయికను ప్రశ్నిస్తోంది. త్వరలో వీరిద్దరి బహిరంగ సభలు, రోడ్‌షోలను కూడా తమకు అనుకూలంగా మలచుకునే ఛాన్సుంది. ఒకే వేదికపైనుంచి ఇద్దరి ప్రసంగాల్లోని మాటలను కూడా, ఆయుధాలుగా మలచుకుని, సంధించాలని ఆలోచిస్తోంది టీఆర్ఎస్. ఇలా చంద్రబాబు-రాహుల్‌ల సభ అందరిలోనూ ఆసక్తి కలిగిస్తోంది. ముఖ్యంగా టీడీపీ అధినేత ఏం మాట్లాడతారు గులాబీ అస్త్రాలను ఎలా తిప్పికొడతారు తనపై వచ్చిపడుతున్న నిందలపై ఎలాంటి సమాధానమిస్తారు. జనాలకు ఎలా నమ్మకం కలిగిస్తారన్నది ఉత్కంఠ రేపుతోంది. చూడాలి...రాహుల్‌-చంద్రబాబుల సభ ఎలా జరుగుతుందో...ఎలాంటి మంటలు రాజేస్తుందో.

Similar News