నిజామాబాద్ జిల్లా, బాల్కొండలో ఆ రెండు గ్రామాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. పక్కపక్క ఊర్లయినా, కళ్లు ఉరిమి చూసుకుంటున్న పరిస్థితి. చివరికది, అభ్యర్థుల వెన్నులో వణుకుపుట్టిస్తోంది. ఆ గ్రామాల పేర్లు చెబితేనే నేతలు వణికిపోతున్నారు. ఇంతకీ ఏవా గ్రామాలు...ఎందుకీ యుద్ధ వాతావరణం?
హన్మంత్ రెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా చౌట్ పల్లి - హస కొత్తూరు గ్రామాలకు కొన్నేళ్లుగా సాగునీటిని విడుదల చేస్తున్నారు. చౌట్ పల్లి గ్రామానికి 65 శాతం, హస కొత్తూరుకు 35 శాతం నీటిని వాటాగా తేల్చి పంపిణి చేస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. హస కొత్తూరుకు కొత్తగా గేట్ వాల్వ్ మంజూరు చేయడం వివాదానికి ఆజ్యంపోసింది. గేట్ వాల్వ్ బిగిస్తే తమ చెరువులకు సక్రమంగా నీళ్లు అందవంటూ చౌట్‌పల్లి గ్రామస్ధులు ఆందోళనకు దిగగా మంజూరైన గేట్ వాల్వ్ బిగించాలని హస కొత్తూరు వాసులు పోరుబాట పట్టారు. ఫలితంగా ఇరు గ్రామాల మధ్య గేట్ వాల్వ్, వివాదం రేపింది.
అధికార పార్టీ నేత ఈ విషయంలో అత్యూత్సాహం ప్రదర్శించడం గ్రామస్ధులను కన్నెర్ర చేసేలా చేసింది. ఫలితంగా ఇరు గ్రామాల ప్రజలు, సదరు నేతపై రగిలిపోతున్నారు. ఇరు గ్రామాల మధ్య నెలకొన్న గేట్ వాల్వ్ వివాదాన్ని పరిష్కరించే వరకు, ఓటేయమంటూ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు గ్రామస్ధులు ప్రకటించారు. చౌట్‌పల్లి హన్మంత్ రెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా, నీటి పంపిణికి మంజూరైన గేట్ వాల్వ్ బిగించాల్సిందేనని, హసకొత్తూరు వాసులు డిమాండ్ చేస్తున్నారు. గేట్ వాల్వ్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని చౌట్‌పల్లి వాసులు హెచ్చరిస్తున్నారు.
గేట్ వాల్వ్ వివాదం ఫలితంగా ఇరు గ్రామల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్ధితి నెలకొంది. వివాదం పరిష్కరించకుండా నీటిని విడుదల చేయవద్దని గ్రామస్ధులు కోరుతుండగా.. చౌట్ పల్లి డిస్ట్రిబ్యూటరీకి నీటి విడుదల చేయడం వివాదాన్ని మరింత మండించింది. పైప్ లైన్లను ధ్వంసం చేసి రైతులు నిరసన వ్యక్తం చేశారు. రెండు గ్రామాల మధ్య ఎప్పుడు ఏమవుతుందోనన్న ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. దీంతో పోలీసులు మోహరించారు. అటు చౌట్‌పల్లి గ్రామాభివృద్ది కమిటీ - హసకొత్తూరు గ్రామాభివృద్ది కమిటీలు నీటి విడుదల విషయంలో రాజీ పడటం లేదు. ఓట్లు వేయకూడదంటూ గ్రామస్థులు తీర్మానం చేశారు.
హసకొత్తురు- చౌట్ పల్లి గ్రామాల మధ్య నెలకొన్న జల జగడంతో మరో మూడు గ్రామాలకు సాగునీరు అందకుండా పోయాయి. చౌట్‌పల్లిపైన ఉండే, కోనసముందర్, నర్సాపూర్, దమ్మన్నపేటకు నీరు రాక పాలకులపై రైతులు మండిపడుతున్నారు. చిలికి చిలికిగాలివానలా మారుతున్న రెండు గ్రామాల జల జగడానికి పుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఆ దిశలో సర్కారు చొరవ చూపి గ్రామస్ధులు ఎన్నికల్లో పాల్గొనేలా చైతన్యం చేయాలి.