కాకతీయ కాంగ్రెస్‌లో హైబీపీ.. పర్ఫార్మెన్స్ చూపిస్తేనే ప్రెషర్ తగ్గేది?
అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు...కాంగ్రెస్‌లో హైబీపీ పెరుగుతోంది. మహాకూటమి చర్చలు కొలిక్కి రాలేదు...ఎవరికి వారు అభ్యర్థులుగా వాడవాడలా తిరిగేస్తున్నారు. టికెట్ తమదంటే తమదని కాన్ఫిడెన్స్‌గా చెబుతున్నారు. అసలు మహాకూటమిలో ఏ పార్టీకిపోతుందో తెలీక, సతమతమవుతున్న కాంగ్రెస్‌కు, ఆశావహల డిమాండ్లు తలనొప్పి తెచ్చిపెడుతున్నాయి. ముఖ్యంగా ఓరుగల్లు కాంగ్రెస్‌లో, టికెట్లలొల్లి అంతాఇంతా కాదు.
ఆశావాహులు ఎక్కువగా దృష్టిపెట్టిన స్థానం, వరంగల్ పశ్చిమ. ఇక్కడి నుంచి గత ఎన్నికల్లో మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈసారి మాత్రం ఇక్కడి నుంచి టిక్కెట్ ఆశిస్తూ ప్రజల్లోకి వెళుతున్న నేత, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి. ఇప్పటికే ప్రచారం సైతం ప్రారంభించారు. అయితే ఇటివలే కాంగ్రెస్‌లో చేరిన వేం నరేందర్ రెడ్డి, ఇదే టిక్కెట్ హమీపై పార్టీలో చేరినట్ల ప్రచారం సాగుతోంది. మరోవైపు పొత్తులో భాగంగా జనసమితి అధినేత కోదండరాం ఇక్కడి నుండే పోటీ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం.
వర్దన్నపేట. మాజీ ఎమ్మెల్యే, గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలైన కొండేటి శ్రీధర్, నమిండ్ల శ్రీనివాస్, బక్క జాడ్సన్‌లు బీఫాం కోసం తెగ ట్రై చేస్తున్నారు. అయితే ఎవరికివారు ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టారు. పాలకుర్తి. ఇక్కడ గతకొంతకాలంగా జంగా రాఘవరెడ్డి విసృతంగా ప్రజల్లో తిరుగుతున్నారు. అయితే ఇదే టిక్కెట్ పై మాజీ రాజ్యసభ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది. ఢిల్లీ పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్న నేత కాబట్టి, టికెట్ తేచ్చుకోగలడనే చర్చ జరుగుతోంది. స్టేషన్ ఘనపూర్. ఇక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్నవారి లిస్ట్ పెద్దగానే ఉంది. మాజీ మంత్రి విజయ రామారావు, మహిళా నేత ఇందిరా, ఉస్మానియా వైద్యుడు డా. రమేష్ , దొమ్మటి సాంబయ్యలు పోటీపడుతున్నారు. అయితే అధిష్టానం మాత్రం పొత్తులో భాగంగా టిడిపికి ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
డోర్నకల్..ఇప్పటికే ప్రజల్లో తిరుగుతున్న జటోతు రాంచంద్రనాయక్ టికెట్ ఆశిస్తున్నారు. అయితే ఇతనిపై స్దానికేతరుడు అనే ముద్ర వేస్తూ....మాలోతు నెహ్రూ నాయక్ తనకే టికెట్ వస్తుందనే ఆశాభావంతో ప్రచారం చేస్తున్నారు. మహబూబాబాద్...ఇక్కడ బలమైన నేత పోరిక బలరాం నాయక్. ఈసారి ఎమ్మెల్యేగా బరిలోకి దిగాలని డిసైడయ్యారు. అయితే ఇదే టికెట్, పొత్తులో భాగంగా టిడిపి ఆశించే అవకాశం ఉంది. ఇటీవలే టీఆర్‌ఎస్ నుంచి టిడిపిలో చేరిన మోహన్ లాల్ కుడా తనకు టికెట్ వస్తుందన్న ఆశాభావంతో ఉన్నారు. నర్సంపేట..ఇక్కడ కాంగ్రెస్ సిట్టింగ్ దోంతి మాధవరెడ్డి ఉన్నారు. ఇదే స్థానం నుంచి, బరిలోకి దిగాలని టిడిపి సీనియర్ నేత రేవురి ప్రకాష్ రెడ్డి ఆలోచిస్తున్నారు. అయితే కూటమికి ఇవ్వకపోతే రేవూరికి పరకాల, లేదా తూర్పు టికెట్ కేటాయించే అవకాశం ఉంది.
ములుగులో బలమైన నేతగా పేరున్న సీతక్క బరిలోకి దిగాలనుకుంటున్నారు. కానీ ఇక్కడి నుంచి రెండుసార్లు ప్రాతినిథ్యం వహించిన మాజీ ఎమ్మెల్యే పోదేం వీరయ్య ఆదివాసి గిరిజన తెగ నుంచి వచ్చారు. తను కుడా ఈసారి ఇదే టికెట్ ఆశిస్తున్నారు. పరకాలలో టికెట్ పోరు అంతా ఇంతాకాదు. ఇనగాల వెంకట్ రాంరెడ్డి టికెట్ ఆశిస్తూ ప్రచారం చేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో కూడా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అయితే కొండా సురేఖ పార్టీలోకి వస్తే కచ్చింతంగా టికెట్ త్యాగం చేయాల్సి వస్తుంది. లేదంటే కూటమిలో భాగంగా టిడిపికి ఇస్తే, రేవూరి బరిలోకి దిగుతారని ప్రచారం సాగుతోంది. దీంతో ఇనగాల అయోమయంలో ఉన్నారు. ఇలా కీలకమైన వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ టికెట్ల పంచాయితీ, అంత ఈజీగా తెగేలా లేదు. మహాకూటమిలో భాగంగా ఏ నియోజకవర్గం ఎవరిని వరిస్తుందో, ఆశావహుల్లో ఎవరికి టికెట్ దక్కుతుందోనన్న ఉత్కంఠ, జిల్లా కాంగ్రెస్‌లో అంతకంతకూ పెరుగుతోంది.