హెచ్చరికలు... బెదిరింపులు... రెచ్చగొట్టే మాటలు... ఏంటీ సంకేతాలు

Update: 2018-10-16 07:55 GMT

విశాఖ మన్యంలో మావోయిస్టులు, పోలీసుల వ్యూహ, ప్రతివ్యూహాలతో అలజడి కొనసాగుతుంది. లివిటిపుట్టు ఘటన జరిగిన నాటి నుండి ఏవోబి నివురు గప్పిన నిప్పులా మారింది. మహిళా మావోయిస్టు మీనాది బూటకపు ఎన్‌కౌంటర్ అని మావోయిస్టులు ఆరోపించారు. విచారణ పేరుతో అమాయక గిరిజనులను వేధిస్తే సహించేది లేదంటూ పోలీసులను హెచ్చరిస్తూ ఆడియో టేప్ రిలీజ్ చేశారు.

ఇటీవల ఎమ్మెల్యే ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర రావును మావోయిస్టులు హత్య చేసిన నాటి నుంచి విశాఖ మన్యంలో పోలీసులు, మావోల మధ్య అప్రకటిత యుద్ధం కొనసాగుతోంది. మూడు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్-ఒడిశా సరిహద్దులో మహిళా మావోయిస్టు నేత మీనాను భద్రతా బలగాలు కాల్చి చంపాయి. ఇందుకు ప్రతీకారంగా రెండు రోజుల క్రితం ఏవోబీ బోర్డర్ లోని అండ్రపల్లి వద్ద మావోయిస్టులు మందుపాతర పేల్చగా, పోలీసులు తృటిలో తప్పించుకున్నారు. మహిళా మావోయిస్టు నేత మీనా ఎన్ కౌంటర్ పై మావోయిస్టులు ఆడియో టేపును విడుదల చేశారు. ఓ ఉద్యమ ద్రోహి కారణంగానే మీనా పోలీసులకు దొరికి పోయిందని మావోయిస్టుల ప్రతినిధి కైలాసం ఆరోపించారు. ఆమెను సజీవంగా పట్టుకున్న పోలీసులు అతి సమీపం నుంచి కాల్చి చంపారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఏవోబీలో ఉన్న ఆండ్రాపల్లి, జోడాంబో, పనసపుట్టు  ప్రాంతాల్లో భద్రతా బలగాలు గిరిజనులను చిత్రహింసలు పెడుతున్నాయని ఆరోపించారు.  పండుగలు, సెలవులకు బంధువుల ఇళ్లకు వచ్చేవారిని మావోయిస్టులని చెబుతూ పోలీసులు ఎత్తుకుపోతున్నారని ఆరోపించారు. విచారణ పేరుతో అమాయక గిరిజనులను వేధిస్తే సహించేది లేదంటూ మావోయిస్టుల ప్రతినిధి కైలాసం హెచ్చరించారు. మరోవైపు లివిటిపుట్టు ఘటనలో మావోలకు సహకరించారనే అనుమానంతో శోభన్, సుబ్బారావు అనే వ్యక్తులతో పాటు ఇద్దరు గిరిజన మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. మన్యంలో మావోయిస్ట్, పోలీసుల మధ్య పోరుతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని  గిరిజనులు భయంతో వణికిపోతున్నారు.

Similar News