వేటూరి గా పిలవబడే వేటూరి సుందరరామ్మూర్తి సుప్రసిద్ధ తెలుగు సినీ గీత రచయిత. వేటూరి దైతా గోపాలం ఆ తర్వాత మల్లాది వద్ద శిష్యరికం చేశారు. తొలినాళ్ళలో పాత్రికేయునిగా పనిచేసిన వేటూరి కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఓ సీత కథ ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. తర్వాత కొన్ని వేల పాటలను రాశారు. వేటూరి సుందరరామ్మూర్తి 8 నంది అవార్డులతో పాటు మొత్తం 14 అవార్డులు, ఒక జాతీయ పురస్కారం అందుకున్నారు. తెలుగు పాటకు శ్రీశ్రీ తర్వాత జాతీయ ఖ్యాతిని ఆర్జించి పెట్టింది వేటూరియే. మన వేటూరి సంగీత జ్ఞానాన్నీ పదరచనల బాణీల్నీ స్పష్టంగా వంటబట్టించుకొని ఆ బాణీలతో సినిమాపాటకు వోణీలు వేయించారు. సాంప్రదాయ కీర్తనల్లోని పల్లవుల్ని, పురాణసాహిత్యంలోని పంక్తుల్నీ గ్రహించి అందమైన పాటల్ని అలవోకగా రచించడంలో ఆయన అసాధ్యుడు. వేటూరి అనగానే వెంటనే స్ఫురించేది అడవి రాముడు, శంకరాభరణం. ఇంకా సిరిసిరిమువ్వ, సాగరసంగమం, సప్తపది, సీతాకోకచిలుక, ముద్దమందారం, సితార, అన్వేషణ, స్వాతిముత్యం... ఇలా ఎన్నో సినిమాలు...ఈ సినిమాలలోని అందమయిన అద్బుతమయిన పాటలు! శ్రీ.కో.