హైదరాబాద్ జంట పేలుళ్ల కేసులో ఎన్ఐఏ స్పెషల్ కోర్టు తుది తీర్పుని వెలువరించింది. ఈ కేసులోని ఆరుగురు నిందితుల్లో ఇద్దరిని దోషులుగా నిర్థారించిన కోర్టు.. ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటించింది. గోకుల్ చాట్, లుంబినీ పార్క్ పేలుళ్ల కేసులో A1, A2లుగా ఉన్న అక్బర్ ఇస్మాయిల్, అనిక్ షరీక్ సయిద్‌లను దోషులుగా నిర్ధారించింది. వీరికి సోమవారం శిక్షలు ఖరారు చేయనున్నారు. ఆధారాలు లేవంటూ మిగిలిన ఇద్దరిపై కేసు కొట్టారు. మిగిలిన ఇద్దురు నిందితులు పరారీలో ఉన్నారు.
11ఏళ్ల పాటు సాగిన సుదీర్ఘ విఛారణ అనంతరం.. జంట పేలుళ్ల కేసులో ఇవాళ ఇద్దరు నిందితులను ఎన్ఐఏ స్పెషల్ కోర్టు దోషులుగా తేల్చింది. హైదరాబాద్ చరిత్రలో ఇదే అతిపెద్ద మారణహోమం. ఈ కేసు దర్యాప్తును ముందు సీబీఐ చేపట్టినా, అనంతరం ఎన్‌ఐఏకు బదిలీ చేశారు. అయితే ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాదుల పనిగా తేల్చిన ఎన్‌ఐఏ అనీస్ షఫీక్ సయీద్, మహ్మద్ ఇక్బాల్, మహ్మద్ సిద్దిఖ్ షేక్, అమీర్ రసూల్ ఖాన్‌ను అరెస్ట్ చేసింది. అయితే ప్రధాన సూత్రధారితోపాటు ఇద్దరు నిందితులు ఇప్పటికీ పరారీలోనే ఉన్నారు. అయితే 11ఏళ్ల సుదీర్ఘ విచారణ తరువాత ప్రత్యేక కోర్టు ఇవాళ తుది తీర్పును ఇచ్చింది. అయితే మరోసారి ఇలాంటి మారణహోమాలు జరగకుండా దోషులకు ఉరిశిక్ష విధించాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి.
2007 ఆగస్ట్ 25 శనివారం రాత్రి సమయం 7గంటల 50 నిమిషాలవుతోంది.. హైదరాబాద్‌లోని వీకెండ్ అండ్ టూరిస్ట్ స్పాట్లన్నీ పర్యాటకులతో కిటకిటలాడుతున్నాయి. సరిగ్గా రాత్రి 7గంటల 50 నిమిషాలకు నగరం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కోఠిలోని గోకుల్ ఛాట్ దగ్గర, సచివాలయం ఎదురుగా ఉన్న లుంబినీ పార్క్‌లో భారీ బాంబు పేలుళ్లు జరిగాయి. ఏం జరిగిందో తెలుసుకునేలోపే ఆ రెండు ప్రాంతాలు రక్తసిక్తమయ్యాయి. కొన్ని నిమిషాల తేడాతో జరిగిన ఈ రెండు బాంబు పేలుళ్లలో మొత్తం 42మంది చనిపోగా.. సుమారు 70మందికి పైగా గాయపడ్డారు. లుంబినీ పార్క్‌లో 9మంది, గోకుల్ ఛాట్‌లో 33మంది మరణించారు. హైదరాబాద్ చరిత్రలో ఇదే అతిపెద్ద మారణహోమం.
గోకుల్ ఛాట్, లుంబినీ పార్క్ పేలుళ్లు... కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రసంస్థ పనిగా దర్యాప్తు సంస్థలు తేల్చాయి. ఐఎం వ్యవస్థాపకుడు రియాజ్ భత్కల్‌తోపాటు అతని సోదరుడు ఇక్బాల్ భత్కల్ సహా మొత్తం 11మందిపై అభియోగాలు నమోదుచేశారు. మొత్తం 286మంది సాక్షుల వాంగ్మూలం తీసుకున్నారు. నాంపల్లి రెండో అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో మూడు ఛార్జిషీట్లు ఫైల్ చేసిన ఎన్‌ఐఏ మొత్తం 11వందల 25 పేజీల్లో అనేక విషయాలను తెలియజేసింది. పేలుళ్లు ఎలా జరిగాయో ఎలాంటి పేలుడు పదార్ధాలు వినియోగించారో ఛార్జిషీట్‌లో వివరించింది. పేలుళ్లకు సంబంధించి ఎన్‌ఐఏ కీలక ఎవిడెన్స్‌ను కలెక్ట్ చేశారు. హైలీ ఇంప్రువైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ అమ్మోనియం నైట్రేట్ నియోజెల్ 90 పేలుడు పదార్ధాలతో శక్తివంతమైన టిఫిన్ బాంబులను తయారుచేసి వాటికి టైమర్లు అమర్చి పేలుళ్లు జరిపినట్లు తెలిపింది.
మొత్తం 11మందిపై అభియోగాలు నమోదుచేసిన ఎన్‌ఐఏ ప్రధాన సూత్రధారి రియాజ్ భత్కల్‌తోపాటు మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపింది. ఇక్బాల్ భత్కల్‌తోపాటు ఐదుగురు ఉగ్రవాదులు ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉండటంతో అక్కడ్నుంచే ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించనుంది.