ముఖ్యమంత్రి నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ

Update: 2018-08-22 10:27 GMT

ముందస్తు ఎన్నికల సంకేతాల నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంత్రులతో అత్యవసరంగా భేటీ అవుతున్నారు. ఎన్నికల వ్యూహ రచన కోణంలో రాజకీయ అంశాలే అజెండాగా  సమావేశం జరగబోతోంది. ప్రగతిభవన్‌ వేదికగా..జరిగే కీలక సమావేశంలో పాలనపరమైన అంశాలతో పాటు ప్రగతి నివేదన సభ, వచ్చే ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక.. ఎన్నికలు ఎప్పుడు జరిపితే మంచిదనే అంశాలపై సీఎం కేసీఆర్ మంత్రుల అభిప్రాయాలను తీసుకుంటారని తెలుస్తోంది. అలాగే ముఖ్యమంత్రి తన అభిప్రాయంపైనా స్పష్టత ఇస్తారని సమాచారం.

అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ వెళ్తారన్న ప్రచారంతో మంత్రులతో కేసీఆర్ ఆకస్మిక సమావేశం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఈ అత్యవసర భేటీ అనేక ఊహాగానాలకు దారి తీస్తోంది. కేసీఆర్ మంత్రులతో జరుపుతున్న సమావేశంపై టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది. సెప్టెంబర్‌లోనే అభ్యర్థులను ప్రకటిస్తామని, సెప్టెంబర్‌ 2న ప్రగతి నివేదన సభ నిర్వహిస్తామని కేసీఆర్‌ ప్రకటించిన నేపథ్యంలో సమావేశంపై శ్రేణుల్లో పలు రకాల ఊహాగానాలున్నాయి. కొంగర కలాన్‌ ప్రాంతంలో సెప్టెంబర్‌ 2న ప్రగతి నివేదన సభ నిర్వహిస్తామని సీఎం ఇప్పటికే ప్రకటించారు. ఇందుకు 10 రోజులే గడువు ఉండడంతో ఈ అంశంలో అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రులతో చర్చించే అవకాశముందని పార్టీ ముఖ్యులు చెబుతున్నారు. సభ నిర్వహించడం సాధ్యమా, సభ నిర్వహించాల్సి వస్తే ఏర్పాట్లు, బాధ్యతలు, పని విభజన, వీలు కాకుంటే వాయిదా నిర్ణయంపైనా ముఖ్యమంత్రి చర్చించనున్నారు. 

తెలంగాణలో ఎన్నికలు కాలపరిమితి కంటే ముందే జరుగుతాయనే ప్రచారం కొంత కాలంగా సాగుతోంది. పైగా ఆర్నెల్ల ముందుగా ఎన్నికలు నిర్వహిస్తే అది ముందస్తు కాదని  ఇటీవల సీఎం కేసీఆర్‌ కూడా అన్నారు. రాష్ట్రంలో ఎన్నికలను ఎప్పుడు నిర్వహించాలనే అంశపై మంత్రుల సలహాలను ఆయన తీసుకునే అవకాశం ఉంది. కాలపరిమితికే ఎన్నికలు జరపడం.., షెడ్యూల్ కంటే ఐదారు నెలల ముందే ఎన్నికలు జరిపడం ముందస్తు వల్ల వచ్చే లాభ నష్టాలు, సమస్యల గురించి మంత్రులకు వివరిస్తారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకేసారి ఎన్నికలు జరిగితే సంభవించే పరిణామాలు, వేర్వేరుగా జరగడం వల్ల పర్యవసానాలను తెలియజేస్తారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండటానికి ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలపై చర్చ జరగనుంది. 

అటు ముందస్తు ఎన్నికలకు సిద్ధమని  తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. వచ్చే నెలలోనే శాసనసభ రద్దవుతుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా జోస్యం చెప్పారు. ఇక నిన్న అమరావతిలో ఆంధ్రప్రదేశ్‌ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలుగు రాష్ట్రాల్లో పొత్తుల గురించి చర్చించారు. ఇలాంటి రాజకీయ పరిణామాలు, నేతల వ్యాఖ్యానాలు, ముందస్తు ఎన్నికలపై వేడి పెరుగుతోంది. మొత్తంగా వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, రాష్ట్రంలో అత్యవసరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలపై మంత్రిమండలి లోతుగా చర్చ జరిగే అవకాశముందని చెబుతున్నారు. 
 

Similar News