ఇక జన సమీకరణనే మహా జపం,
వచ్చే టిక్కట్ల కోసమె వారి తపం,
సిట్టింగ్లకు వచ్చే గొప్ప ఫిట్టింగు,
సక్సెస్ చెయ్యాలి సార్లు ఆ సెట్టింగు. శ్రీ.కో.
కొంగరకలాన్‌లో ప్రగతి నివేదన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది అధికార తెరాస. దాదాపు 25లక్షల మందితో సభను జరిపి చరిత్ర సృష్టించేందుకు టీఆర్‌ఎస్ పార్టీ కృషి చేస్తోంది. ఈ సభను సక్సెస్ చేయాలని సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. దీంతో నేతలంతా జనసమీకరణపై దృష్టిసారించారు. దీంతో ఐదు నియోజకవర్గాల నుంచి 550 ఆర్టీసీ బస్సులతోపాటు వెయ్యి ట్రాక్టర్లు ఏర్పాటు చేశారు. ఒకరిద్దరి టికెట్లలో మార్పు ఉంటుందని అధినేత సంకేతాలివ్వడంతో సభ సక్సెస్ కోసం ఎమ్మెల్యేలు పోటీపడుతున్నారు. భారమైనా అధినేత దృష్టిని ఆకర్షించేందుకు నానా తంటాలు పడుతున్నారు. అయితే, పైకి మాత్రం కొంగర కలాన్ సభ చరిత్ర సృష్టిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ప్రగతి నివేదన సభ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అగ్నిపరీక్షలా మారింది.